Maharastra | మరో విపక్షంలో BJP చిచ్చు.. NCPలో చీలిక?

బీజేపీలో కలవనున్న అజిత్‌పవార్‌ వర్గం! మధ్యవర్తిత్వం నెరపుతున్న సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఎన్సీపీలోనే ఉన్నానంటున్న అజిత్‌పవార్‌ ఊహాగానాలన్నీ మీడియాలోనే: శరద్‌పవార్‌ Maharastra Politics । పార్టీలను చీల్చడంలో గత తొమ్మిదేండ్లలో మంచి అనుభవం సంపాదించిన బీజేపీ.. మరో పార్టీలో చిచ్చు పెడుతున్నదా? ఇప్పటికే మహారాష్ట్రలో శివసేనను చీల్చి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకులు.. ఇదే మహారాష్ట్రలో మరో కీలక పక్షమైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీపై కన్నేశారా? ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. నిప్పు […]

Maharastra | మరో విపక్షంలో BJP చిచ్చు.. NCPలో చీలిక?
  • బీజేపీలో కలవనున్న అజిత్‌పవార్‌ వర్గం!
  • మధ్యవర్తిత్వం నెరపుతున్న సీఎం ఏక్‌నాథ్‌ షిండే
  • ఎన్సీపీలోనే ఉన్నానంటున్న అజిత్‌పవార్‌
  • ఊహాగానాలన్నీ మీడియాలోనే: శరద్‌పవార్‌

Maharastra Politics ।

పార్టీలను చీల్చడంలో గత తొమ్మిదేండ్లలో మంచి అనుభవం సంపాదించిన బీజేపీ.. మరో పార్టీలో చిచ్చు పెడుతున్నదా? ఇప్పటికే మహారాష్ట్రలో శివసేనను చీల్చి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకులు.. ఇదే మహారాష్ట్రలో మరో కీలక పక్షమైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీపై కన్నేశారా? ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదు కదా మరి!!

విధాత : ఎన్సీపీ సీనియర్‌ నేత, ఆ పార్టీ అధినేత శరద్‌పవార్‌ మేనల్లుడు అజిత్‌ పవార్‌ బీజేపీకి దగ్గర అవుతున్నారన్న చర్చ రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నది. అందరి కళ్లు అజిత్‌వైపే చూస్తున్నాయి. దాదాపు పది రోజులుగా ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నారు. సోమవారం పుణెలో జరగాల్సిన పార్టీ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు. ఇదే సమయంలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు సీనియర్‌ బీజేపీ నేతలు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడంతో అజిత్‌పవార్‌ బీజేపీతో చేతులు కలపనున్నారా? అన్న సందేహాలకు బలం చేకూరుతున్నది.

2019 నవంబర్‌లో కొద్దిరోజులు ఆయన బీజేపీతో జట్టుకట్టిన సంగతి తెలిసిందే. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినా.. అప్పటి నాటకీయ పరిణామాలతో 80 గంటల్లోపే ఆయన రాజీనామా చేశారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌కు మేనల్లుడైన అజిత్‌ పవార్‌ నాలుగు పర్యాయాలు ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు.

అజిత్‌ పవార్‌ పాలనా వ్యవహారాల్లో నిక్కచ్చిగా కఠినంగా ఉంటారన్న పేరు సంపాదించుకున్నారు. పుణె జిల్లాలోని గ్రామీణ నియోజకవర్గమైన బారామతి నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచిన ఆయనకు ప్రజాదరణ పొందిన నేతగా గుర్తింపు ఉన్నది. ఆయన అందరిలా ఆలోచించడని, అవసరమైతే పార్టీ విధానానికి భిన్నంగా మాట్లాడటానికి సంకోచించరని ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి.

మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారని చెబుతున్నా.. ఇప్పటి వరకూ ఆ సంకేతాలు ఏమీ లేవు. దాదాపు పది రోజుల తర్వాత ఆయన ఒక ప్రకటన చేస్తూ, తాను ముంబైలోనే ఉన్నానని తెలిపారు. అయితే.. గతవారం కూడా ఆయన తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకోవడం, బీజేపీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే శిబిరంపై మెత్తని పలుకులు పలకడంతో ఇక అజిత్‌ పవార్‌ బీజేపీతో చేతులు కలుపుతారన్న ఊహాగానాలు చెలరేగాయి.

