MARS | వేగం పెంచిన అంగారకుడు.. త్వరగా ముగిసిపోతున్న పరిభ్రమణం
MARS | మానవుని తర్వాతి నివాసంగా శాస్త్రవేత్తలను ఊరిస్తున్న అంగారకు (Mars) ని గురించి మరో కొత్త విషయం తెలిసింది. పరిశోధకులు తొలిసారిగా ఆ గ్రహ పరిభ్రమణ రేటును అత్యంత కచ్చితత్వంతో కనుగొన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ ఈ అంగాకర గ్రహం వేగంగా పరిభ్రమిస్తోందని గుర్తించారు. దీని వెనుక ఉన్న కారణాలను కనుగొనేందుకు వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నాసా (NASA) మార్స్ పైకి పంపిన ఇన్‌సైట్ ల్యాండర్ ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు […]

MARS |
మానవుని తర్వాతి నివాసంగా శాస్త్రవేత్తలను ఊరిస్తున్న అంగారకు (Mars) ని గురించి మరో కొత్త విషయం తెలిసింది. పరిశోధకులు తొలిసారిగా ఆ గ్రహ పరిభ్రమణ రేటును అత్యంత కచ్చితత్వంతో కనుగొన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ ఈ అంగాకర గ్రహం వేగంగా పరిభ్రమిస్తోందని గుర్తించారు. దీని వెనుక ఉన్న కారణాలను కనుగొనేందుకు వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
నాసా (NASA) మార్స్ పైకి పంపిన ఇన్‌సైట్ ల్యాండర్ ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. తన నాలుగేళ్ల జీవిత కాలాన్ని పూర్తి చేసుకున్న ఇన్‌సైట్ ల్యాండర్ (InSight Lander) 2022 డిసెంబర్‌లో ఇంధనం లేక పనిచేయడం మానేసింది. అయితే ఆ నాలుగేళ్ల కాలంలో అది అత్యంత విలువైన సమాచారాన్ని భూమి పైకి పంపించింది.
అందులో ఉండే రొటేషన్ అండ్ స్ట్రక్చర్ ఎక్స్‌పరిమెంట్ (రైస్) పరికరం సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆ ఫలితాలను జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. అంగారక గ్రహం ప్రతి సంవత్సరానికి 4 మిల్లిఆర్క్ సెకండ్స్ ముందుగా పరిభ్రమణాన్ని పూర్తి చేసుకుంటోందని అందులో ప్రస్తావించారు. దీంతో ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు దీని వెనుక కారణాలను ఊహించారు.
ఇంతకు పూర్వం భారీ మంచుతో కప్పబడిఉన్న అంగారకుని ధ్రువ ప్రాంతాల్లో … ఇప్పుడు మంచు కరిగిపోయింది. దీంతో ఆ భూ గర్భంలో ఉండే ఒత్తిడి మెల్లగా ఉపరితలానికి వస్తోంది. ఈ ప్రక్రియ వల్ల అంగారకుని ద్రవ్యరాశిలో మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులే ఆ గ్రహం వేగంగా పరిభ్రమించడానికి దారి తీసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
మనకు దూరంగా వస్తున్న అంబులెన్స్ సైరన్ ఒక రకంగా ఉంటుంది.. దగ్గరగా వస్తున్న అంబులెన్స్ సైరన్ మరో రకంగా వినిపిస్తుంది. దీనినే డోప్లర్ ఎఫెక్ట్ అంటారు. అంగారకుని వేగాన్ని గుర్తించడానికి శాస్త్రవేత్తలు ఈ సాధారణ టెక్నిక్‌నే ఉపయోగించారు. భూమిపై ఉండే డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా రేడియో సిగ్నల్‌ను ఇన్‌సైట్ ల్యాండర్‌కు పంపేవారు.
ఆ సిగ్నల్‌ను రైస్ వెనక్కు పంపించేది. ఇలా పలుమార్లు సిగ్నల్స్ బట్వాడా జరిగిన అనంతరం.. వాటి మధ్య ఉండే వైరుధ్యాలను విశ్లేషించారు. ల్యాండర్ గతిశీలతను తద్వారా అది ఉన్న అంగారక గ్రహం గతిశీలతను అంచనా వేసి దాని పరిభ్రమణ వేగం పెరిగిందని నిర్ధారించారు.