CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో.. మీనాక్షి నటరాజన్ కీలక భేటీ

విధాత, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ(Telangana Congress Affairs In-charge)మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)సమావేశమ్యారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా సమాచారం. సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. అలాగే రెండు రోజులుగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో పార్టీ నేతల అభిప్రాయాలపై కూడా వారు చర్చించారు. అలాగే తాజాగా ముగిసిన కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు నల్లగొం, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానం ఫలితాలపై కూడా వారు చర్చించారు.
అటు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారమే నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని 5, ఆంధ్రప్రదేశ్‌లోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న పోలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. తెలంగాణలో ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఇందులో బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎగ్గె మల్లేశం గత ఏడాదే కాంగ్రెస్ లో చేరారు. మీర్జా రియాజుల్ హాసన్ మజ్లిస్ నేత కాగా, మిగిలిన ముగ్గురు బీఆర్‌ఎస్ నేతలు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. నామినేషన్ల స్వీకరణకు మార్చి 10 చివరి తేదీ. మార్చి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. మార్చి 24వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ ముగించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అధికార పార్టీ అభ్యర్థులుగా పలువురి పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. ఓసీ కేటగిరీ నుంచి జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి, బండ్ల గణేశ్, కుసుమ్ కుమార్, కుమార్‌రావు, బీసీల నుంచి అంజన్ కుమార్ యాదవ్, చరణ్ కౌశిక్‌యాదవ్, ఎస్సీ కోటాలో సంపత్‌కుమార్, మైనార్టీ వర్గం నుంచి ఫిరోజ్‌ఖాన్, షబ్బీర్‌అలీ, అజ్మతుల్లా రేసులో ఉన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్య బలం (కాంగ్రెస్ 65 + సీపీఐ 1) ఆధారంగా… ఎమ్మెల్యే కోటా కింద ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ మూడు స్థానాలను సులభంగా గెలుచుకోగలదు. మరో అదనపు సీటు గెలవాలంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోని చేరిన 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కీలకం కానుంది.
అయితే ఎంఐఎం, సీపీఐలు ఒక సీటును ఆశిస్తున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా సీపీఐ ఒక్క సీటు కాంగ్రెస్‌ను అడుగుతుంది. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఒక్క స్థానంలో తమ అభ్యర్థికి సహకరించాలని ఎంఐఎం పట్టుబడితే… అవగాహనలో భాగంగా కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 29 మంది ఎమ్మెల్యేలు (కాంగ్రెస్‌లో చేరిన 10 మందిని మినహాయిస్తే), బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలవడానికి 20 మంది ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. కాంగ్రెస్‌కు 66 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ మూడు స్థానాలు సులువుగా గెలుచుకోగలదు. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఒక్క స్థానంలో విజయం సాధించగలదు.