Medak | జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రేపు సాయంత్రం 5లోగా విధుల్లో చేరాలి: కలెక్టర్
Medak విధాత,మెదక్ బ్యూరో: ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తూ తమను క్రమబద్దీకరించాలంటూ సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మంగళవారం (9-5-2023) సాయంత్రం 5 గంటల లోగా విధులలో చేరవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్దీకరించవలసినదిగా డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 28 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా స్పందిస్తూ సమ్మె […]
Medak
విధాత,మెదక్ బ్యూరో: ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తూ తమను క్రమబద్దీకరించాలంటూ సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మంగళవారం (9-5-2023) సాయంత్రం 5 గంటల లోగా విధులలో చేరవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్దీకరించవలసినదిగా డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 28 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా స్పందిస్తూ సమ్మె విరమించి విధుల్లో చేరాలని స్పష్టం చేస్తూ నోటీసులు జారీ చేశారని సోమవారం ఇక్కడ కలెక్టర్ తెలిపారు.
ఒప్పంద ప్రాతిపదిక నియామకం కాబడిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ అగ్రిమెంట్ లో ఏ యూనియన్ లో, సంస్థలో చేరబోమని సంతకం చేశారని, అట్టి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సమ్మెలో కొనసాగడం చట్ట విరుద్ధమని ఆ నోటీసులో పేర్కొన్నారని కలెక్టర్ తెలిపారు. అంతేగాక రెగ్యులర్ నియామకం కానందున క్రమబద్దీకరణ కు హక్కు లేదా దావా వేయడానికి అవకాశముండదని అన్నారు.
కాగా కాట్రాక్టు ఉద్యోగి పనితీరు, మూల్యాంకనానికి లోబడి ప్రభుత్వం నియమించిన కమిటీ వారి సేవల పట్ల సంతృప్తి చెందితే క్రమబద్దీకరించుటకు ఒక అవకాశం ఉంటుందని అన్నారు. కానీ చట్ట విరుద్ధంగా యూనియన్ ఏర్పాటు చేసి సమ్మె చేయడం ద్వారా సర్వీసులో కొనసాగడానికి అన్ని హక్కులు కోల్పోయారని ఆ నోటీసులో పేర్కొన్నారని కలెక్టర్ తెలిపారు.
అయినా ప్రభుత్వం మానవతా దృక్పధంతో మంగళవారం లోగా విధులలో చేరుటకు ఒక అవకాశం ఇచ్చిందని, చేరని వారిని ఉద్యోగంలోంచి తొలగిస్తామని నోటీసులో పేర్కొందన్నారు. కావున సమ్మెలో ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంగళవారం (9-5-2023) సాయంత్రం 5 గంటలలోగా సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో విధులలో చేరవలసినదిగా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram