Maoist Party Letter : పట్టుకున్నారు..మట్టుబెట్టారు : మారేడుమిల్లి ఎన్ కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ
మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ పోలీసులు నిరాయుధులపై ఫేక్ ఎన్‌కౌంటర్లు చేశారని ఆరోపిస్తూ, నవంబర్ 23న దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది.
విధాత : ఏపీలోని మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది. మావోయిస్టు అగ్రనేతలు కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మాడ్వి హిడ్మా, ఏవోబీ రీజినల్ కమిటీ సభ్యురాలు రాజే, ఏవోబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు టెక్ శంకర్ సహా పలువురు మావోయిస్టులను నిరాయుధులుగా పట్టుకుని ఫేక్ ఎన్‌కౌంటర్లు చేశారని మావోయిస్టు పార్టీ లేఖలో ఆరోపించింది. నవంబర్ 15న విజయవాడలో నిరాయుధంగా ఉన్న వారిని పట్టుకుని మట్టుబెట్టి ఎన్ కౌంటర్ కథ అల్లారని లేఖలో పేర్కొంది. ఈ క్రూర హత్యాకాండకు వ్యతిరేకంగా ఈ నెల 23న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చింది. మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు.
విజయవాడలో చికిత్స పొందుతున్న మావోయిస్టులను కొందరు చేసిన ద్రోహంతో అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిరాయుధులుగా పట్టుకుని చంపి ఎన్ కౌంటర్ కథ అల్లారని అభయ్ ఆరోపించారు. చివరి వరకు విప్లవోద్యమంలో కొనసాగి, శత్రువుకు తలవంచకుండా ప్రాణాలర్పించిన వారికి మావోయిస్టు పార్టీ వినమ్రంగా శ్రద్దాంజలి ఘటిస్తుందని పేర్కొన్నారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి లో వరుసగా జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో 11మంది మావోయిస్టులు మృతి చెందడం తెలిసిందే.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram