Warangal: నాకు అక్రమ ఆస్తులున్నట్లు రుజువు చేస్తే ఉద్యోగం వదిలేస్తా: CP రంగనాథ్
అరెస్టు అవ్వగానే బిజెపి నేతలు నాపై ఆరోపణలు చేస్తున్నారు గతంలో చేయని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు సెటిల్మెంట్ ఆరోపణలు చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు బిజెపి నేత బండి సంజయ్‌కి వరంగల్ సిపి రంగనాథ్ కౌంటర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నాకు అక్రమ ఆస్తులు ఉన్నట్లు రుజువు చేస్తే ఉద్యోగం వదిలేస్తా… రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం చేస్తున్నా.. అరెస్టు అవ్వగానే బిజెపి నేతలు నాపై ఆరోపణలు చేస్తున్నారు.. గతంలో చేయని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు […]

- అరెస్టు అవ్వగానే బిజెపి నేతలు నాపై ఆరోపణలు చేస్తున్నారు
- గతంలో చేయని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు
- సెటిల్మెంట్ ఆరోపణలు చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు
- బిజెపి నేత బండి సంజయ్‌కి వరంగల్ సిపి రంగనాథ్ కౌంటర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నాకు అక్రమ ఆస్తులు ఉన్నట్లు రుజువు చేస్తే ఉద్యోగం వదిలేస్తా… రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం చేస్తున్నా.. అరెస్టు అవ్వగానే బిజెపి నేతలు నాపై ఆరోపణలు చేస్తున్నారు.. గతంలో చేయని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ కౌంటర్ ఇచ్చారు.
మంగళవారం కమిషనరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంజయ్ ఆరోపణల పై తీవ్రంగా ప్రతిస్పందించారు. నాపై సెటిల్మెంట్ ఆరోపణలు చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు.. నేను ఎక్కడ పని చేసినా అక్కడి జనం నన్ను గుర్తుంచుకుంటారు.
లీడర్లను అప్రోచ్ చేసే వాళ్ళు లోఫర్లు డాఫర్లు మాత్రమేనని అన్నారు. ప్రమాణం చేసే ఉద్యోగంలోకి వచ్చా… ప్రతిసారి చేయాల్సిన పని లేదు అది శాస్త్రీయమంటూ చెప్పారు. పోలీస్ స్టేషన్‌లో న్యాయం జరగాలని నేను ప్రగాఢంగా నమ్ముతాను.
నమ్మకంతో గ్రీవెన్స్ కు వస్తారు
నాపై నమ్మకంతో గ్రీవెన్స్ సెల్ కు వందల మంది వస్తుంటారు అని రంగనాథ్ వివరించారు. ఎంపీ సంజయ్‌కి వీలుంటే రేపు గ్రీవెన్స్‌సెల్ కు రావాలి అంటూ హితవు పలికారు. ఈ కేసు పేపర్ లీకేజీ కాదు ఇది మాల్ ప్రాక్టీస్ మాత్రమే. నిందితులుగా ఉన్న వారి నుంచి మాల్ ప్రాక్టీస్కు ముందు విషయాలు సేకరిస్తున్నామని కమిషనర్ చెప్పారు.
కేసులో ఉన్నవాళ్లు దర్యాప్తును తప్పు పట్టడం కామన్.. అరెస్టు అవ్వగానే బిజెపి నేతలు నాపై ఆరోపణలు చేస్తున్నారు.. గతంలో చేయని ఆరోపణలు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు. కేసులో ఇరుక్కున్నామని అక్కసుతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని బెదిరించడం సరి అయింది కాదు. మేము మా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్నాం. బిజెపిని ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు. బండి సంజయ్ వ్యాఖ్యలు ఒక రకంగా బెదిరించడంగా భావిస్తున్నానని సిపి చెప్పారు.
బిజెపి కార్యకర్తలను అడగండి
నేను ఖమ్మంలో చేసినా, నల్గొండలో చేసినా ఇక్కడ నా పని విధానం నా గురించి బిజెపి కార్యకర్తలు అడగండి.. బెదిరింపులకు లొంగేది ఎక్కడ ఉండదంటూ సిపి రంగనాథ్ తేల్చి చెప్పారు. నల్లగొండ మిర్యాలగూడ సంఘటనలో మారుతీ రావు సీన్లో ఎక్కడ ఉండరు. అయినా ఏ వన్ గా కేసులో పెట్టాము. ఎందుకంటే ఆయనే సూత్రధారి.
పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో కూడా బండి సంజయ్ ని అందుకే ఏవన్ గా నమోదు చేసినట్టు పేర్కొన్నారు. బండి సంజయ్ తో నాకు ఏమైనా గట్టు పంచాయతీ ఉందా? నాకు పరిచయం లేదు. ఉన్న సాక్ష్యాలను బట్టి కేసులో ముందుకు సాగుతామంటూ స్పష్టం చేశారు. సత్యం బాబు కేసులో నేను దర్యాప్తు అధికారిని కాదని చెప్పారు. నందిగామలో ఇతర కేసుల విషయంలో నేను స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్నాను. అంతే తప్ప సత్యం కేసు దర్యాప్తు అధికారిని నేను కాదు.
సంజయ్ ఫోన్ మా దగ్గర లేదు
బండి సంజయ్ ఫోన్ మా దగ్గరికి రాలేదు. తర్వాత ఆయన బెజ్జంకి దగ్గర ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని సిపి రంగనాథ్ చెప్పారు. ఆ విషయంపై కరీంనగర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ విషయంలో నేనేం మాట్లాడను. మా దగ్గర ఆధారాలు, సాక్ష్యం లేకుండా కేసు నమోదు చేయం. అన్నీ ఉన్న తర్వాత పరువు నష్టం ఎలా వేస్తారు? అంటూ ప్రశ్నించారు. నేనేం పరువు నష్టం వేయను ఆయన ఆరోపణలకు వివరణ మాత్రమే ఇది. మరోసారి కూడా ఈ వివరణ ఇవ్వనని సిపి స్పష్టం చేశారు.