ఎన్‌డీఏ కూటమిలోకి జేడీఎస్.. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం

విధాత : కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రధాని దేవేగౌడ్ పార్టీ జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమెక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ)లో చేరింది. శుక్రవారం జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఆయన నివాసంలో కలిశారు.

ఈ సందర్భంగా రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కర్ణాటకలో రెండు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటుపై వారు చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం జేపీ నడ్డా ఎన్‌డీఏలో జేడీఎస్ చేరిందని ట్వీట్ చేశారు. ఎన్‌డీఏ కూటమిలో జేడీఎస్‌ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా అనే ప్రధాని మోడీ విజన్‌కు ఈ చేరిక మరింత బలాన్నిచ్చిందన్నారు. కుమారస్వామి సైతం ఎన్‌డీఏతో జేడీఎస్ పొత్తు కుదిరిందని, సీట్ల పంపకంపై చర్చిస్తామని తెలిపారు.