Asifabad | నేటి నుంచి పోడు పట్టాల పంపిణీ

Komurambhim Asifabad కొమురం భీమ్‌ జిల్లాలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం రేపటి నుంచి వివిధ జిల్లాల్లో పట్టాల అందజేత రైతుబంధు వర్తింపజేస్తూ ప్రభుత్వ ఉత్తర్వు రాష్ట్రంలోని 26 జిల్లాలలో పోడు రైతులు మొత్తం దరఖాస్తులు : 3,13,399 ఆమోదించినవి: 1,50,415 తిరస్కరించినవి: 1,62,984 పట్టాలు జారీ కానున్న భూమి విస్తీర్ణం 4,26,379 ఎకరాలు మాకు న్యాయం చేయాలంటున్న చెంచులు విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి : గిరిజనుల ఎన్నో యేండ్ల ఎదురు చూపులకు నేడు తెరపడనున్నది. అటవీ […]

Asifabad | నేటి నుంచి పోడు పట్టాల పంపిణీ

Komurambhim Asifabad

  • కొమురం భీమ్‌ జిల్లాలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం
  • రేపటి నుంచి వివిధ జిల్లాల్లో పట్టాల అందజేత
  • రైతుబంధు వర్తింపజేస్తూ ప్రభుత్వ ఉత్తర్వు
  • రాష్ట్రంలోని 26 జిల్లాలలో పోడు రైతులు
  • మొత్తం దరఖాస్తులు : 3,13,399
  • ఆమోదించినవి: 1,50,415
  • తిరస్కరించినవి: 1,62,984
  • పట్టాలు జారీ కానున్న భూమి విస్తీర్ణం 4,26,379 ఎకరాలు
  • మాకు న్యాయం చేయాలంటున్న చెంచులు

విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి : గిరిజనుల ఎన్నో యేండ్ల ఎదురు చూపులకు నేడు తెరపడనున్నది. అటవీ భూములను సాగు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న గిరిజన, ఆదివాసీ పోడు రైతులకు హక్కు పత్రాలను అందించేందుకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు.

శుక్రవారం కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పోడు రైతులకు పట్టాలను అందించనున్నారు. ముఖ్యమంత్రి ఇక్కడ పోడు పట్టాలు పంపిణీ చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ, గిరిజనులు ఏ ఏ ప్రాంతాలలో పోడు వ్యవసాయం చేసుకుంటూ ఫల సాయం అనుభవిస్తున్నారో వారందరికీ శనివారం నుంచి ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు పోడు పట్టాలు పంపిణీ చేయనున్నారు.

ఈ భూములకు రైతుబంధును కూడా వర్తింప జేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
26 జిల్లాల్లో పోడు రైతులు రాష్ట్రంలోని సుమారు 26 జిల్లాల్లో పోడు రైతులున్నట్లు గుర్తించిన ప్రభుత్వం 1,50,415 మంది అర్హులైన పోడు రైతులకు సుమారు 4,26,379 ఎకరాల విస్తీర్ణంపై పోడు పట్టాలను పంపిణీ చేయనుంది. 2022 నవంబరు 20వ తేదీ వరకు పోడు రైతులకు దరఖాస్తు ఫారాలు పంపిణీ చేశారు.

గిరిజన రైతుల నుంచి కూడా కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చాయియ. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,13,399 మంది దరఖాస్తులు సమర్పించారని గతంలో అధికారులు తెలిపారు. ఇందులో 1,50,415 మందికే నేడు పట్టాలను పంపిణీ చేస్తుండటం గమనార్హం. మిగిలిన 1,62,984 మంది దరఖాస్తుల తిరస్కరించారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ -2006 ప్రకారం పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను ఎంపిక చేయడంతో పాటు తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు తిరస్కరణకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది.

కానీ ప్రభుత్వం ఆ నిబంధనలను పాటించలేదని గిరిజన, ఆదివాసీ హక్కుల నాయకులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి గ్రామ కమిటీలో తిరస్కరణకు గురైన వాళ్లు, మండల కమిటీలో, డివిజన్‌, జిల్లా కమిటీలో, రాష్ట్ర కమిటీలో అప్పీల్‌ చేసుకునే వెసులుబాటు చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ తిరస్కరణ పేరుతో లక్షల మంది దరఖాస్తుదారులను అనర్హులగా ప్రకటిస్తున్నారని చెంచులు, ఆదివాసీ గిరిజనులు ఆరోపిస్తున్నారు.

జిల్లాల వారీగా అర్హులైన దరఖాస్తుదారులు, పంపిణీ చేయనున్న భూమి విస్తీర్ణం (ఎకరాల్లో)

జిల్లా దరఖాస్తుదారులు విస్తీర్ణం

ఆదిలాబాద్‌ 12,195 31,683
భద్రాద్రి కొత్తగూడెం 50,503 1,59,902
హన్మకొండ 70 65
జగిత్యాల 15 19
జయశంకర్‌ భూపాలపల్లి 3,210 7,891
కామారెడ్డి 5,050 11,445
ఖమ్మం 5,654 10,906
కుమరం భీం ఆసిఫాబాద్ 15,877 48,728
మంచిర్యాల 2,294 4,870
మెదక్‌ 610 529
ములుగు 7,062 18,386
నాగర్‌కర్నూల్‌ 1,957 5,055
నల్లగొండ 2,843 5,340
నిర్మల్‌ 7,007 19,908
నిజామాబాద్‌ 4,205 8,585
పెద్దపల్లి 4 2
రాజన్నసిరిసిల్ల 1,614 2,857
సంగారెడ్డి 1,127 1,807
సూర్యపేట 84 189
వికారాబాద్‌ 436 558
వనపర్తి 328 407
వరంగల్‌ 3,263 7,332
యాదాద్రి భువనగిరి 205 482
మొత్తం 1,50,415 4,26,379

