Ilu Mahasabhas | భారత రాజ్యాంగం ఒక జీవన విధానం: సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి

Ilu Mahasabhas ఘనంగా ప్రారంభమైన ఐలు రాష్ట్ర మూడవ మహాసభలు 400 మంది ప్రతినిధులు హాజరు విధాత: భారత రాజ్యాంగం కేవలం లిఖితపూర్వకమైన డాక్యుమెంట్ కాదని, అది ఒక జీవన విధానమని, భారతదేశం ఎలా ఉండాలో చెప్పే ఆలోచన మార్గమని సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు జే. విద్యాసాగర్ అధ్యక్షతన ఐలు రాష్ట్ర మూడవ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ జస్టిస్ […]

Ilu Mahasabhas | భారత రాజ్యాంగం ఒక జీవన విధానం: సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి

Ilu Mahasabhas

  • ఘనంగా ప్రారంభమైన ఐలు రాష్ట్ర మూడవ మహాసభలు
  • 400 మంది ప్రతినిధులు హాజరు

విధాత: భారత రాజ్యాంగం కేవలం లిఖితపూర్వకమైన డాక్యుమెంట్ కాదని, అది ఒక జీవన విధానమని, భారతదేశం ఎలా ఉండాలో చెప్పే ఆలోచన మార్గమని సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు జే. విద్యాసాగర్ అధ్యక్షతన ఐలు రాష్ట్ర మూడవ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాద వృత్తి సాధారణ వృత్తి కాదన్నారు.

రాజ్యాంగంలో రాసిన, పేర్కొనబడిన ఏకైక వృత్తి అని తెలిపారు. న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో చేరినప్పుడు చేసిన శపథం మరోసారి అందరం చదువుకోండని కోరారు. భారత రాజ్యాంగంలో పౌర హక్కులు, చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. రాజ్యాంగం కాపాడే బాధ్యత మనపై ఉందన్నారు. ఇది ఉన్నతమైన వృత్తి అని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ న్యాయం అందించటంలో న్యాయవాది పాత్ర ఒక పవిత్రమైన బాధ్యత అని, త్వరితగతిన కేసుల పరిష్కారానికి కోర్టుకు సహకరించి ప్రజలు కోర్టుల ద్వారా న్యాయం పొందటంలో విశ్వాసాన్ని ప్రేరేపించాలన్నారు. ప్రతీ ఒక్క పౌరుడు రాజ్యాంగం ప్రకారం నడుచుకొనుటలో న్యాయవాది కృషి చేయాలని, బార్, బెంచ్ అనుసంధానములో పూర్తి బాధ్యతగా ప్రతీ ఒక్క న్యాయవాది తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలన్నారు.

మానవతా విలువలు నేటి సమాజంలో తగ్గుతున్నందున వాటి విలువలు పెంపొందించి రేపటి మానవ సంఘ నాగరిక భవిష్యత్తు మెరుగుపరచాలని మరియు వైవాహిక జీవన విలువలు పెంపోందించుకోవాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 400 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరయ్యారు. అంతకుముందు అఖిల భారత న్యాయవాదుల సంఘం జెండాను సీనియర్ న్యాయవాది, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు కొత్త బుచ్చిరెడ్డి ఆవిష్కరించారు.

కార్యక్రమానికి విచ్చేసిన రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి మరియు శ్రీ జస్టిస్ కె. లక్ష్మణ్ న్యాయమూర్తులకు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. బాల భాస్కర్ రావు మరియు ఇతర న్యాయమూర్తులు, డి. సి. పి రాజేష్ చంద్ర, న్యాయవాదులు స్వాగతం పలికారు.

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు ఆల్ ఇండియా కార్యదర్శి సురేంద్రనాథ్, ఆహ్వాన సంఘం అధ్యక్షులు నాగారం అంజయ్య, ఏఐఎల్ రాష్ట్ర కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, ఐలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిలు కొల్లి సత్యనారాయణ, నర్రా శ్రీనివాసరావు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మామిడి వెంకటరెడ్డి, ఎండి ఇస్మాయిల్, కే. సోమయ్య, చింతల రాజశేఖర్ రెడ్డి, నర్సింగ్ యాదవ్, రావుల రవీందర్ రెడ్డి, బాబురావు, కేశవరెడ్డి, లింగారెడ్డి, జగత్, బొల్లెపల్లి కూమార్, మెహన్, ఎండి నిహాల్, బోడ్డు కిషన్, వెదేశ్వర్, శంకర్, ఐలయ్య, గొలనుకొండ లింగయ్య, పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ఐలు రాష్ట్ర మహాసభలు.

భువనగిరిలో ఏర్పాటుచేసిన అఖిలభారత న్యాయవాదుల మూడవ రాష్ట్ర మహాసభలు ఏర్పాటు పలువురిని ఆకట్టుకున్నాయి. ప్రాంగణం వద్ద తోరణాలతోపాటు స్వాగత కటౌట్లను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో కూడా భువనగిరి చరిత్రకు సంబంధించిన సుమారు 60 కటౌట్లను ఏర్పాటు చేశారు. న్యాయవాదులు హక్కులు, డిమాండ్లు, కక్షిదారుల ఇబ్బందులకు సంబంధించిన ప్రచురణలను ప్రదర్శించారు. అవి న్యాయ వాదులను ఆకట్టుకున్నాయి.

భువనగిరి చరిత్రను న్యాయవాదులు వాటిని చదువుతూ తెలుసుకున్నారు. ప్రముఖ చిత్రకారుడు చంద్రకుమార్ వాటిని తయారుచేసి ఏర్పాటు చేశారు. ప్రాంగణం వద్ద నవతెలంగాణ బుక్ హౌస్ న్యాయవృత్తికి సంబంధించిన పుస్తకాల అమ్మకాల స్టాల్ ఏర్పాటు చేశారు. పుస్తకాలను న్యాయవాదులు కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు.