KCR | దేశమంతా.. తెలంగాణ మోడల్.. అప్పటి వరకూ పోరాటం ఆగదు: KCR
KCR వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తే.. దేశంలో 60% మందికి ఉపాధి లక్ష్యం లేని దేశం ఎటు పోతున్నది? జనం గెలిచే రాజకీయాలు చేయాలి విధాత : దేశమంతా తెలంగాణ మోడల్ అమలయ్యే వరకు పోరాడుతూనే ఉంటామని, దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి వెళ్లి తెలంగాణ పథకాలు వివరిస్తామని ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రైతులు బలహీనులు కాదని, దేశాన్ని నడుపుతున్న బలమైన శక్తులని అన్నారు. రైతులను అవమానించే వారికి తగిన శాస్తి తప్పదని […]

KCR
- వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తే..
- దేశంలో 60% మందికి ఉపాధి
- లక్ష్యం లేని దేశం ఎటు పోతున్నది?
- జనం గెలిచే రాజకీయాలు చేయాలి
విధాత : దేశమంతా తెలంగాణ మోడల్ అమలయ్యే వరకు పోరాడుతూనే ఉంటామని, దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి వెళ్లి తెలంగాణ పథకాలు వివరిస్తామని ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రైతులు బలహీనులు కాదని, దేశాన్ని నడుపుతున్న బలమైన శక్తులని అన్నారు. రైతులను అవమానించే వారికి తగిన శాస్తి తప్పదని స్పష్టం చేశారు. భారతదేశంలో మార్పునకు మహారాష్ట్ర నుంచే నాంది పలుకుతున్నట్టు చెప్పారు.
దేశంలో 48 శాతం మంది రైతులే ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తే 60 శాతం మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. సరిపడా సాగునీరు, విద్యుత్తు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం కావాలని చెప్పారు. మహారాష్ట్ర బడ్జెట్ 10 లక్షల కోట్లకు చేరాలని ఆకాంక్షించారు. దేశానికి అన్నం పెట్టే రైతు పార్లమెంట్‌లో చట్టాలు చేయలేడా? అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో కూడా బీఆర్ఎస్ రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
ఈ దేశం ఎటు పోతున్నది?
లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళుతున్నదని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ‘ఈ విషయం ఆలోచిస్తే నాకు భయమేస్తోంది. జనాభా విషయంలో మనం చైనాను కూడా దాటేశాం. దేశంలో ఎలాగైనా ఎన్నికల్లో గెలవడం లక్ష్యంగా మారింది. ఎన్నికల రాజకీయ తంత్రంలో దేశం చిక్కుకుపోయింది. ప్రతి ఎన్నికలోనూ నేతలు కాదు.. జనాలు గెలవాలి. ఎన్నికల్లో జనం గెలిస్తే సమాజమే మారుతుంది’ అని కేసీఆర్ చెప్పారు.
జనం చంద్రుడిని, నక్షత్రాలను కోరుకోవడం లేదని, నీళ్లు ఇవ్వాలనే అడుగుతున్నారని చెప్పారు. ఔరంగాబాద్‌లో 8 రోజులకు ఒకసారి తాగునీరు వస్తున్నదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. మహారాష్ట్ర దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అన్న సీఎం.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ప్రజల స్థితిగతులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మహారాష్ట్ర సంగతి పక్కకు పెట్టండి.. దేశ రాజధాని ఢిల్లీలోనూ అదే దుస్థితి. గంగా, యమునా డెల్టా ప్రాంతమైన ఢిల్లీలోనూ ఇదే దుస్థితి ఉంది.
