India’s GDP | వచ్చే ఆర్థిక సంవత్సరం భారత వృద్ధిరేటు 6.8 శాతం.. క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా

India’s GDP | వచ్చే ఆర్థిక సంవత్సరం భారత వృద్ధిరేటు 6.8 శాతం.. క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా

India’s GDP : వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) లో భారత వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదు కావచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. 2031 నాటికి ఆర్థికవ్యవస్థ రెట్టింపై 7 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, ఎగువ మధ్య-ఆదాయ దేశంగా భారత్‌ అవతరిస్తుందని తెలిపింది. ‘ఇండియా అవుట్‌లుక్‌ రిపోర్ట్‌’ పేరుతో విడుదల చేసిన నివేదికలో.. భారత్‌ ఏడేళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారుతుందని వెల్లడించింది. 2025-2031 మధ్య భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లను అధిగమించి 7 లక్షల కోట్ల డాలర్లకు చేరువ కావచ్చని అంచనా వేసింది.

ఆ ఏడేళ్ల కాలంలో సగటున 6.7 శాతం చొప్పునే వృద్ధి నమోదైనా మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్‌ మారనుందని క్రిసిల్‌ వెల్లడించింది. ప్రస్తుతం 3.6 లక్షల కోట్ల డాలర్లతో మన దేశం అయిదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది. మన కంటే ముందు అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీలు దేశాల ఆర్థికవ్యవస్థలు ఉన్నాయి. 2031 నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశాల సరసన మన దేశం నిలుస్తుందని, తలసరి ఆదాయం 4,500 డాలర్లకు చేరవచ్చని క్రిసిల్‌ తెలిపింది. ప్రపంచ బ్యాంక్‌ ప్రకారం.. తలసరి ఆదాయం 1,000-4,000 డాలర్ల మధ్య ఉంటే దిగువ-మధ్య ఆదాయ దేశాలుగా, తలసరి ఆదాయం 4,000-12,000 డాలర్ల మధ్య ఉంటే ఎగువ-మధ్య ఆదాయ దేశాలుగా పరిగణిస్తారు.

నిరంతర సంస్కరణలు, అంతర్జాతీయ పోటీతత్వం, వాల్యూ చైన్‌ పెరగడం లాంటివి దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని క్రిసిల్‌ ఎండీ, సీఈవో అమీష్‌ మెహతా వెల్లడించారు. 2031 నాటికి దేశ జీడీపీలో తయారీ రంగం వాటా 20 శాతం ఉండొచ్చని అంచనా వేశారు. తయారీ, సేవల రంగాలు 2025-31 ఆర్థిక సంవత్సరాల మధ్య వరుసగా 9.1 శాతం, 6.9 శాతం మేర వృద్ధి చెందవచ్చని క్రిసిల్‌ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకృతి జోషి వెల్లడించారు.