పులుల మృతిపై ఉన్నతాధికారుల పరిశీలన

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వరుసగా రెండు పెద్ద పులులు మృతి చెందడం కలకలం రేపింది.

పులుల మృతిపై ఉన్నతాధికారుల పరిశీలన
  • వరుసగా రెండు పులుల మృతితో కలకలం


విధాత: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వరుసగా రెండు పెద్ద పులులు మృతి చెందడం కలకలం రేపింది. కాగజ్‌ నగర్‌ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో టెరిటోరియల్‌ ఫైట్‌(ఆవాసం కోసం పోరు)లో భాగంగా పలులు మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. పలులు మృతి చెందిన ప్రాంతాలను, పీసీసీఎఫ్‌ రాకేష్ డోబ్రియాల్‌, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌ పరాగ్వేన్‌లు సందర్శించారు. అంతకుముందు అధికారులు పులులు టెరిటోరియల్ ఫైట్ లో భాగంగా మృతి చెందినట్లుగా పేర్కొన్నారు.


అయితే పులుల మృతికి ఖచ్చితమైన కారణాలు ర్ధారణ చేసేందుకు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించనున్నారు. తడోబా, కడంబా కారిడార్‌లో పెద్ద పులుల మిస్టరీ మరణాలు వన్యప్రాణి ప్రేమికులను కలవరపరుస్తున్నాయి. ఆదివారం కాగజ్‌నగర్‌ దరిగాంలో ఆడ పులి మరణించి ఉండటాన్ని కనుగొనగా, తాజాగా సోమవారం కూడా మరోపులి మృతిచెంది ఉండటాన్ని ఇదే ప్రాంతంలో గుర్తించారు. శనివారం మృతి చెందిన ఆడపులి గత ఏడాది కాలంగా కాగజ్‌నగర్‌ దరిగాం ప్రధానకాల్వ అటవీ ప్రాంతాల్లో తరుచూ దర్శనమిస్తోంది.


ఈ క్రమంలోనే అవి రెండు పిల్లలకు జన్మనిచ్చినట్టు సమాచారం. కూనల వయస్సు ఏడాది వరకు ఉండోచ్చని అంచనా వేస్తున్నారు. తాజాగా ఆడ పులి చనిపోవటంతో దాని పిల్లలు ఏమై పోయాయని అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే సోమవారం చనిపోయి ఉన్న ఆడపులి ఆ కూనల్లో ఒకటా? లేక వేరే పులా? అనేది తేలాల్సి ఉంది. దరిగాంలోకి మృతిచెందిన ఆడపులి ఆదిపత్య పోరు వల్ల చనిపోయిందని అధికారులు ప్రకటించగా, విషం పెట్టి చంపారా అన్నది అనుమానం? ఈ నేపథ్యంలో నిజాలను నిగ్గు తెల్చేందుకు అవశేషాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించనున్నారు.


ఇటీవల కాలంలో అటు మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో పదికిపైగా పెద్దపులులు ఇదే తరహాలో అనుమానస్పదంగా మృతి చెందాయి. ఇందులో ఒక మహారాష్ట్రలోనే ఏడు పులులు మృతి చెందగా, తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో మరో మూడు పులులు మృతి చెందినట్లయింది. మహారాష్ట్ర ఉదంతంలో ఇక్కడి అధికారులు ఇదేతరహాలో ఆదిపత్య పోరాటాలు కథనాలు విన్పించగా, ఆ ఘటనల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులపై వేటు వేసింది.