Turmeric & Ginger | ఇక అల్లం, పసుపు మంటలు!

Turmeric & Ginger ధరలూ భారీగా పెరిగే అవకాశం అకాల వర్షాలతో తగ్గిన దిగుబడి 3 నెలల్లోనే మార్కెట్‌ రేటు రెట్టింపు రైతుల, వ్యాపారుల వద్దే నిల్వలు అదేబాటన సాగుతున్న అల్లం పంట హైదరాబాద్‌ : వంటగది కష్టాలు ఇప్పుడప్పుడే తొలిగిపోయేటట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం టమాట ధరలతో దిమ్మతిరిగి పోతుంటే.. వంట గదిలో సాధారణంగా కనిపించే జీరా, కందిపప్పు ధరలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తర్వాతి దెబ్బ నాదే అంటున్నది పసుపు. నేను సైతం […]

Turmeric & Ginger | ఇక అల్లం, పసుపు మంటలు!

Turmeric & Ginger

  • ధరలూ భారీగా పెరిగే అవకాశం
  • అకాల వర్షాలతో తగ్గిన దిగుబడి
  • 3 నెలల్లోనే మార్కెట్‌ రేటు రెట్టింపు
  • రైతుల, వ్యాపారుల వద్దే నిల్వలు
  • అదేబాటన సాగుతున్న అల్లం పంట

హైదరాబాద్‌ : వంటగది కష్టాలు ఇప్పుడప్పుడే తొలిగిపోయేటట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం టమాట ధరలతో దిమ్మతిరిగి పోతుంటే.. వంట గదిలో సాధారణంగా కనిపించే జీరా, కందిపప్పు ధరలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తర్వాతి దెబ్బ నాదే అంటున్నది పసుపు. నేను సైతం అంటున్నది అల్లం. రాబోయే కాలంలో పసుపు, అల్లం ధరలు కొండెక్కి కూర్చునే అవకాశం ఉన్నదని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మూడు నెలల్లో పసుపు ధరలు అనేక రాష్ట్రాల్లో రెట్టింపయ్యాయి.

మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులలో మార్కెట్‌ ధర ఏప్రిల్‌ నెలలో క్వింటాలుకు రూ.7వేలు ఉంటే.. ఇప్పుడు 14వేలు పలుకుతున్నది. ఏప్రిల్‌, మే నెలల్లో సాగే పసుపు పంట.. అకాల వర్షాల కారణంగా దిగుబడి వచ్చిందని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. దానికి తోడు రుతుపవనాలు ఆలస్యం కావడంతో వాటి ధరల్లో గణనీయ పెరుగుదల కనిపిస్తున్నదని పేర్కొంటున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన వర్షాలతో పంటపై అధిక శాతంలో తేమ చేరింది. దాంతో సకాలంలో పంట ఎండే అవకాశం లేకుండా పోయింది.

ఫలితంగా ఒక్క మహారాష్ట్రలోనే 50 కిలోలు ఉండే ఏడు నుంచి 8 లక్షల బ్యాగుల (35వేల నుంచి 40 వేల టన్నులు)పై తీవ్ర ప్రభావం పడిందని చెబుతున్నారు. ఇటీవలి సీజన్లలో అమ్మకాలు పెద్దగా లేని కారణంగా చాలా మంది రైతులు ఇతర పంటలకు మళ్లారని నిజామాబాద్‌కు చెందిన ఒక డీలర్‌ చెప్పారు. దీని ఫలితంగా దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాపారులతోపాటు రైతులు కూడా భవిష్యత్తులో ధరలు బాగా పెరుగుతాయనే ఉద్దేశంతో విక్రయించకుండా నిల్వ చేస్తున్నారని అంటున్నారు.

