Musi River Revival  | మూసీ పునరుజ్జీవనం! పేదలకు ఓ న్యాయం.. పెద్దలకు మరోటి?

మూసీ పునరుజ్జీవనం పేరుతో నది వెంట ఉన్న పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చేసిన ప్రభుత్వం.. నిబంధనలకు విరుద్ధంగా మూసీ వెంబడి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టిన బడా సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Musi River Revival  | మూసీ పునరుజ్జీవనం! పేదలకు ఓ న్యాయం.. పెద్దలకు మరోటి?

Musi River Revival  | హైదరాబాద్, ఆగస్ట్‌ 11 (విధాత) :  కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తున్న పదం మూసీ పునరుజ్జీవనం! ఈ పదం విన్నప్పుడల్లా మూసీను కబ్జా చేసిన ఘనాపాఠీలు ఎంత కంగారు పడతారో తెలియదు కానీ.. ఈ మహా నగరంలో నిలువ నీడలేని వాళ్లు.. మూసీ కంపును భరిస్తూ దాని సమీపంలోనే ఓ చిన్న గుడిశ మహా అయితే.. ఓ రేకుల షెడ్డులాంటిది కట్టుకుని అదే తమ ఇంద్రభవనంగా జీవించే వారి గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతాయి. ఉన్న గూడు ఎక్కడ ప్రభుత్వ అభివృద్ధి వరదలో ఎక్కడ కొట్టుకుపోతుందోనని గుండెలవిసిపోతాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతున్నది. మూసీ పునరుజ్జీవనం పేరుతో నది వెంట ఉన్న పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చేసిన ప్రభుత్వం.. నిబంధనలకు విరుద్ధంగా మూసీ వెంబడి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టిన బడా సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా కనీస స్పందన ఉండటం లేదని పర్యావరణ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలాలు, డ్రైనేజీలు, కాలువలు పూడ్చి నిర్మాణాలు చేపట్టడం వల్లే హైదరాబాద్‌లో వర్షాకాలంలో తరచూ వరద సమస్య ఏర్పడిందని అధికారులు చెబుతూ ఉంటారు. చిన్నచిన్న నాలాలు, డ్రైనేజీలు, చెరువుల పక్కన ఉన్న నిర్మాణాలను యథేచ్ఛగా కూల్చేస్తుంటారు. అయితే.. అందులో చూపిన శ్రద్ధ.. పెద్దపెద్ద కంపెనీల భారీ నిర్మాణాల విషయంలో ఎందుకు లేదని పర్యావరణ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

పునరుజ్జీవనంపై పట్టుదలతో రేవంత్‌ సర్కార్‌

మూసీ నదిని పునరుజ్జీవనం చేయాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. సంబంధించి డీపీఆర్ సిద్దం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో చిన్న వర్షం పడితే వరద పోటెత్తి వాహనదారులు ఇబ్బంది పడుతుంటారు. గంటల తరబడి రోడ్లపై వెయిట్ చేయాల్సి వస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోతున్నాయి. వారం వ్యవధిలోనే మూడు నాలుగు సార్లు నగరం అల్లకల్లోలమైంది. వర్షం నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడమే ఇందుకు కారణమని గుర్తించిన అధికారులు నాలాలు, డ్రైనేజీలు, కాలువలు, చెరువుల వద్ద అక్రమంగా నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇక మూసీ వెంట కూడా గతంలో కొన్ని ఇళ్లు కూల్చివేశారు. మరికొన్ని ఇళ్ల కూల్చివేతకు సంబంధించి మార్కింగ్ చేశారు. మూసీ వెంట ఇళ్ల కూల్చివేతపై రాజకీయ రగడ నెలకొంది. ప్రత్యామ్నాయాలు చూపకుండా హడావుడి చేస్తున్న ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుబట్టాయి. మూసీ పునరుజ్జీవనానికి అన్ని పార్టీలు మద్దతుగా మాట్లాడుతున్నాయి. కానీ, ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్న వారికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు చూపిస్తారనే విషయమై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి. మరోవైపు మూసీ పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం డీపీఆర్‌లను సిద్దం చేయాలని ఓ కన్సల్టెన్సీని కోరింది. ఇంకా నాలుగైదు డీపీఆర్‌లను సిద్దం చేయాలని ప్రభుత్వం సూచించింది. వీటి ఆధారంగా మూసీ పునరుజ్జీవనం పనులు చేపట్టనున్నారు.

