Warangal: ఎయిర్ పోర్టు తాము తెచ్చామని BRS చెప్పుకొవడం సిగ్గు చేటు

  • By: sr    latest    Mar 03, 2025 7:13 PM IST
Warangal: ఎయిర్ పోర్టు తాము తెచ్చామని BRS చెప్పుకొవడం సిగ్గు చేటు
  • ఎయిర్ పోర్టు తాము తెచ్చామని.. బీఆర్ఎస్ చెప్పుకొవడం సిగ్గు చేటు
  • బీఆర్ఎస్ నాయకుల తీరు విచిత్రంగా ఉంది
  • పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ఓసీ కొరకు ఒక్కసారైనా ప్రయత్నం చేశారా
  • వరంగల్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • రాష్ట్ర ప్రభుత్వం కృషి వల్లే ఎయిర్ పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
  • వరంగల్ లో 20 ఏళ్లుగా పెండింగ్ సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది
  • రైల్వే డివిజన్ ఏర్పాటు విషయంపై కేంద్ర రైల్వే మంత్రిని కులుస్తాం

 

విధాత, వరంగల్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం కృషి వల్లే మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తేల్చి చెప్పారు. కృషి కాంగ్రెస్ పార్టీ చేస్తే తామే తెచ్చామంటూ బీఆర్ఎస్ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో వరంగల్ దశ దిశ మారబోతుందని స్పష్టం చేశారు. హనుమకొండ కాంగ్రేస్ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు, హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కె.ఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ , కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. బీ ఆర్ ఎస్ నాయకుల తీరు విచిత్రంగా ఉందని, పనిచేసింది ఒకరైతే మేమే తెచ్చామని చెప్పుకొవడం సిగ్గు చేటని విమర్శించారు. గత పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో ఎన్ ఓ సి కొరకు ఒక్కసారైనా ప్రయత్నం చేశారా అంటూ సూటిగా ప్రశ్నించారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్‌ సంస్థతో ఒప్పందం ఉండడంతో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి పౌర విమానయానశాఖతో చర్చించి గత నెల 25న ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్​ కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. దీనిని హెచ్ఏఎల్ కు పంపడంతో అక్కడి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావడంతో మామనూరు ఎయిర్ పోర్ట్ కు కేంద్రం అనుమతినిచ్చిందని తెలియజేశారు. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం రూ.205 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలియజేశారు. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం అద్భుతంగా ఉండబోతుందని అన్నారు.

సీఎం రేవంత్ ఏయిర్ పోర్ట్ అభివృద్ధితో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, టెక్స్ టైల్ పార్క్, ఐటి, పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. వరంగల్ మహానగరంలో 20 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తున్నామన్నారు. రైల్వే సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తామని తెలిపారు. రైల్వే డివిజన్ ఏర్పాటు విషయం పై కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కులుస్తామని తెలిపారు. కాజీపేట రైల్వే బ్రిడ్జి పనులు త్వరలో పూర్తవుతాయన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రానున్న రోజుల్లో వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు అందరం కలిసి కట్టుగా జిల్లాను మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.