Huzurabad | ఆ సీటు కోసం BRS పాట్లు.. అడిగిందే తడవు కోట్ల నిధులు కేటాయింపు
Huzurabad ఆ ఒక్క నియోజకవర్గం లోనే ఐదుగురికి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టులు అయినా తగ్గుతున్న అధికార పార్టీ గ్రాఫ్ ఏరి కోరి తెచ్చుకున్న ఎమ్మెల్సీ కౌశిక్ తో పార్టీకి భారీగా నష్టం అధికారులు, ప్రజా ప్రతినిధులపై నోటి దురుసు విలేకరుల పైన భౌతిక దాడులు ఎమ్మెల్సీ కౌశిక్ పై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన జి ఎస్ ఆర్ కెమెరామెన్ ముదిరాజ్ ల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు ఆందోళన చేపడతామంటున్న జిల్లా ముదిరాజ్ మహాసభ విధాత బ్యూరో, […]

Huzurabad
- ఆ ఒక్క నియోజకవర్గం లోనే ఐదుగురికి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టులు
- అయినా తగ్గుతున్న అధికార పార్టీ గ్రాఫ్
- ఏరి కోరి తెచ్చుకున్న ఎమ్మెల్సీ కౌశిక్ తో పార్టీకి భారీగా నష్టం
- అధికారులు, ప్రజా ప్రతినిధులపై నోటి దురుసు
- విలేకరుల పైన భౌతిక దాడులు
- ఎమ్మెల్సీ కౌశిక్ పై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన జి ఎస్ ఆర్ కెమెరామెన్
- ముదిరాజ్ ల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు
- ఆందోళన చేపడతామంటున్న జిల్లా ముదిరాజ్ మహాసభ
విధాత బ్యూరో, కరీంనగర్: ఉత్తర తెలంగాణలో ఆ నియోజకవర్గం అధికార పార్టీకి కొరకరాని కొయ్య. అందుకే బీఆర్ఎస్ అధినాయకత్వం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. అడిగిందే తడవుగా అక్కడ అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం కోట్ల రూపాయలు కుమ్మరిస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆ సీటు గెలిస్తే చాలు అన్నంతగా రాజకీయ పౌలు కదుపుతోంది.
తమకు ముచ్చెమటలు పట్టిస్తున్న ప్రత్యర్థిని కట్టడి చేయడానికి ఏమి చేయడానికి అయినా ‘సై’ అంటోంది. ఉద్యమ కాలం నుండి తెలంగాణ జెండా మోసిన వారిని, పార్టీనే నమ్ముకొని పదవుల కోసం ఎదురుచూస్తున్న వారిని కాదని, ఏకంగా ఆ నియోజకవర్గ నేతలకు ఐదు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టింది.
అంతా బాగానే ఉంది.. అక్కడ ఏమైనా పార్టీ ఇమేజ్ పెరిగిందా? అంటే.. ఉన్నది కాస్తా దిగజారుతూ వస్తోంది. నియోజకవర్గం అభివృద్ధిపై వేల కోట్లు ఖర్చుపెట్టినా, తాము ఏరి కోరి ఎంచుకున్న నేతకు విశేష అధికారాలు కట్టబెట్టినా పార్టీ గ్రాఫ్ దిగజారుతుండడం బీఆర్ఎస్ అధిష్టానానికి మింగుడు పడడం లేదు.
అదే హుజురాబాద్ నియోజకవర్గం..
గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి తమ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి, బీఆర్ఎస్ అంతులేని ప్రాధాన్యత ఇచ్చింది. శాసనమండలి సభ్యునిగా ఆయనను నామినేట్ చేసింది మొదలు ప్రారంభమైన వివాదాలు
నేటికీ అధికార పార్టీని వెన్నాడుతూనే ఉన్నాయి.
గవర్నర్ అభ్యంతరాలను త్రోసి రాజని, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన బీఆర్ఎస్ అధినేత
ఆయన సమర్థత మీద నమ్మకంతో ఏకంగా క్యాబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ విప్ అవకాశం కల్పించారు. అయితే ఆయన నోటి దురుసుతనం, ఏకపక్ష విధానాలు,
పార్టీ శ్రేణులను సమన్వయం చేయలేని పరిస్థితి అధికార పార్టీకి లాభం కంటే, అధికంగా నష్టాన్ని తీసుకువచ్చాయి.
మహిళ గవర్నర్ పట్ల నోరు జారి జాతీయ మహిళా కమిషన్ ముందు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చినా, కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు రాలేదు. నియోజకవర్గ అధికారుల పట్ల
దురుసు వైఖరి, వారిని చులకనగా తీసి పారేస్తున్న వైనం.. అధికార వర్గాల్లో కూడా ఆయనంటే ఏహ్యత భావానికి కారణం అయ్యింది.