పేదలకు ఓ న్యాయం, పెద్దలకు ఓ న్యాయమా?

మూసీ పునరుజ్జీవనం కోసం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మార్కింగ్ చేశారు. చాదర్‌ఘాట్‌ వద్ద ఉన్న ఇళ్లను కొన్ని కూల్చివేశారు. మూసీ పునరుజ్జీవనాన్ని రెండు విడతలుగా చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. తొలి విడతలో నార్సింగి నుంచి బాపు ఘాట్ వరకు, ఫేజ్ 2లో నాగోల్ నుంచి బాచారం వరకు పనులు చేపట్టాలని భావిస్తున్నారు. అయితే మంచిరేవుల రెవిన్యూ పరిధిలో మూసీ వెంట ఓ బడా నిర్మాణ సంస్థ 38 అంతస్థులతో ఒక టవర్ నిర్మిస్తోంది. ఇలాంటివి తొమ్మిది టవర్లు నిర్మిస్తున్నారు. ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతోందని పర్యావరణ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీనిపై పర్యావరణ కార్యకర్త లుబ్నా సర్వత్ ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. మూసీ బఫర్ జోన్‌లో అక్రమంగా ఈ నిర్మాణాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 2024 డిసెంబర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దిగువన ఈ నిర్మాణాలు చేపట్టారు. నిబంధనలు ఎలా ఉల్లంఘించారో ఆమె ఆ ఫిర్యాదులో ఫోటోలను కూడా జతపర్చారు. కానీ, ఇంతవరకు ఈ నిర్మాణ పనులు ఆగలేదు. ఇలా మూసీ వెంట బడా సంస్థలు నిబంధనలకు విరుద్దంగా చేపట్టే నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పర్యావరణ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

రద్దయినా.. మళ్లీ అనుమతి?

గతంలో ఈ సంస్థకు నిర్మాణ అనుమతి లభించింది. అయితే ఆ తర్వాత ఈ అనుమతిని రద్దు చేస్తే తిరిగి అనుమతి తెచ్చుకున్నారనే ప్రచారం సాగుతోంది. బ్యాంకు లోన్లు తీసుకొని ఇళ్లు నిర్మించుకున్నామని.. ఇప్పుడు వాటిని కూల్చి తమకు వేరే ప్రాంతంలో ఇళ్లు ఇస్తామని, లేదా స్థలం ఇస్తామని అంటే ఎలా? అని అప్పట్లో మూసీ పరివాహ ప్రాంతంలో కొందరు బాధితులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము నిబంధనలకు విరుద్దంగా ఇళ్లు నిర్మిస్తే నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారని, బ్యాంకులు ఎలా అప్పులు ఇచ్చాయని నిలదీశారు. అప్పట్లో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి ఆక్రమణలను కూల్చివేసిన సమయంలో హైడ్రాను ప్రతి ఒక్కరూ అభినందించారు. అయితే ఆక్రమరణల పేరుతో చిరు వ్యాపారులు, పేదల ఇళ్ల కూల్చివేసిన సమయంలో హైడ్రా తీరుపై విమర్శలు వచ్చాయి. ఓ నిర్ణయం తీసుకున్న సమయంలో పేదలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ దీన్ని వర్తింపజేయాలని పర్యావరణ కార్యకర్తలు కోరుతున్నారు.

మూసీకి వర్షం నీటిని మళ్లిస్తారా?

జూలై రెండో వారం నుంచి తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ ప్రజలు వణికిపోతున్నారు. వర్షం పడితే బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. హైదరాబాద్ లో కురిసిన వర్షం నీటిని మూసీలోకి మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే మూసీ వెంట పెద్ద పెద్ద కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్దంగా చేస్తోన్న నిర్మాణాలతో మూసీ పునరుజ్జీవనం ప్లాన్ సక్సెస్ అవుతుందా? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నాలాలు, డ్రైనేజీలు, చెరువుల వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. కానీ, మూసీ వెంట ఇలాంటి నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పర్యావరణ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.