చరిత్ర ఆనవాళ్లు ఉంటే KCRకు గిట్టదు: రేవంత్‌రెడ్డి
రామప్ప అభివృద్ధిపై CM KCR నిర్లక్ష్యం కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నం యాత్రలో పాల్గొన్న నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు రెండవరోజు పాదయాత్ర ప్రారంభం అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్న స్థానికులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గత కాలపు చరిత్రన్నా… చరిత్ర ఆనవాళ్లన్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గిట్టదని, వాటిని కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నిస్తారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. రామప్ప అభివృద్ధిని చూస్తే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం.. కేసిఆర్ వైఖరి స్పష్టం అవుతోందన్నారు. పాదయాత్ర రెండో రోజు […]

- రామప్ప అభివృద్ధిపై CM KCR నిర్లక్ష్యం
- కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నం
- యాత్రలో పాల్గొన్న నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు
- రెండవరోజు పాదయాత్ర ప్రారంభం
- అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్న స్థానికులు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గత కాలపు చరిత్రన్నా… చరిత్ర ఆనవాళ్లన్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గిట్టదని, వాటిని కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నిస్తారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. రామప్ప అభివృద్ధిని చూస్తే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం.. కేసిఆర్ వైఖరి స్పష్టం అవుతోందన్నారు.
పాదయాత్ర రెండో రోజు ప్రారంభానికి ముందు పాలంపేట రామప్ప దేవాలయంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ సంకుచిత దృక్పథం ఫలితంగానే సెక్రటేరియట్ కూలగొట్టి కొత్తది నిర్మిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు వాస్తు అంటే పిచ్చని అన్నారు.
800 ఏళ్ల క్రితం కాకతీయ సామ్రాజ్యంలో సామంత రాజులుగా ఉన్న రేచర్ల సోదరుల నేతృత్వంలో రామప్ప దేవాలయాన్ని నిర్మించినట్టు తెలుస్తుందని వివరించారు. ఈ అద్భుత కళాఖండం మనకందించారని అన్నారు. ఈ దేవాలయాన్ని పరిశీలిస్తే అద్భుతమైన సంస్కృతి కనిపిస్తుందని ఇందులో భిన్న సంస్కృతుల మేళవింపు కలిసి ఉందని వివరించారు. కాకతీయులకు ఇతర ప్రపంచ దేశాలతో సంబంధం ఉన్న ఫలితంగానే భిన్న సంస్కృతులు ఈ దేవాలయ నిర్మాణంలో కనిపిస్తున్నాయని అన్నారు. ఈ దేవాలయ నిర్మాణం వల్ల 800 ఏళ్ల క్రితం నాటి సంస్కృతిని తెలుసుకునే అవకాశం లభించిందన్నారు.
రామప్పపై కేసీఆర్ నిర్లక్ష్యం..
దేవాలయానికి యునెస్కో గుర్తింపు పొందినప్పటికీ, చంద్రశేఖర రావు గుళ్ళు గోపురాలు అభివృద్ధికి ఎన్నో నిధులు వెచ్చిస్తున్నట్లు చెబుతున్నా ఇక్కడ మాత్రం అలాంటి అభివృద్ధి ఏమి కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అంటేనే సంస్కృతి, తెలంగాణ అంటేనే వారసత్వ సంపదని.. తెలంగాణకు వచ్చిన వారసత్వ సంపదని కాలగర్భంలో కలిపేందుకు సీఎం చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గత కాలపు చరిత్ర.. ఆ చరిత్ర ఆనవాళ్లు ఉండకూడదని చంద్రశేఖర రావు ఉద్దేశ్యమని ఆరోపించారు.
తర్వాత మానుకోట, డోర్నకల్‌లో..
కాంగ్రెస్ పార్టీ యువ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడోయాత్ర కొనసాగింపులో భాగంగా పిసిసి ఆధ్వర్యంలో తాను హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. సోదరి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభించామని అపూర్వ స్పందన లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు, దళిత, గిరిజన, గిరిజనేతర పేదలు అందరూ పెద్ద ఎత్తున భాగస్వామ్యమై ఈ యాత్రను జయప్రదం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ములుగు నియోజకవర్గం అనంతరం మహబూబాబాద్, డోర్నకల్లో యాత్ర కొనసాగుతుందని రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.
నిన్నటి జోడో పాదయాత్రలో భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య, మాజీ ఎంపీ బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యే సీతక్క రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్గొని విజయవంతం చేశారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.
రెండవరోజు కొనసాగుతున్న యాత్ర
రెండవ రోజు ఉదయం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రామప్ప దేవాలయంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామప్ప నుంచి యాత్ర ప్రారంభించి రామానుజాపురం, చెంచు కాలనీ, నారాయణగిరి పల్లె మీదుగా మధ్యాహ్నం బుద్ధారం చేరుకున్నారు. యాత్రకు స్థానికులు, కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలుకుతున్నారు. బుద్ధారం – చేతరాజు పల్లి మధ్య మధ్యాహ్న భోజనం చేసి అనంతరం యాత్ర చేపట్టి సాయంత్రం కేశవాపురం, బండారుపల్లి మీదుగా ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు.
అనంతరం రాత్రి ములుగు గాంధీ పార్క్ సెంటర్లో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. రాత్రి అక్కడే ములుగులో బస చేసి మూడవరోజు యాత్ర కొనసాగించనున్నారు.