Site icon vidhaatha

Godavari , Krishna | గోదావరి గలగల.. కృష్ణమ్మ వెలవెల

Godavari , Krishna

విధాత: ఎగువన ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి గలగల పారుతున్నది. గోదావరి, దాని ఉపనదులపై ఉన్న ప్రాజెక్ట్‌లు జలకళ సంతరించుకున్నాయి. కడెం ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తింది. దీంతో నాలుగు లక్షల క్యూసెక్కుల వరద గోదావరిలోకి వదిలారు. పైన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు 92 వేల క్యూసెక్కుల భారీ వరద వస్తున్నది.

ఈ వరద ఇలాగే వస్తే ఒకటి రెండు రోజుల్లో ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది. గోదావరి ఉపనది అయిన మంజీరాకు భారీగా వరద వస్తున్నది. అతి కొద్ది రోజుల్లో సింగూరు ప్రాజెక్ట్‌లోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. గోదావరికి అతిపెద్ద ఉపనది అయిన ప్రాణహిత నుంచి గోదావరిలోకి ఎత్తున ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద వచ్చిన నీటిని వచ్చినట్లే అధికారులు కిందకు వదులుతున్నారు.

భద్రాద్రి వద్ద దాదాపు ఆరు లక్షల క్యూసెక్కుల వదర వస్తోంది. గోదావరి వరదతో తన ఉగ్ర రూపాన్ని చూపిస్తుంటే… కృష్ణాప్రాజెక్ట్‌లలోకి వరద నీరు రావడం లేదు. కృష్ణా పరివాహక ప్రాంతంతో పాటు, దక్షిణ తెలంగాణలో సరైన వర్షాలు లేక పోవడంతో జూరాల, ఆర్డీఎస్‌, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌లు వట్టిపోయి కనిపిస్తున్నాయి.

సాగర్‌ ఎడమ కాలువకు ఇప్పటి వరకు సాగునీరు వదలని పరిస్థితి ఏర్పిడింది. కాగా హైదరాబాద్‌ చుట్టూ కురుస్తున్న వర్షాలతో మూసీ నదికి భారీగా వరద ప్రవాహం వచ్చింది. దీంతో నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయిలో నిండడంతో గేట్లు ఎత్తి వేశారు.

Exit mobile version