హాత్ సే.. హాత్ జోడో: ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో కుమ్ములాటలు
విధాత, నిజామాబాద్: భారత్ జోడో యాత్ర సందేశాన్ని ఇంటింటికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ చేపడుతున్న హాత్ సే హాత్ జోడో యాత్ర ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపై నడిపించలేక పోతోంది. సొంత పార్టీలోనే అసంతృప్తి, అసమ్మతి, రాజకీయ స్వార్థ ప్రయోజనాలు, నాయకత్వ లేమి హాత్ సే హాత్ జోడో లో స్పష్టమవుతుంది. ఈ కారణంగా నియోజకవర్గంలో బలమైన నాయకురాలిగా వున్న జమునా రాథోడ్ ఇటీవలే కాంగ్రెస్ ను వీడి షర్మిల పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గిరిజన […]

విధాత, నిజామాబాద్: భారత్ జోడో యాత్ర సందేశాన్ని ఇంటింటికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ చేపడుతున్న హాత్ సే హాత్ జోడో యాత్ర ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపై నడిపించలేక పోతోంది. సొంత పార్టీలోనే అసంతృప్తి, అసమ్మతి, రాజకీయ స్వార్థ ప్రయోజనాలు, నాయకత్వ లేమి హాత్ సే హాత్ జోడో లో స్పష్టమవుతుంది.
ఈ కారణంగా నియోజకవర్గంలో బలమైన నాయకురాలిగా వున్న జమునా రాథోడ్ ఇటీవలే కాంగ్రెస్ ను వీడి షర్మిల పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గిరిజన జనాభా అధికంగా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి జమునా రాథోడ్ గౌరవప్రదమైన ఓట్లను సాధించారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో భాగమైన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయి చాలా కాలంగా ఎవరికి వారు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కనీసం రాహుల్ గాంధీ పిలుపు మేరకు రెండు వర్గాలు కలుస్తాయని భావించిన పార్టీ శ్రేణులకు నిరాశే మిగిలింది. చేయి చేయి కలుపుదాం.. అనే నినాదం ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో పార్టీ స్ఫూర్తికి విరుద్దంగా ఉండడంతో కార్యకర్తలు అయోమయంలో వున్నారు.
గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాజాల సురేందర్ 30 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత పరిణామాల్లో సురేందర్ పార్టీని వదిలి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ నియోజకవర్గం నుంచి తొలుత కాంగ్రెస్ టికెట్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి. అంతలోనే కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుడిగా ఉండి అన్ని తానై నడిపించిన ఓ నాయకుడు తన ఢిల్లీ పలుకుబడిని ఉపయోగించి వడ్డేపల్లికి బదులు సురేందర్‌కు టికెట్ ఇప్పించిన విషయం పార్టీ కార్యకర్తలకు తెలిసిందే.
సదరు నాయకుని అనుచరులు తమ నాయకునికి ఢిల్లీలో వున్న పలుకుబడి గురించి గొప్పగా ప్రచారం చేసుకున్న విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకోవచ్చు. సదరు నాయకుడు రాత్రికి రాత్రి ఢిల్లీ వెళ్లి సురేందర్ కు టికెట్ కేటాయించేలా అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ ఇప్పించడం, తర్వాత పరిణామాల్లో అదే నాయకుని కనుసన్నల్లో మరో పార్టీకి సురేందర్ పిరాయించడం చక చకా జరిగిపోయాయి.
ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, మదన్మోహన్ రావులు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పిసిసి ప్రధాన కార్యదర్శి కాగా మదన్మోహన్ రావు ఉపాధ్యక్షుడిగా వున్నారు. ఇద్దరు కూడా ఆర్థికంగా మంచి స్థితిలో ఉండడం వల్ల ఇరువురు బలమైన వర్గాలను కలిగి వుండి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలను ఈ ఇద్దరు నాయకులు తమ తమ అనుచరగణంతో వేర్వేరుగా నిర్వహించడం పార్టీ క్యాడర్‌ను అయోమయంలో పడేసింది.
