Site icon vidhaatha

పార్ల‌మెంట్ భ‌ద్ర‌తా వైఫ‌ల్యం.. మాజీ పోలీసు అధికారి కుమారుడు అరెస్ట్

న్యూఢిల్లీ : పార్ల‌మెంట్ భ‌ద్ర‌తా వైఫల్యం కేసు విచార‌ణ ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. ఈ కేసులో క‌ర్ణాట‌క‌కు చెందిన ఇంజినీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అరెస్టు అయిన ఇంజినీర్.. క‌ర్ణాట‌క‌కు చెందిన మాజీ పోలీసు అధికారి కుమారుడు అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బ‌గ‌ల్‌కోట్‌లో నిన్న రాత్రి ఆ ఇంజినీర్‌ను అరెస్టు చేసి ఢిల్లీకి త‌ర‌లించారు.

అరెస్టు అయిన ఇంజినీర్ సాయికృష్ణ జ‌గ‌లి.. మ‌నోరంజ‌న్ స్నేహితుడు అని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. మ‌నోరంజ‌న్, సాగ‌ర్ శ‌ర్మ‌, నీలం దేవి, అమోల్ షిండే అనే నలుగురు నిందితులు ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అభియోగాలను ఎదుర్కొంటున్నారు. సాయికృష్ణ‌, మ‌నోరంజ‌న్ ఇద్ద‌రూ క‌లిసి ఒకే ఇంజినీరింగ్ కాలేజీలో చ‌దివారు. అయితే విచార‌ణ స‌మ‌యంలో మ‌నోరంజ‌న్ సాయికృష్ణ పేరు చెప్ప‌డంతో అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ పాత్ర ఏంట‌నేది తెలియాల్సి ఉంది.

ఈ సంద‌ర్భంగా సాయికృష్ణ సోదరి మీడియాతో మాట్లాడారు. నా త‌మ్ముడు ఎలాంటి త‌ప్పు ప‌ని చేయ‌లేద‌ని న‌మ్ముతున్నాను. ఢిల్లీ పోలీసులు వ‌చ్చి, సాయికృష్ణ‌ను తీసుకెళ్లారు. ఈ కేసు విచార‌ణ‌కు సాయికృష్ణ‌తో పాటు తాము పూర్తిస్థాయిలో స‌హ‌క‌రిస్తామ‌న్నారు. మ‌నోరంజ‌న్, సాయికృష్ణ ఇద్ద‌రూ ఇంజినీరింగ్‌లో రూమ్మేట్స్. సాయికృష్ణ ప్ర‌స్తుతం వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్న‌ట్లు సోద‌రి స్పంద తెలిపారు.


నలుగురు నిందితుల పోలీస్‌ కస్టడీ పొడిగింపు

భద్రతా వైఫల్యం కేసులో నలుగురు నిందితులకు జనవరి 5 వరకు పోలీస్‌ కస్టడీని పొడిగించారు. మనోరంజన్‌ డీ, సాగర్‌ శర్మ, అమోల్‌ ధనరాజ్‌ షిండే, నీలం దేవికి కస్టడీని 15 రోజులపాటు పొడిగించాలని ఢిల్లీ సిటీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ మేరకు ప్రత్యేక జడ్జి హర్దీప్‌కౌర్‌ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. 

Exit mobile version