ఢిల్లీలో తాగునీరే కాదు.. విద్యుత్ కొరత సమస్య కూడా ఉంది’ అని చెప్పారు. మహారాష్ట్రలో అనేక పార్టీల నుంచి సీఎంలు వచ్చారు కానీ.. ఏ ముఖ్యమంత్రి కూడా ఇక్కడి పరిస్థితులను మార్చలేదని అన్నారు. ఇప్పటికైనా జనం గెలిచే రాజకీయాలు చేయాలని అన్నారు. ‘ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడింది.. కాంగ్రెస్ గెలిచింది. పరిస్థితుల్లో మార్పు రానప్పుడు ఎవరు గెలిచి ఏం ప్రయోజనం?’ అని ప్రశ్నించారు.
దళితుల పరిస్థితేంటి?
దేశంలో ఎస్సీల పరిస్థితులు మారనంత కాలం దేశం అభివృద్ధి చెందదని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం మన దేశంలో దళితుల పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు. బరాక్ ఒబామా అధ్యక్షుడు అయ్యాకే అమెరికాలో పాప ప్రక్షాళన జరిగిందని చెప్పారు. దేశంలో దళితుల, ఆదివాసీల ఉద్ధరణ జరిగి తీరాల్సిందేనన్నారు.
ఇప్పటికీ వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో భారత్‌లోనే ఎక్కువ శాతం సాగు యోగ్యమైన భూమి ఉందని, మనం తలుచుకుంటే దేశంలోని ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వొచ్చని చెప్పారు.
భగవంతుడు ఎన్నో వనరులు సమృద్ధిగా ఇచ్చినా ప్రజలకు ఎందుకు ఈ కష్టాలని కేసీఆర్ ప్రశ్నించారు. జల విధానం సమూలంగా మారితేనే మార్పు సాధ్యమవుతుందని చెప్పారు. విద్యుత్తు విషయంలోనూ ఎన్నో సమస్యలు ఉన్నాయన్న కేసీఆర్.. దేశంలో బొగ్గుకు కొరత లేక పోయినా విద్యుత్తు సమస్య ఉన్నదని చెప్పారు. దేశంలోని బొగ్గుతో 150 ఏండ్లు విద్యుత్ ఇవ్వొచ్చని కోల్ ఇండియానే చెప్పిందని గుర్తు చేశారు.
వ్యవసాయానికి సరిపడ కరెంట్ ఇవ్వడం లేదని కేసీఆర్ అన్నారు. గతంలో తెలంగాణలో మహారాష్ట్ర కంటే ఎక్కువగా రైతు ఆత్మహత్యలు జరిగేవని, ఇప్పుడు తెలంగాణలో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్, పుష్కలంగా సాగునీరు అందిస్తుండటంతో ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయాయని తెలిపారు. తెలంగాణలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నామని చెప్పారు.
తాగునీటి కోసం బిందెలు పట్టుకుని తిరిగే పరిస్థితి తమ వద్ద ఎక్కడా లేదన్నారు. తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రమే ఇన్ని సాధిస్తే.. మహారాష్ట్ర ఎందుకు సాధించలేదని ప్రశ్నించారు. తెలంగాణలా చేస్తే మహారాష్ట్ర దివాలా తీస్తుందని కొందరు మరాఠా నేతలు అంటున్నారన్న కేసీఆర్.. తెలంగాణ తరహాలో చేస్తే.. దివాలా తీసేది మరాఠా నేతలేనని చెప్పారు. మహారాష్ట్రకే వెళ్తున్నారు.. మా మధ్యప్రదేశ్‌కు రావట్లేదని అక్కడి ప్రజలు అంటున్నారన్న కేసీఆర్.. మహారాష్ట్రలో తెలంగాణ నమూనా పాలన వచ్చే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు.
మహారాష్ట్రలో అనేక మంది నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, త్వరలోనే పరివర్తన వస్తుందని చెప్పారు. అది దేశమంతా పాకుతుందని అన్నారు. నాగపూర్‌లో ఆఫీసు ప్రారంభించుకున్నామని, ఇక ఔరంగాబాద్, పుణెలోనూ త్వరలో పార్టీ ఆఫీసులను ప్రారంభిస్తామని చెప్పారు