ఇరు వర్గాలు పలుమార్లు బాహాబాహీకి తలపడ్డాయి. పరస్పరం దాడులకు పాల్పడి గాయాలు కాగా ఆసుపత్రికి వెళ్లిన సంఘటలు ఉన్నాయి. అంతే కాదు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన రచ్చబండ, మన ఊరు -మన పోరు వంటి కార్యక్రమాల్లో పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి.
గత సంవత్సరం జూన్ లో నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపల్లి తండాలో ఇరువర్గాలు తలపడి దాడులు చేసుకున్నారు. పలువురు కార్యకర్తలకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. గత ఏడాది ఏప్రిల్ లో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి సందర్బంగా రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. తర్వాత మే నెలలో లింగంపేట మండలం కోమట్పల్లి రచ్చబండ కార్యక్రమంలో ఇరువర్గాలు ఘర్షణ పడిన సంఘటనలు పార్టీ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి.
ఇదిలా వుండగా టీడీపీని వీడి కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి వచ్చినపుడు ఆయన వెంట వచ్చిన 11 మందిలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఒకరు. రేవంత్ రెడ్డి అనుచరుడిగా పార్టీని నడిపిస్తున్న సుభాష్ రెడ్డికి సొంత పార్టీలోనే మదన్మోహన్ రావు రూపంలో గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. మదన్మోహన్ రావు ఒకసారి టీడీపీ నుంచి, మరోసారి కాంగ్రెస్ నుంచొ జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచొ రెండు సార్లు పోటీ చేశారు.
చివరి సారి బీబీ పాటిల్‌పై స్వల్ప మెజారిటీతో ఓటమి చవి చూశారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీలోని నాయకులు చెయ్యి ఇచ్చిన విషయాన్ని గ్రహించినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చనీయంగా మారింది. పార్టీలో తనకు వెన్ను పోటు పొడిచిన వారిని ఢీకోనేందుకు సిద్దపడ్డారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తన వర్గానికి చెందిన వ్యక్తిని మదన్మోహన్ గెలిపించుకున్నారు.
దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న మదన్మోహన్ రావు ఇక పార్లమెంటరీ నియోజకవర్గం కంటే ఎక్కువ ఇప్పుడు ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ పై దృష్టి సారించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితపై పోటీ చేసినందుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లుగా పార్టీ వర్గాల నమ్మకం.
అదే నమ్మకంతో సుభాష్ రెడ్డి తనదైన శైలిలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో వున్నారు. అదే స్థాయిలో మదన్మోహన్ రావు సైతం సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలతో నిత్యం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తానే కాబోయే ఎమ్మెల్యేనని బహాటంగా మదన్మోహన్ రావు ప్రచారం చేసుకోవడం గమనార్హం.
ఇదే విషయాన్ని మదన్మోహన్ గతంలో తాను ఏ ఎన్నికలు ముందు వస్తే దానికే పోటీ చేస్తానని వెల్లడించారు. ఇప్పుడు మదన్మోహన్ పల్లె పల్లెకు తిరుగుతూ హాత్ సే హాత్ జోడో.. తో బిజీగా వుండగా సుభాష్ రెడ్డి రేవంత్ పాదయాత్రలో పాల్గొంటున్నారు.
మధ్య మధ్యలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో అన్ని తానై చక్రం తిప్పుతున్న షబ్బీర్ అలీ అనుచరుడిగా సుభాష్ రెడ్డి ఉండగా మదన్మోహన్ రావు మాత్రం షబ్బీర్ అలీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు.
యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి షబ్బీర్ అలీ కుమారున్ని ఓడించిన మదన్ ఇప్పుడు పార్టీ కంటే ప్రజలే ముఖ్యమని భావిస్తున్నారు. సుభాష్ రెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ తప్పించి సురేందర్‌కు ఇప్పించిన షబ్బీర్ అలీ వెంటే సుభాష్ అంటి పెట్టుకోవడం, మదన్ షబ్బీర్‌కు వ్యతిరేకంగా పనిచేయడం వంటి పరిస్థితిలో హాత్ సే.. హాత్ జోడో.. కాస్త హాత్ సే.. హాత్ తోడోగా మారింది.