Manipur | మణిపూర్ హింసపై రసాభాస.. లోక్‌సభ సోమవారానికి వాయిదా
Manipur బిరేన్సింగ్ రాజీనామాకు డిమాండ్లు ఖండనలోనూ రాజకీయాలా? :ప్రియాంక బేటీ బచావో.. బేటీ జలావోగా మారింది మండిపడిన బెంగాల్ సీఎం మమత న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల రెండో రోజు కూడా మణిపూర్ హింసపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. విపక్ష సభ్యుల అరుపులు, నినాదాల మధ్య సభ రసాభాసగా మారింది. దీంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు, మే 3 నుంచి కొనసాగుతున్న హింసాకాండ గురించి చర్చించాలని ప్రతిపక్షాలు […]

Manipur
- బిరేన్సింగ్ రాజీనామాకు డిమాండ్లు
- ఖండనలోనూ రాజకీయాలా? :ప్రియాంక
- బేటీ బచావో.. బేటీ జలావోగా మారింది
- మండిపడిన బెంగాల్ సీఎం మమత
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల రెండో రోజు కూడా మణిపూర్ హింసపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. విపక్ష సభ్యుల అరుపులు, నినాదాల మధ్య సభ రసాభాసగా మారింది. దీంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు, మే 3 నుంచి కొనసాగుతున్న హింసాకాండ గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. లోక్‌సభ, రాజ్యసభలలో శుక్రవారం కార్యకలాపాలు ప్రారంభమైన కాసేపటికే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యులు శాంతించకపోవడంతో లోక్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
ప్రతిపక్షాలకు శ్రద్ధ లేదు: రాజ్‌నాథ్
మణిపూర్ సమస్యపై చర్చ జరపడంపై ప్రతిపక్షాలకు శ్రద్ధ లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఈ సమస్యపై చర్చించాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారన్నారు. మణిపూర్ సంఘటన పట్ల దేశం సిగ్గుతో తలదించుకుంటోందని మోదీ చెప్పారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మణిపూర్‌లో దోషులను అరెస్ట్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తామన్నారు.
బీజేపీ మొసలి కన్నీరు : సంజయ్ రౌత్
మణిపూర్ పరిస్థితిపై అంతర్జాతీయ వేదికలపై చర్చ జరుగుతోందని, కానీ మన పార్లమెంటులో మాత్రం చర్చించడం లేదన్నారు శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్. ‘నిర్భయ’ కేసులో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ అప్పటి ప్రభుత్వాన్ని వణికించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బీజేపీ మొసలి కన్నీరు కార్చుతోందన్నారు.
మణిపూర్‌లో మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్వీయ విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ చెప్పారు.
మే 18న పోలీసులకు ఫిర్యాదు అందిందని, దీనిపై జూన్ 21న ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. ఈ దారుణానికి పాల్పడినవారికి మరణ శిక్ష విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హుయిరెమ్ హెరోడస్ ఇంటిని దుండగులు గురువారం తగులబెట్టారు. పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు గుంపుగా వచ్చి, ఈ ఇంటిని తగులబెట్టారు.
హౌజ్ ఆఫ్ కామన్స్‌లో మణిపూర్ హింసపై చర్చ
మణిపూర్ హింసాకాండపై బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ ప్రత్యేక ప్రతినిధి, ప్రీడమ్ ఆఫ్ రిలీజిన్, బిలీఫ్ (మత లేదా విశ్వాసాల స్వేచ్ఛా సంఘం FROB ) ఎంపీ ఫియోన బ్రూసి హౌజ్ ఆఫ్ కామన్స్‌లో చర్చ లేవనెత్తారు. మణిపూర్ హింస పై బీబీసీ ఎందుకు మౌనం వహిస్తున్నదని ప్రశ్నించారు. బీబీసీ మాజీ రిపోర్టర్ డేవిడ్ కెంపనేల్ మణిపూర్ హింసపై రాసిన రిపోర్టును ఫియోన ఉదహరించారు.
మణిపూర్ హింసకు ఇప్పటివరకు 150 మందికిపైగా అమాయక ప్రజలు బలయ్యారని, గాయపడ్డవారి సంఖ్య లెక్కేలేదన్నారు. మణిపూర్‌లో ఇండ్లను, చర్చ్‌లను కూలగొట్టారని, నిప్పు అంటించి నేల మట్టంచేశారని అన్నారు. సుమారు 50 వేల మంది ప్రజలు నిరాశ్రయులై శరణార్ధి క్యాంపుల్లో తలదాచుకుంటున్నారన్నారు.
ఒక ప్రత్యేక మతం వారి పై పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని ఫియోనా ఆరోపించారు. వాస్తవ ఘటనలు ప్రజల దృష్టికి రాకుండా మీడియాను సైతం కట్టడి చేస్తున్నారని పేర్కొన్నారు. పీడితులు సహాయం కోసం కేకలు పెడుతున్నారని, అటువంటప్పుడు మరి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఏం చర్యలు తీసుకొందని ఆమె ప్రశ్నించారు. ఫియోనా లేవనెత్తిన విషయాలను ఆర్క్ బిషఫ్ దృష్టికి తీసుకెల్లి చర్యలు తీసుకొనేలా చూస్తామని చర్చ్ కమీషనర్ , ఎంపీ ఆండ్ర్యూసెలస్ చెప్పారు. బ్రూసీ ఆవేదనకు మద్దతు పలికారు.
సీఎం రాజీనామాకు డిమాండ్లు
ఇద్దరు కుకీ గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, గ్యాంగ్‌రేప్ చేసిన వీడియో వెలుగు చూసిన దగ్గర నుంచి మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్సింగ్‌ను ఆ పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్ ఊపందుకున్నది. ఈ ఘటనపై బిరేన్‌సింగ్ ప్రభుత్వం రాజీనామా చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నది.
ఖండనలోనూ రాజకీయాలా?
మణిపూర్ ఘటన విషయంలో లేకలేక నోరు తెరిచిన ప్రధాని నరేంద్రమోదీ.. ఖండన విషయంలోనూ రాజకీయాలకు పాల్పడ్డారని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. మణిపూర్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటనను ఖండించే విషయంలో కూడా మోదీ తన రాజకీయాన్ని పక్కనపెట్టలేదని ప్రియాంకగాంధీ విమర్శించారు.
బెంగాల్‌లో ఎలాంటి ఘటన జరిగిన సత్వరమే కేంద్రబలగాలను పంపే బీజేపీ సర్కారు.. మణిపూర్ విషయంలో ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ ఘటనతోపాటు.. బిల్కిస్‌బానో గ్యాంగ్‌రేప్ దోషుల విడుదల, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు లేకపోవడం వంటి ఘటనలు ప్రస్తావిస్తూ.. బీజేపీ నినాదమైన బేటీ బచావో కాస్తా.. ‘బేటీ జలావో’ అని ఆరోపించారు.
మణిపూర్ ఘటనను గురువారం ఖండించిన మోదీ.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లోనూ మహిళలపై హింస జరుగుతున్నదని వ్యాఖ్యనించారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న సంగతి తెలిసిందే.