Karimnagar TTD | కరీంనగర్‌లో కొలుపుదీరనున్న తిరుమలేశుడు.. టీటీడీ ఆలయానికి శంకుస్థాపన
Karimnagar TTD | అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కరీంనగర్‌లో కొలువు దీరడం అదృష్టం ఆలయానికి 10 ఎకరాలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు ఆలయానికి 20 కోట్లు మంజూరు చేసిన ఏపీ సీఎం జగన్ కి ధన్యవాదాలు శ్రీవారి ఆశీర్వాద బలమే ఈ ఆలయం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తిరుమల మాదిరే కరీంనగర్ లోను సర్వ కైంకకర్యాలు విధాత బ్యూరో, కరీంనగర్: 10 ఎకరాల సువిశాల స్థలంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు […]
Karimnagar TTD |
- అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కరీంనగర్‌లో కొలువు దీరడం అదృష్టం
- ఆలయానికి 10 ఎకరాలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు
- ఆలయానికి 20 కోట్లు మంజూరు చేసిన ఏపీ సీఎం జగన్ కి ధన్యవాదాలు
- శ్రీవారి ఆశీర్వాద బలమే ఈ ఆలయం
- శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్
- తిరుమల మాదిరే కరీంనగర్ లోను సర్వ కైంకకర్యాలు
విధాత బ్యూరో, కరీంనగర్: 10 ఎకరాల సువిశాల స్థలంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కరీంనగర్‌లో నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచన, అగ్ని ప్రణయం, కుంభారాధన, విశేష హోమాలు, శంఖువుకు అభిషేకం అనంతరం వేదమంత్రాలతో టీటీడీ వేద పండితులు శంకుస్థాపన క్రతువు పూర్తి చేశారు.

మంత్రి గంగుల కమలాకర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్ ఎమ్మెల్సీలు భాను ప్రసాద్ రావు, కౌశిక్ రెడ్డి, టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కర్ రావు తదితర ప్రముఖుల, అశేష జనవాహిని సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. శ్రీ వెంకటేశ్వరస్వామి కృపతోనే కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణం సాకారం అయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కరీంనగర్ ప్రజా ప్రతినిధులు ఆలయ అనుమతి కోసం ప్రతిపాదన చేసిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రత్యేకంగా లేఖ రాయడం, కరీంనగర్‌లో పదెకరాల స్థలాన్ని కేటాయించడం, తదనంతరం ఏపీ సీఎం ఆమోదంతో టీటీడీ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరగడం చాలా సంతోషకరమన్నారు.

టీటీడీ 20 కోట్ల నిధులతో ఆలయాన్ని నిర్మిస్తుందని మిగతా నిర్మాణ నిధులను భక్తులు సమకూర్చుతారని చెప్పారు. ఈ కార్యంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్నారు. కరీంనగర్ ప్రజలందరికీ ఈ అదృష్టం దొరికినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తామని భక్తులు హాజరవ్వాలని మంత్రి గంగుల కోరారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ ఆలయ నిర్మాణం కోసం మంత్రి గంగులతో పాటు వినోద్ కుమార్, భాస్కరరావు, దామోదర్ రావు అభ్యర్థించారని, సీఎం కేసీఆర్ విజ్ఞాపనతో ముఖ్యమంత్రి జగన్ నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చారన్నారు.
టీటీడీ తరఫున 20 కోట్ల నిధులను కేటాయించడంతో పాటు సంపూర్ణంగా తిరుమల మాదిరే క్రతువులు నిర్వహిస్తామని, తిరుమల వేద పండితులు నిరంతరం ఇక్కడే ఉంటారన్నారు. పోటు ద్వారా ప్రసాదాలను సైతం ఇక్కడే తయారు చేస్తామన్నారు.
మంత్రి గంగుల కమలాకర్ స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ నిర్మాణంపై చూపిస్తున్న శ్రద్ధ సంతోషం కలిగిస్తుందన్నారు. కరీంనగర్, తెలంగాణ ప్రజలకు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ లోనే టీటీడీ అర్చకులకు ప్రత్యేకంగా వసతి నిర్మాణంతో పాటు, సమస్త కైంకర్యాలను ఆగమ శాస్త్ర పద్ధతుల్లో చేస్తామన్నారు. నిర్మించనున్న టీటీడీ ఆలయం నగరానికి వాస్తు సొబగులు అద్దడంతో పాటు ఆ బ్రహ్మాండ నాయకుని దీవెనలను అందిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు, స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram