సెంటు గుప్పుమనేలా ఉంటే మంచిదే.. డిమెన్షియా ముప్పు తప్పిస్తున్న సువాసనలు
మానవుని పరిణామ క్రమం జరిగిన తొలినాళ్ల నుంచి సువాసనలు వెదజల్లే వస్తువుల మీద మనకు ఆపేక్ష ఉన్నట్టు వివిధ ఆధారాలు ఉన్నాయి.

మానవుని పరిణామ క్రమం జరిగిన తొలినాళ్ల నుంచి సువాసనలు (Fragrances) వెదజల్లే వస్తువుల మీద మనకు ఆపేక్ష ఉన్నట్టు వివిధ ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ మనం ఏదైనా సువాసనను అనుభవం చెందితే మనసంతా హాయిగా ఉం టుంది. సువాసనలు, సెంట్లు (Cents) అంటే నచ్చని వారు కూడా ఉంటారు. అయితే తాజా అధ్యయనం (Study) లో తేలిన విషయాన్ని తెలుసుకుంటే మాత్రం ఇక అందరూ తమ ఇంటిని సెంటు సీసాలతో ముంచేస్తారు. సువాసనలు, గాఢమైన సెంట్లు మన జ్ఞాపకశక్తిపై మంచి పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయని పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
తద్వారా వృద్ధాప్యంలో డిమెన్షియా (మతిమరుపు) ముప్పు బాగా తగ్గుతుందని వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన న్యూరో సైంటిస్టులు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలు సైకాలజీ టుడేలో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు 60 నుంచి 85 ఏళ్ల వయసు మధ్య ఉన్న 23 మందికి ఫ్రాగ్రెన్స్ డిఫ్యూజర్లు ఇచ్చి ఉపయోగించమన్నారు. రోజు వారి బెడ్‌రూంలో దానిని వెలిగిస్తే సువాసన వస్తుందని.. రెండు గంటల పాటు ఆ సువాసనలో ఉండాలని సూచించారు. వీరికి రోజ్, ఆరెంజ్, యూకలిప్టస్, లెమన్, పెప్పర్‌మెంట్, రోజ్‌మేరీ, మల్లె పూవుల సుగంధాలు వెదజల్లే డిఫ్యూజర్లను ఇచ్చారు. వీరితో పాటే మరో 20 మందికి అంతగా సువాసన కాని డిఫ్యూజర్లను ఇచ్చారు.
ఆరు నెలల తరువాత వారిని పరిశీలించి చూడగా బెడ్‌రూంలో ఫ్రాగ్రెన్స్‌లను పెట్టుకుని నిదురపోయిన వారిలో డిమెన్షియా వచ్చే ముప్పు తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. డిమెన్షియా లక్షణాలు ఉన్నవారిలో కూడా తీవ్రత తగ్గినట్లు గమనించారు. జ్ఞాపకశక్తిని నిర్ధారించే పరీక్షలు పెట్టగా సువాసనలతో కాలం గడిపిన 23 మందితో పోలిస్తే ఏమాత్రం సువాసన లేని ఫ్రాగ్రెన్స్ వాడిన 20 మంది వెనకబడ్డారు. అంతే కాకుండా ఆ 23 మంది తాము ఎంతో గాఢ నిద్రను పొందామని.. రోజంతా ఉత్తేజంతో పని చేసేవారమని తెలిపారు.
అలాగే వయసును దాచే శక్తి ఉన్న లింబియాటిక్ సిస్టంకు మెదడుకు మధ్య ఉండే యున్‌సినేట్ ఫాసిక్యులస్ బలపడిందని వైద్యులు పేర్కొన్నారు. ఈ పరిశోధనల ఫలితాల ప్రకారం.. రోజంతా సువాసనల మధ్య ఉండకపోయినా పడకగదిలో ఈ ఏర్పాటు చేసుకుంటే వృద్ధాప్యంలో డిమెన్షియా ముప్పు తప్పుతుందని తేలింది. సెంటు, ఫ్రాగ్రెన్స్ వంటికి మెదడులోని అమీగాడ్లా, హిప్పోకాంపస్‌లను ప్రభావితం చేస్తాయి. ఈ భాగాలే మనలోని భావోద్వేగాన్ని, ప్రత్యేక సంఘటనల జ్ఞాపకాలను పదిలపరిచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.