ఈ నెలాఖరులోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ : మంత్రి పొంగులేటి

ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ
తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు
రేపటి కేబినెట్ భేటీలో స్పష్టత
విధాత : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులోనే రాబోతుందుని..కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సిద్దం కావాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తన పాలేరు నియోజకవర్గంకు సంబంధించి మండలాల వారిగా కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాలు మంత్రి పొంగులేటి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రేపు సోమవారం జరిగే కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టతవస్తుందన్నారు. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని.. ఆ తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని పొంగులేటి వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్ల శాతాన్ని పెంచి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలిపారు.
కార్యకర్తలంతా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని, ప్రత్యర్థి పార్టీలకు అవకాశమివ్వకుండా వీలైనంత మేరకు ఏకగ్రీవాలకు ప్రయత్నించాలని సూచించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని..అడిగిన ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని..సన్నబియ్యం పథకం, కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, సన్న ధాన్యానికి బోనస్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని పొంగులేటి గుర్తు చేశారు. ప్రజలు వ్యతిరేకించిన ధరణి తీసివేసి..భూభారతి తెచ్చామని తెలిపారు. రైతురుణమాఫీ చేశామని..రైతు భరోసా పంపిణీ కూడా ఈ నెలలోనే పూర్తవ్వనుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు అమలు చేస్తున్నందునా వాటిని గడపగడపకు తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ప్రయత్నించాలని కేడర్ కు పొంగులేటి సూచించారు.