CS Ramakrishna Rao extension | సీఎస్‌గా రామకృష్ణారావును ఎందుకు కొనసాగిస్తున్నారు?

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విధాత):
CS Ramakrishna Rao extension | రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రామకృష్ణారావును సీఎస్‌గా కొనసాగించడం వెనుక ఆంతర్యమేంటన్న చర్చ సచివాలయ ఉన్నతాధికారుల్లో గట్టిగానే సాగుతున్నది. ఇటీవలే ఆయనకు ఎక్స్‌టెన్షన్ లభించిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి కాళేశ్వరం అవకతవకల్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, అవతకవకలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ సీఎం రాసిన లేఖ వంటి పరిణామాల నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బారాజ్‌ల నిర్మాణంపై నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావును విచారించింది. గతేడాది ఆగస్టు నెలలో ఆయన కమిషన్‌కు అఫిడవిట్ అందచేయగా, ఈ ఏడాది జనవరిలో మరోసారి విచారించింది. ఘోష్ తన తుది నివేదికను సీల్డ్ కవర్‌లో జూలై 31న రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందచేశారు. ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యయనం చేశారు. దీనిపై సచివాలయంలో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. అయితే ఈ ప్రజంటేషన్ లో రామకృష్ణా రావు పేరు బయటకు రాకుండా చూశారనే విమర్శలు వచ్చాయి. కమిషన్ విచారించినట్లు నివేదికలో పేర్కొన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా గత నెలలో రామకృష్ణా రావు పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయడం సరైంది కాదనే అభిప్రాయం సచివాలయ ఉన్నతాధికారుల్లో వ్యక్తమవుతున్నది. కమిషన్ నివేదిక ఇచ్చిన తరువాత పరిగణనలోకి తీసుకోకుండా ఆయన వైపు మొగ్గు చూపడం వెనుక ఆంతర్యం ఏమిటనే సందేహాలను వారు లేవనెత్తుతున్నారు.
రేవంత్ రెడ్డి సిఫారసు లేఖను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం సీఎస్‌గా రామకృష్ణారావు మరో ఏడు నెలలు కొనసాగేందుకు వీలుగా ఉత్వర్వులు జారీ చేసింది. దాని ప్రకారం.. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు సీఎస్‌గా రామకృష్ణా రావు కొనసాగనున్నారు. ఇటీవలి అసెంబ్లీ తీర్మానం ప్రకారం కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణ జరగనున్నది. ఈ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికపై కాకుండా, కాళేశ్వరం బారాజ్ లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్.డీ.ఎస్.ఏ) ఇచ్చిన నివేదికలపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సీబీఐకి లేఖ రాయగా.. అది తమకు అందినట్టు దర్యాప్తు సంస్థ ధృవీకరించింది. రాష్ట్రంలో సీబీఐ విచారణకు మార్గం సుగమం చేస్తూ మూడేళ్లుగా ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేస్తూ తెలంగాణ హోం శాఖ సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దర్యాప్తులో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులను విచారిస్తారు. విచారణ అనంతరం సీఎస్‌ను దోషిగా తేల్చితే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఏం సమాధానం చెబుతారని కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. జ్యుడిషియల్ కమిషన్ ఇప్పటికే ఆయనను ప్రశ్నించిందని, ఆ విషయాన్ని ఎలా దాస్తారని అంటున్నారు.
కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీఎల్) బోర్డులో ఆర్థిక శాఖ ఉన్నతాధికారితో పాటు ఇరిగేషన్ శాఖ డిప్యూటీ సెక్రెటరీ సభ్యులుగా ఉన్నారు. 2018 మార్చి 24వ తేదీన అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించి రుణాల పరిమితి రూ.24వేల కోట్ల నుంచి రూ.64 వేల కోట్లకు పెంచుతూ మినిట్స్ లో పేర్కొన్నారు. ఆ తరువాత ఏప్రిల్ నెల 26వ తేదీన జరిగిన అసాధారణ సర్వ సభ్య సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. కార్పొరేషన్ లోని సభ్యుల ఆమోదం ప్రకారం బోర్డు ఆఫ్ డైరెక్టర్ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు, వ్యక్తులు, సంస్థల నుంచి రుణాలు తీసుకుని స్థిర, చర ఆస్తులు తనఖా పెట్టేందుకు అధికారం కల్పించారు. ఇదే కాకుండా అప్పుల పరిమితిని రూ.64వేల కోట్ల నుంచి రూ.95వేల కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడితో ఆగకుండా 2021 జూలై 3వ తేదీన మరోసారి అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అప్పుల పరిమితి రూ.95వేల కోట్ల నుంచి రూ.1,31,280 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరంతో పాటు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు, సదర్మాట్ బరాజ్‌ల పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు పెంచిన రుణ మొత్తాన్ని వినియోగించుకోనున్నట్లు సమావేశ మినిట్స్ లో పేర్కొన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ 2022 డిసెంబర్ 16వ తేదీన ఆర్థిక శాఖకు ఒక లేఖ పంపించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రుణం అసలు మొత్తంతో పాటు వడ్డీ చెల్లించేందుకు అనుమతించాలని కోరింది. మొత్తంగా ఆర్థిక వ్యవహారాల్లో రామకృష్ణారావు పాత్ర కూడా ఉన్నట్టు వెల్లడవుతున్నది.
కాంగ్రెస్ కార్యాచరణలో హేతుబద్ధత ఉందా?
ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు.. బీఆరెస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికలో రామకృష్ణారావు పేరు కూడా ప్రముఖంగా ఉన్నది. కాళేశ్వరం అవకతవకల విషయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును బోనులో నిటబెట్టాలని కృతనిశ్చయంతో ఉన్న తరుణంలో రామకృష్ణారావును రిటైర్మెంట్ తర్వాత కూడా సీఎస్‌గా కొనసాగిస్తున్నది. దీనిని గమనిస్తే.. కాంగ్రెస్ పార్టీ కార్యాచరణలో హేతుబద్ధత లేదన్న విషయం అర్థమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.