• Telugu News
  • /Latest

HCU: అమ్మకానికి HCU 400 ఎకరాలు.. భగ్గుమన్న విద్యార్థి లోకం!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ హెచ్ సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Reported by: Somu | latest | Mar 13, 2025, 7:35 pm IST
Read Time: 3 mins
HCU: అమ్మకానికి HCU 400 ఎకరాలు.. భగ్గుమన్న విద్యార్థి లోకం!

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ హెచ్ సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున వర్సిటీ మెయిన్ గేట్ వద్దకు చేరుకొని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్ధుల ఆందోళనలతో  యూనివర్సీటీలో ఉద్రిక్తత నెలకొంది.

2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఒక స్పోర్ట్స్ అకాడమీకి ఎకరానికి 50 వేల చొప్పున కేటాయించింది. కానీ ఈ భూమిలో అకాడమీ కార్యకలాపాలు కొనసాగించలేకపోవడంతో తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిని టీజీఐఐసీ ద్వారా వేలం వేసి నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీ వరకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు టీజీఐఐసీ ప్రకటించింది.

భూములు వేలం వేయవద్దని హెచ్‌సీయూ విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం హెచ్ సీయూ భూముల వేలాన్ని నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. యూనివర్సీటీ నాలుగు వందల ఎకరాల భూమిలో వేలాది చెట్లు, పక్షులు, వివిధ జాతుల జంతువులు, వందల సంవత్సరాల నాటి శిలలు(రాక్స్) ఉన్నాయని వీటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.