అందరికీ రైతుబంధు…

నేటి నుంచి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పోడు పట్టాలకు అర్హతలకు సాధించిన ప్రతి పోడు రైతుకు ఎకరాకు రూ.5000 చొప్పున రైతుబంధు అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ రాష్ట్రంలోని 1,50,415 మంది రైతులకు 4,26,379 ఎకరాలపై రైతుబంధు ఇవ్వాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నేడు పోడు పట్టాలతో పాటు రైతుల ఖాతాల్లో రైతుబంధు కూడా జమ కానుంది.

ఆర్వోఎఫ్‌ఆర్‌ యాక్టు-2006 నిబంధనలు ఇవీ..

అటవీ ప్రాంతాల్లోని పోడు భూములను సాగుచేసుకుంటున్న ఆదివాసీ రైతులకు వారి ఆధీనంలో ఉన్న భూమిపై హక్కులు కల్పించడంతో పాటు అటవీ హద్దులను కట్టుదిట్టం చేయాలనే లక్ష్యంతో 2006లో ‘రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ -2006″ (అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006)ను అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.

ఈ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13వ తేదీలోపు అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు, అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసియేతరుల (అటవీ ప్రాంతాల్లో నివసించే అన్ని కులాలు) ఆధీనంలో ఉన్న భూమిపై వారి అర్హతలను బట్టి 10 ఎకరాల్లోపు విస్తీర్ణానికి భూ హక్కులు కల్పించాలి.

ఆదివాసీల సాగులో ఉన్నట్లుగా గతంలో ఏమైనా శిస్తులు చెల్లిస్తే ఆ రుజువులతో పాటు అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నట్టగా సమీప గ్రామాల్లోని పెద్ద మనుషులు లేదా ఐటీడీఏ అధికారులు ధ్రవీకరిస్తే.. వారికి ఆ భూమిపై సాగు హక్కులు కల్పిస్తూ భూహక్కు పత్రాలను వెంటనే జారీ చేయాలి. కానీ ఆదివాసియేతరులు మాత్రం సుమారు మూడు తరాల వారసులు (ఒక్కో తరం సుమారు 25 ఏండ్ల చొప్పున మొత్తం 75 సంవత్సరాల నుంచి) సాగుచేసుకుంటున్నట్లుగా ఆధారాలను చూపించాలని నిబంధన పెట్టారు.

పలు కారణాలతో దరఖాస్తులు తిరస్కరిస్తే రాతపూర్వకంగా దరఖాస్తుదారుడికి తెలపాలి. ఇలా చేయడం వలన సదరు గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలకు అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. అలాగే నిర్ణీత సమయంలోపు అర్హులు దరఖాస్తులు చేసుకోనట్లైతే… వారు మళ్లీ గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకునేలా నోటిఫికేషన్ ఇవ్వాలి.

సీఈసీకి ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఫిర్యాదు

ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ యాక్టు-1980కి విరుద్ధంగా తెలంగాణలో సుమారు 11.50 లక్షల ఫారెస్ట్‌ భూములను పంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంపై విచారణ చేయాలని కోరుతూ 2023 మే 26న జ్యూడిషరీ పరిధిలోని సెంట్రల్‌ ఎంపవర్‌మెంట్‌ కమిటీ (సీఈసీ)కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అటవీ శాఖ ఉన్నతాధికారులను సీఈసీ ఆదేశించింది.

నిజమేనని ఒప్పుకున్న అటవీశాఖ…

తెలంగాణ ప్రభుత్వం ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ చట్టం-1980ని దుర్వినియోగం చేస్తున్న విషయం నిజమేనని తెలంగాణ ప్రభుత్వ అటవీ శాఖ ఉన్నతాధికారులు ఒప్పుకోవడం కొసమెరుపు. అయితే ఈ భూములను ఎవ్వరికీ పంపిణీ చేయడం లేదని, అటవీ భూములపై ఎవరూ కబ్జాలో లేరని అటవీ అధికారులు 2023 జూన్‌ 22వ తేదీన సీఈసీ రాసిన లేఖ (ఆర్సీ నంబర్‌-522278/2022/డబ్లూఎల్‌ఆర్‌-3)లో తెలిపారు.

అర్హులకు పట్టాలనివ్వడం లేదు: మెండి లింగయ్య, చెంచు పెంట

మాది నాగర్‌ కర్నూల్‌ జిల్లా పదర మండల పరిధిలోని చిట్లగుంట (గోడల్‌సేను) చెంచు పెంట. తాతల కాలం నుంచి 3 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నం. మాకు గతంలో హక్కు పత్రాలిచ్చారు. కొద్ది రోజుల కిందట అటవీ అధికారులు మాతో తెల్లకాగితంపై సంతకాలు పెట్టించుకున్నారు. ఇప్పుడు లిస్టులో నా పేరు లేదంటున్నారు. మా పెంటలో ఐదు మందికి రాలేదు. అడిగితే మరో లిస్టు వస్తది అంటున్నారు. మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి.