కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

బీఆరెస్ బోథ్‌ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

విధాత : బీఆరెస్ బోథ్‌ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కాంగ్రెస్‌లో చేరారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో రాథోడ్ బాపురావు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జి. ఈశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజ్ మహమ్మద్, రవీందర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే క్రమంలో నేడో రేపో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మధన్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం.

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సిటింగ్ మధన్‌రెడ్డిని కాదని, నర్సాపూర్ టికెట్‌ను బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనూహ్యంగా సునితాలక్ష్మారెడ్డికి ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనకు మెదక్ ఎంపీ టికెట్ హామీ ఇచ్చారు. తీరా మెదక్ ఎంపీ టికెట్‌ను మాజీ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డికి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన మధన్‌రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.