మహారాష్ట్రలో ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 16 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలు చెలరేగాయి. ఆనాటి తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఏక్‌నాథ్‌ షిండే.. తర్వాత బీజేపీతో చేతులు కలిపిన.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొన్న సంగతి తెలిసిందే.

అజిత్‌ పవార్‌ బీజేపీతో జట్టు కట్టే అవకాశం ఉన్నదంటూ సామాజిక కార్యకర్త అంజలి దమానియా చేసిన ట్వీట్‌ తాజా ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. ‘నేను ఈ రోజు ఒక పనిమీద సచివాలయానికి వెళ్లాను. ఒక వ్యక్తి నన్ను కలిసి ఒక హాస్యాస్పదమైన కథ చెప్పారు. ఆయన చెప్పేదేమిటంటే.. 15 మంది ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు అనర్హత వేటు వేయనున్నది.. అజిత్‌ పవార్‌ త్వరలోనే బీజేపీతో చేతులు కలుపుతారు.. అని. మహారాష్ట్రలో రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సిన దుస్థితి ఎదురవుతుందో చూడాలి.. అని ఆమె తన ట్వీట్‌ను ముగించారు.

ఇదే విషయాన్ని అజిత్‌ పవార్‌ వద్ద ప్రస్తావిస్తే.. ‘ఆమె లాంటి ప్రముఖ వ్యక్తి చెప్పిన విషయం మీద నాలాంటి చిన్న పార్టీ కార్యకర్త ఏం మాట్లాడగలడు?’ అంటూ దాటవేశారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని, ఎన్సీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎన్సీపీ ఎమ్మెల్యేల నుంచీ తాను సంతకాలు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

తన గురించి అపోహలను, గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. దాదా (అజిత్‌) ఎన్సీపీతోనే ఉన్నరని, ఎవరితో ఆయన సంప్రదింపులు జరపలేదని ఆ పార్టీ నేత అనిల్‌ పాటిల్‌ చెప్పారు. మరోవైపు ఎన్సీపీని వదిలి బీజేపీలోకి అజిత్‌పవార్‌ వస్తానంటే సంతోషంగా స్వాగతిస్తామని మహారాష్ట్ర మంత్రి ఉదయ్‌ సమంత అన్నారు.

ఎన్నికల పనిలో బిజీగా ఉన్నారు: శ‌ర‌ద్‌ప‌వార్‌

అజిత్‌ పవార్‌ పార్టీ మారుతారన్న ఊహాగానాలను పార్టీ అధినేత శరద్‌పవార్‌ కొట్టిపారేశారు. ఆయన ఎన్నికల పనిలో బిజీగా ఉన్నారని చెప్పారు. ఊహాగానాలన్నీ మీడియాలోనే జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసేందుకు, ఫైనల్‌ డీల్‌ మాట్లాడుకునేందుకు అజిత్‌పవార్‌ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారని ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం.. తాజా చర్చకు తావిచ్చింది. ఈ కథనాన్ని కూడా అజిత్‌పవార్‌ ఖండించారు.

ఈ మొత్తం డీల్‌ను సీఎం ఏక్‌నాథ్‌ షిండే నడిపిస్తున్నారని, బీజేపీతో కలిసిన పక్షంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నదని ఆంగ్ల పత్రిక పేర్కొన్నది. అజిత్‌కు 35-40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున ఆయన పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకి కూడా వచ్చే అవకాశం లేదని తెలిపింది.

మహారాష్ట్ర ఓటర్లలో దాదాపు 35 శాతం మరాఠాలు ఉంటారు. తమ తరఫున గట్టి మరాఠా నాయకుడు లేడనే భావనలో బీజేపీ ఉన్నదని చెబుతుంటారు. అందుకే మరాఠాల్లో గట్టి పట్టున్న అజిత్‌పవార్‌పై కన్నేసి ఉంచిందని అంటున్నారు.

అజిత్‌పవార్‌ ఖండనలు, శరద్‌పవార్‌ తిరస్కారాలు ఎలా ఉన్నా.. ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు మాత్రం అజిత్‌పవార్‌ ఎక్కడుంటే తామూ అక్కడే ఉంటామని చెప్పడం కొసమెరుపు.