ఇసుక రవాణా దారుల నుండి గ్రామాల వారీగా మామూళ్ల వసూళ్లు, కార్యక్రమాల నిర్వహణ కోసం అధికారులకు టార్గెట్లు ఆనోట..ఈనోట అధిష్టానం దృష్టికి చేరాయి. తాము హుజురాబాద్ ను
లక్ష్యంగా చేసుకొని అందుకోసం కోట్లు కుమ్మరిస్తున్నా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు అధికార పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి.
ఇటీవల హుజురాబాద్ కేంద్రంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీల సందర్భంగా మహిళ ఎంపీడీవో పట్ల ఎమ్మెల్సీ నోరు జారారు. సదరు ఎంపీడీవో స్థానిక సంస్థల ప్రతినిధులకు సమాచారం ఇచ్చినా,
కౌశిక్ రెడ్డి వ్యవహార శైలితో విసిగిపోయిన అనేకమంది ఆ పోటీలకు దూరంగా ఉండిపోయారు. దీంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్సీ ‘నీతో ఆడిస్తాస అంటూ ఆడిపోసుకున్నారు. ఇక్కడే కౌశిక్ రెడ్డి లోని మరో కొత్త కోణం వెలుగు చూసింది.
విలేకరులే ‘లక్ష్యం’గా..
ఏ కార్యక్రమానికి వెళ్లినా దురుసుగా ప్రవర్తించడం, నోరు జారడం. విలేకరుల కెమెరా కళ్లకు చిక్కడం
ఆయనకు పరిపాటిగా మారింది. హుజురాబాద్ సీఎం కప్ క్రీడా పోటీల సందర్భంగా మహిళ ఎంపీడీవో పట్ల ఆయన అసభ్య సంభాషణ సివిఆర్ విలేఖరి చందు కెమెరాలో నిక్షిప్తమైంది. అది గమనించిన ఎమ్మెల్సీ తన అనుచరులను పురమాయించి, సదరు విలేఖరి చేతిలోని మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు.
అందులో రికార్డ్ అంతటిని తొలగించారు. ఆపై బలవంతంగా ఆ విలేఖరిని తన ఇంటికి తీసుకువెళ్లి
విషయం బయటికి చెప్తే బాగుండదని హెచ్చరించారు. స్థానిక విలేకరులు ఇది పద్ధతి కాదని, ఆయనకు చెప్పడంతో అనేకమార్లు క్షమాపణ కోరారు.
అయినా మనిషి మారలేదు..
తాజాగా గురువారం హుజురాబాద్ అంబేద్కర్ కూడలిలో అమరవీరుల స్మారక స్థూపానికి ఎమ్మెల్సీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళ ఆయనను నిలదీసే ప్రయత్నం చేయగా, స్థానిక జి ఎస్ ఆర్ ఛానల్ కెమెరామెన్ బండి అజయ్ దానిని చిత్రీకరించారు. సివిఆర్ విలేఖరి విషయంలో జర్నలిస్టు సంఘాలతో చివాట్లు తిన్న కౌశిక్ రెడ్డి ఆ విషయాన్ని విస్మరించారు.
కౌశిక్ ఆదేశాలతో ఆయన అనుచరులు అజయ్ చేతిలోని మొబైల్ స్వాధీనం చేసుకొన్నారు. విషయం తెలిసిన సదరు ఛానల్ యజమాని ఎమ్మెల్సీ కి ఫోన్ చేయగా, ఆ కెమెరామెన్ ను తన ఇంటికి పంపాలని, మొబైల్స్ ఇచ్చి పంపిస్తానని చెప్పారు. ఇంటికి వెళ్లిన కెమెరామెన్ పై ఎమ్మెల్సీ భౌతిక దాడికి తెగబడ్డారు.
ఆయన సామాజిక వర్గమైన ముదిరాజ్ కులస్తులను రాయడానికి వీలు లేని విధంగా దూషించారు.
ఎమ్మెల్సీఫై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అమరవీరుల స్మారక స్థూపం శంకుస్థాపన సందర్భంగా తాను చిత్రీకరించిన వీడియోలు తొలగించేందుకు తన మొబైల్ స్వాధీనం చేసుకున్నారని, ఆ తరువాత ఇంటికి రమ్మని భౌతిక దాడికి పాల్పడ్డారని అజయ్ హుజరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను కాళ్ళ వేళ్ళ పడ్డ కనికరించలేదన్నారు. తాను సొమ్మసిల్లి పోయే వరకు కొట్టారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన కులాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టారని, విషయం బయటికి చెప్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి స్తానని, చంపి పారేస్తానని బెదిరించారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్థానిక టీవీ9 విలేకరిపై కూడా ఎమ్మెల్సీ ఇలాంటి దురుసుదనమే ప్రదర్శించారు.
ఆందోళనకు సిద్ధమవుతున్న ముదిరాజ్ కులస్తులు..
తమ కులం పట్ల చులకన భావంగా వ్యవహరించిన, కులాన్ని అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పట్ల ముదిరాజ్ కులస్తులు మండిపడుతున్నారు. జిల్లా ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో
శనివారం కరీంనగర్లో సమావేశమై
ఆందోళనలకు సిద్ధం అవుతున్నారు.