సంక్షోభంలో హిమాచల్‌ ప్రదేశ్‌ సర్కార్‌

హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ప్రజాపనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్‌ బుధవారం ఉదయం మంత్రివర్గానికి రాజీనామా చేశారు

  • Publish Date - February 28, 2024 / 11:50 AM IST

  • పీడబ్ల్యూడీ మంత్రి విక్రమాదిత్య రాజీనామా
  • మంత్రుల మధ్య సమన్వయం లేదు
  • పరిస్థితిని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి వివరించా
  • బంతి వారి కోర్టులోనే ఉన్నది
  • మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కొడుకు వ్యాఖ్యలు
  • రహస్య ప్రదేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలు
  • బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం


సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ప్రజాపనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్‌ బుధవారం ఉదయం మంత్రివర్గానికి రాజీనామా చేశారు. విక్రమాదిత్యసింగ్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్‌ కుమారుడు. తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిభాసింగ్‌ అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు చేసినప్పటికీ.. సుఖ్విందర్‌సింగ్‌ సుఖుకు పగ్గాలు అప్పగించింది.


క్యాబినెట్‌ మంత్రిగా ఉన్న తనను అవమానించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని రాజీనామా ప్రకటించిన సందర్భంగా విక్రమాదిత్యసింగ్‌ ఆరోపించారు. ‘పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రిని నేను అన్నివేళలా గౌరవించాను. ప్రభుత్వం పూర్తి క్రమశిక్షణతో నడిచేందుకు సహకరించాను. ఒక మంత్రిగా నా మొత్తం శక్తిని ఉపయోగించి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చానని వందశాతం చెప్పగలను. ముఖ్యమంత్రిని నేను గౌరవిస్తాను.


కానీ.. మంత్రుల మధ్య సమన్వయం ఉండాలి’ అని మీడియాతో అన్నారు. విశ్వాసఘాతుకం జరిగిందని, అదే ప్రస్తుత సంక్షోభానికి కారణమని చెప్పారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? అన్న ప్రశ్నకు.. తన భవిష్యత్తు కార్యాచరణను తాను ఇంకా నిర్ణయించుకోలేదని బదులిచ్చారు. తన అనుచరులు, మద్దతుదారులు, నా క్షేమం కోరుకునేవారితో చర్చలు, సంప్రదింపులు జరపాల్సి ఉన్నదని చెప్పారు. ఆ చర్చల తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటానని తెలిపారు.


పరిస్థితి గురించి పార్టీ అధిష్ఠానానికి వివరించానని సిమ్లా రూరల్‌ ఎమ్మెల్యే కూడా అయిన విక్రమాదిత్యసింగ్‌ చెప్పారు. ‘ఇప్పుడు బంతి అధిష్ఠానం కోర్టులో ఉన్నది. ఏం చర్యలు తీసుకుంటారో వారు నిర్ణయించాలి. నేను చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నాను. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ, ఈ రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి’ అన్నారు.


దుష్ప్రవర్తన కారణంగా 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను హిమాచల్‌ అసెంబ్లీ నుంచి స్పీకర్‌ బహిష్కరించారు. బహిష్కరణకు గురైనవారిలో ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్‌, విపిన్‌ సింగ్‌ పర్మార్‌, రణధీర్‌శర్మ, లోకేందర్‌ కుమార్‌, వినోద్‌ కుమార్‌, హన్స్‌రాజ్‌, జనక్‌రాజ్‌, బల్బీర్‌ వర్మ, త్రిలోక్‌ జమ్వాల్‌, సురేందర్‌ శోరి, దీప్‌రాజ్‌, పురణ్‌ ఠాకూర్‌, ఇందర్‌సింగ్‌ గాంధీ, దిలీప్‌ ఠాకూర్‌ ఉన్నారు.


తమను సస్పెండ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని బుధవారం ఉదయం ఠాకూర్‌ వ్యాఖ్యానించారు. తమను సస్పెండ్‌ చేసి బడ్జెట్‌ను ఆమోదించుకుంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిందని రాజ్యసభ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. ముఖ్యమంత్రి పదవికి సుఖ్విందర్‌సింగ్‌ సుఖు రాజీనామా చేయాలని ఠాకూర్‌ డిమాండ్‌ చేశారు.


ఇదిలా ఉంటే.. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఓటేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపు కార్యకలాపాలకు పాల్పడినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటేసినవారిలో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బుధవారం ప్రత్యేక హెలికాప్టర్‌లో గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లిపోయారు. వీరంతా బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.

Latest News