Journalism | ఫాసిజాన్ని ప్రతిఘటిద్దాం.. ప్రగతిశీల భావాలపై ట్రోల్స్‌ దారుణం: ప్రొ. హరగోపాల్‌

Journalism నైతిక విలువల్ని ధ్వంసం చేస్తున్నారు ట్రోల్స్‌ను సామాజిక దాడులుగా చూడాలి ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తదితరుల వ్యాఖ్యలు ‘జర్నలిజం-ట్రోల్‌ ముఠాలు’పై రౌండ్‌టేబుల్‌ జర్నలిస్టు చందుతులసికి ప్రముఖుల మద్దతు విధాత: దేశంలో జరుగుతున్న అరాచకాలను నిర్భయంగా బయటపెడుతున్న జర్నలిస్టులపై జరుగుతున్న పాసిస్టు దాడులను ప్రతిఘటించాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పిలుపునిచ్చారు. తులసి చందుతోపాటు ప్రగతిశీల భావాలున్న మహిళలపై, జర్నలిస్టులపై, ప్రజాస్వామికవాదులపై, ప్రజా సంఘాల సభ్యులపై దారుణమైన ట్రోల్స్‌ జరుగుతుండటం విచారకరమన్నారు. స్వతంత్ర జర్నలిస్టు తులసి చందుపై గతకొంత కాలంగా దారుణమైన […]

Journalism | ఫాసిజాన్ని ప్రతిఘటిద్దాం.. ప్రగతిశీల భావాలపై ట్రోల్స్‌ దారుణం: ప్రొ. హరగోపాల్‌

Journalism

  • నైతిక విలువల్ని ధ్వంసం చేస్తున్నారు
  • ట్రోల్స్‌ను సామాజిక దాడులుగా చూడాలి
  • ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తదితరుల వ్యాఖ్యలు
  • ‘జర్నలిజం-ట్రోల్‌ ముఠాలు’పై రౌండ్‌టేబుల్‌
  • జర్నలిస్టు చందుతులసికి ప్రముఖుల మద్దతు

విధాత: దేశంలో జరుగుతున్న అరాచకాలను నిర్భయంగా బయటపెడుతున్న జర్నలిస్టులపై జరుగుతున్న పాసిస్టు దాడులను ప్రతిఘటించాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పిలుపునిచ్చారు. తులసి చందుతోపాటు ప్రగతిశీల భావాలున్న మహిళలపై, జర్నలిస్టులపై, ప్రజాస్వామికవాదులపై, ప్రజా సంఘాల సభ్యులపై దారుణమైన ట్రోల్స్‌ జరుగుతుండటం విచారకరమన్నారు.

స్వతంత్ర జర్నలిస్టు తులసి చందుపై గతకొంత కాలంగా దారుణమైన ట్రోల్స్‌ జరుగుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే జర్నలిజం-ట్రోల్‌ ముఠాలు అనే అంశంపై తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌, ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఇన్‌ మీడియా ఇండియా, హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌, తెలంగాణ స్టేట్‌ స్మాల్‌ అండ్‌ మీడియం పేపర్స్‌ అండ్‌ మ్యాగజైన్‌ అసోసియేషన్స్‌ సంయుక్తంగా మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో హరగోపాల్‌ మాట్లాడుతూ స్త్రీ, పురుష బంధాలతో పాటు సమాజంలో నైతిక విలువలను ఫాసిస్టు శక్తులు ధ్వసం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూత్వ, ఆరెస్సెస్‌ భావజాలాన్ని నమ్ముతూ ఇటువంటి అనైతిక పనులు చేస్తున్నారన్నారి అన్నారు. ఈ ట్రోల్స్‌ను సామాజిక దాడులుగా భావించాలని చెప్పారు.

ముఖ్యంగా మహిళలపై కించపర్చేందుకు ఇలాంటి ఫాసిస్టు దాడులు జరుగుతున్నాయన్నారు. ధ్యైర్యం అంటే భయంతో జరిగే పోరాటమేనని, ఇలాంటి ట్రోల్స్‌కు, బెదిరింపులకు భయపడకుండా మున్ముందు మరిన్ని నిజాలను నిర్భయంగా చెప్పాలని తులసి చందుకు సూచించారు.

