Divya Dakshin Yatra | పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌..! రూ.14వేలకే ఏడు దివ్య దివ్యక్షేత్రాల దర్శనం..!

Divya Dakshin Yatra | పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌..! రూ.14వేలకే ఏడు దివ్య దివ్యక్షేత్రాల దర్శనం..!

Divya Dakshin Yatra | పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. ఆధ్యాత్మిక క్షేత్రాల పర్యటన కోసం ప్రత్యేక ప్యాకేజీని ‘దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో తీసుకువచ్చింది. భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలులో హైదరాబాద్‌ నుంచి దక్షిణ యాత్ర ప్యాకేజీని నడుపనున్నది. కేవలం రూ.14వేలకే అరుణాచలం, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్‌ క్షేత్రాలను దర్శించవచ్చని పేర్కొంది. ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర అక్టోబర్ 31న ప్రారంభం కానున్నది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజుల పాటు టూర్‌ ప్యాకేజీ కొనసాగనున్నది. తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, ఖమ్మంతో పాటు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు , గూడూరు, రేణిగుంట రైల్వేస్టేషన్లలో భారత గౌరవ్‌ రైలులో ప్రయాణం చేయవచ్చు.

ప్రయాణం ఇలా..

తొలిరోజు దివ్య దక్షిణ యాత్ర మొదటి రోజు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మొదలవుతుంది. ప్రధాన రైల్వే స్టేషన్లలో పర్యాటకులు ఈ రైలును ఎక్కేందుకు వీలుంది. రెండోరోజు పర్యాటకులు రెండో రోజు తిరువన్నామలై చేరుకొని హోటల్‌లోకి చెకిన్‌ అవుతారు. ఆ తర్వాత అరుణాచల దర్శనానికి వెళ్తారు. సాయంత్రం మధురైకి బయలుదేరాల్సి ఉంటుంది. మూడోరోజు ఉదయం మధురైకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరుతారు. ఫ్రెషప్‌ అయిన తర్వాత రామనాథస్వామి ఆలయంతో పాటు స్థానిక ఆలయాల సందర్శన ఉంటుంది. రాత్రికి రామేశ్వరంలో బస చేస్తారు. నాలుగో రోజు రామేశ్వరం నుంచి మదురై బయలుదేరుతారు. సాయంత్రం మధుర మీనాక్షి అమ్మవారి దర్శానికి వెళ్తారు. ఆ తర్వాత కన్యాకుమారి బయలుదేరుతారు. ఐదోరోజు కన్యాకుమారి చేరుతారు. కన్యాకుమారిలోని రాక్‌ మెమోరియల్‌, కుమారి అమ్మన్‌ టెంపుల్‌, గాంధీ మండప్‌, సన్‌సెట్‌ పాయింట్‌ సందర్శిస్తారు. రాత్రికి కాన్యకుమారిలో బస చేస్తారు. ఆరో రోజు త్రివేండ్రం బయలుదేరుతారు. పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్ చూసి.. తర్వాత తిరుచ్చిరాపల్లి బయలుదేరాల్సి ఉంటుంది. ఏడో రోజు ఉదయం శ్రీరంగంలో రంగనాథ స్వామి ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత తంజావూరులో బృహదీశ్వర ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తొమ్మిదో రోజు ప్రయాణం సికింద్రాబాద్‌కు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ రేటు ఎంత..?

దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ మూడు కేటగిరీల్లో అందుబాటులో ఉంది. ఎకానమీ ప్యాకేజీ ధర రూ.14,100 కాగా.. స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.21,500.. కంఫర్ట్ ప్యాకేజీ రూ.27,900 నిర్ణయించింది. టూరిజాన్ని ప్రోత్సహించేందుకు భారత్ గౌరవ్ పథకంలో భాగంగా 33శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నది. ఎకానమీ కేటగిరీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో బస ఉంటుంది. స్టాండర్డ్ కేటగిరీలో థర్డ్ ఏసీ ప్రయాణం, కంఫర్ట్ కేటగిరీలో సెకండ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస ఉండనున్నది. వాహనాల్లో సైట్ సీయింగ్, టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్‌ కానున్నాయి. irctctourism.com వెబ్‌సైట్‌లో ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ పేర్కొంది.