2022-23 సాగు సీజన్‌ (జూలై-జూన్‌)లో పసుపు పంట దిగుబడి 1.16 మిలియన్‌ టన్నులు ఉండొచ్చని స్పైస్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేసింది. ఇది గత ఏడాదితో పోల్చితే 5 శాతం లేదా 1.22 మిలియన్‌ టన్నులు తక్కువ. ఈ ఏడాది మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులో పసుపు పంట సాగు విస్తీర్ణం 10 నుంచి 20 శాతం తగ్గే అవకాశం ఉన్నదని బోర్డు అంచనా వేసింది. పసుపు ఎగుమతులు కూడా ఆందోళనకరంగానే ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో పసుపు ఎగుమతుల్లో 11 శాతం పెరుగుదల ఉంది. ప్రపంచంలోనే పసుపును అత్యధికంగా ఉత్పత్తి చేసే, వినియోగించే దేశంగా భారత్‌ ఉన్నది.

ప్రపంచాన్ని పట్టిపీడించిన కొవిడ్‌ మహమ్మారి కాలంలో పసుపు వినియోగం విపరీతంగా పెరిగింది. పసుపులో ఉన్న వ్యాధినిరోధక లక్షణాలతో పసుపు అందరి నోట నానింది. ఫలితంగా గత కొద్ది సంవత్సరాల్లోనే పసుపు ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది మొదట్లో కేజీ వంద పలికిన పసుపు.. ఇప్పుడు 135కు చేరుకున్నది. గత ఏడాదితో పోల్చితే ఇది రెట్టింపు. గతంలో రూ.60-70 మధ్య ధర పలుకుతుండటంతో కష్టానికి తగిన ప్రతిఫలం రావటం లేదని భావించిన రైతుల పెద్ద సంఖ్యలో ఇతర పంటలకు మళ్లారు.

మరోవైపు అల్లం ధరలు కూడా రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ధర బాగా పెరుగుతుందని ఆశిస్తున్న రైతులు, వ్యాపారులతోపాటు పెద్ద సంఖ్యలో దళారులు కూడా పంటను నిల్వ చేస్తున్నారని తెలుస్తున్నది. అందుకే మార్కట్‌కు అల్లం సరఫరా గణనీయంగా తగ్గిపోయిందని చెబుతున్నారు. కర్ణాటకలోని అనేక శీతల గోదాములు అల్లం పంటతో నిండిపోయాయని దాదాపు అర్ధశతాబ్దంగా అల్లం వ్యాపారంలో ఉన్న ఇండియన్‌ కమర్షియల్‌ కంపెనీ ఎండీ మహేశ్‌ జోషి చెప్పారు.

పచ్చి అల్లంతోపాటు, ఎండబెట్టిన అల్లానికి కూడా దేశంలో మంచి గిరాకీ ఉన్నది. పచ్చి అల్లం వంటల్లో వాడితే.. ఎండబెట్టిన అల్లాన్ని కర్రీ మసాలా తయారీదారులు, అయుర్వేద కంపెనీలు కొనుగోలు చేస్తుంటాయి. అంతేకాదు.. ఎండిన అల్లం ఎగుమతులు కూడా ఎక్కువగానే ఉంటాయి. తాజా అల్లం కంటే ఎండబెట్టిన అల్లం ధర ఐదు నుంచి ఆరు రెట్లు అధికంగా ఉంటుంది. అల్లం ఉత్పత్తిలోనూ ప్రపంచంలో భారత్‌దే అగ్రస్థానం.

ఈసారి నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడి కనీసం మూడు శాతం తగ్గుతుందని స్పైస్‌ బోర్డ్‌ అధికారులు చెబుతున్నా.. వ్యాపారులు మాత్రం ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజా అల్లం ధర మార్కెట్‌లో కిలో 80 రూపాయలు పలుకుతుంటే.. రూ.250 నుంచి 270 మధ్య ఉన్న ఎండబెట్టిన అల్లం ధర రూ.350కి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే.. ప్రస్తుతం అల్లం ధర బాగా పలుకుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఒడిశా, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో అల్లం పంటను విస్తారంగా సాగు చేస్తున్నారు. దీంతో రాబోయే సీజన్‌లో బంపర్‌ క్రాప్‌ వస్తుందని వ్యవసాయ పరిశీలకులు చెబుతున్నారు. దీనిని గుర్తించకుండా వ్యాపారులు అక్రమ నిల్వలకు పాల్పడితే.. వచ్చే ఏడాది అల్లం ధరలు దారుణంగా పడిపోయే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.