2019 నుంచి పెరిగిన ట్రోల్స్‌

2019 నుంచి ట్రోల్ ఎక్కువగా జరుగుతున్నాయని సీనియర్‌ సంపాదకులు రామచంద్రమూర్తి చెప్పారు. దేశవ్యాప్తంగా కొందరు ట్రోల్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారని, అలాంటి వ్యక్తులకు దేశంలోని పెద్దల ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. రావీశ్‌కుమార్‌ చెప్తున్నట్లుగా దేశంలో గోడీ మీడియా, రాష్ట్రంలో కేసీఆర్‌ మీడియా ఉందని చెప్పారు. దీంతో నేడు సోషల్‌ మీడియా ద్వారానే ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయన్నారు.

నిజాలను నిర్భయంగా చెప్పడంలో సోషల్‌ మీడియా ప్రముఖ పాత్ర వహిస్తుందన్నారు. అయితే తులసి లాగ నిజాలను చెప్తున్న వాళ్లపై సోషల్‌ మీడియా వేదికగా దాడులు జరుగుతున్నా చాలా మంది ప్రశ్నించడం కానీ, ఫిర్యాదు చేయడం కానీ చేయడం లేదని అన్నారు. గతంలో ఎమర్జెన్సీలో అప్పటి ప్రభుత్వం కూడా మీడియాను నియంత్రించిందని, అయితే ఆ విషయం ప్రజలకు అర్థంకావడం వలన ఏపీ, కర్ణాటక రాష్ట్రాలలో మినహా దేశమంతటా ఇందిరాగాంధీని ఓడించారని గుర్తు చేశారు.

తులసి చందుతో పాటు ట్రోల్‌కు గురైతున్న వ్యక్తులకు మద్దతుగా పోరాటాన్ని కొనసాగించాలన్నారు. ట్రోలర్స్‌ దాడులను తట్టుకుంటూ ప్రజలకు నిజాలను మరింత నిర్భయంగా చెప్పాలన్నారు. తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

పౌర సమాజం తులసికి అండగా నిలవాలి..

గతంలో పత్రికలు మాత్రమే ఉన్నాయని, ఇందులో ఎవ్వరికైనా నచ్చని అంశాలపై వార్తలు రాస్తే వాళ్లు పత్రికల సంపాదకులను, యాజమాన్యాలను కలిసి ఫిర్యాదులు చేసేవారని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ అన్నారు. కానీ నేడు తులసి చందులాంటి అనేక స్వతంత్ర జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు.

ఈ దాడులను నియంత్రించేందుకు పౌర సమాజం తులసికి అండగా ఉండాలన్నారు. సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ ఇండిపెండెంట్‌ జర్నలిజాన్ని కాపాడుకోవాలన్నారు. నేడు ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం లేదని, సోషల్‌ మీడియాలో ప్రజల వాణి వినపడుతున్నదని చెప్పారు. ‘వచ్చినం, కూర్చున్నం, వెళ్లిపోయినం అనేట్లుగా కాకుండ ఒక కార్యాచరణ ప్రకటించి సంఘీభావ సంఘం ఏర్పాటు చేయాలి’ అని సూచించారు.

సమావేశం ప్రారంభ సమయంలో స్వతంత్ర జర్నలిస్టు తులసి చందు మాట్లాడుతూ తాను హిందువు కాదు అనే ముద్ర వేసి మెజార్టీ ప్రజలకు తనను శత్రువుగా మార్చారన్నారు. అర్బన్‌ నక్సల్‌గా ముద్రవేసి ట్రోల్‌ చేస్తున్నారని, తనకు చిన్న పిల్లలు ఉన్నారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తనపై అసత్యాలతో దాడి చేస్తూ నీచంగా ట్రోల్‌ చేస్తున్న ఒక ఫేస్‌బుక్‌ ఐడీపై, మూడు యూట్యూబ్‌ చానల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.

తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ విరాహత్‌ అలీ అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కే శ్రీనివాస్‌, వీక్షణం సంపాదకులు వేణుగోపాల్‌, సామాజిక కార్యకర్త సజయ, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్‌ పద్మజాషాతో పాటు వివిద సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.