‘పాలమూరు’ ప్రాజెక్టుకు కేసీఆర్‌ ద్రోహం: సీడబ్ల్యూసీ నేత వంశీచంద్ రెడ్డి

పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అసంపూర్తిగా వదిలేసి, ఈ ప్రాంత రైతాంగానికి ద్రోహం చేసిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతు ద్రోహిగా మిగిలిపోయారని

‘పాలమూరు’ ప్రాజెక్టుకు కేసీఆర్‌ ద్రోహం: సీడబ్ల్యూసీ నేత వంశీచంద్ రెడ్డి

తొమ్మిదేళ్లలో ఎకరానికి కూడా నీరివ్వని ప్రాజెక్టు

పాలమూరు రైతులపై కక్షగట్టిన కేసీఆర్

వేల కోట్లు ఖర్చు పెట్టి అసంపూర్తిగా వదిలేశారు

రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరుకే నష్టం చేశారు

బీఆరెస్ నేతలు వెళ్ళాల్సింది మేడిగడ్డ కాదు ఎర్రగడ్డకు

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అసంపూర్తిగా వదిలేసి, ఈ ప్రాంత రైతాంగానికి ద్రోహం చేసిన అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతు ద్రోహిగా మిగిలిపోయారని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ల సందర్శనలో భాగంగా ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, అనిరుధ్‌ రెడ్డి, శ్రీహరి, పర్ణిక రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన భూత్పూర్ మండలంలోని కరివెన రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మాజీ సీఎం కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 2015లో శ్రీకారం చుట్టి ఇక్కడే కుర్చీ వేసుకుని మూడేళ్లలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌.. తొమ్మిదేళ్లు గడిచినా పూర్తి చేయలేదని విమర్శించారు.

ఏపీకి అమ్ముడపోయిన కేసీఆర్‌

కృష్ణానదిలో తెలంగాణ వాటా 577 టీఎంసీలు దక్కవలసి ఉండగా రాయలసీమ నేతలకు అమ్ముడు పోయిన కేసీఆర్ కేవలం 299 టీఎంసీలకే అంగీకరించారని వంశీ చంద్ రెడ్డి మండిపడ్డారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మోసం చేస్తే ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టుల్లో కమీషన్లు దండుకోవటం కోసం నాసిరకం పనులు చేశారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతికే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఈ ప్రాంతం నాయకులు బానిసలుగా వ్యవహరించారన్నారు. పాలమూరు బాగు కోసం వాళ్ళు చేసిన త్యాగం ఏమీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆరెస్ అవినీతికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాతపెట్టినా.. ఆ పార్టీ నేతలకు ఇంకా సిగ్గు, శరం లేకుండా కాంగ్రెస్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వంశీ పేర్కొన్నారు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న తరుణంలో మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకునేందుకు వస్తున్నారని, వారికి ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పాలన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయి స్పష్టంగా కనిపిస్తున్నా ఇది మామూలే అని బీఆరెస్ నేతలు అనడం చూస్తే వారికి ప్రాజెక్టులపై ఎంత అవగాహన ఉందో తెలుస్తున్నాదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతలు మేడిగడ్డ సందర్శనకు వెళ్లడం కాదని, వారంతా ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి వెళ్లాలని చురకలు అంటించారు.

రాజకీయ భిక్ష పెట్టిన జిల్లాకు ద్రోహం

కేసీఆర్‌కు పాలమూరు జిల్లా రాజకీయ భిక్ష పెట్టిందని, అలాంటి జిల్లాకే ద్రోహం చేసి ఇక్కడి రైతులను నట్టేట ముంచిన ఘనుడు కేసీఆర్‌ అని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అనంతరం అసంపూర్తిగా, నాసిరకంగా జరిగిన జలాశయం పనులను వంశీ చంద్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు పరిశీలించారు.