ఒత్తిళ్లు పెట్టం.. నిజాయితీగా పనిచేయండి
తెలంగాణ ప్రజలు చారిత్రాత్మక తీర్పుతో పాలనలో మార్పు కోరుకున్నారని, ఇది ప్రజా ప్రభుత్వమని అధికారులు ఎక్కడా కూడా నిజాయితీ తగ్గకుండా తమ విధులు నిర్వర్తించాలని, ప్రజలకు ప్రజాపాలన అందించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు

- అధికారులకు మంత్రి ఉత్తమ్ హితవు
- నిబంధనలే మేరకే పనులు చేయాలి
- ప్రజాపాలన అందించాలి
విధాత: తెలంగాణ ప్రజలు చారిత్రాత్మక తీర్పుతో పాలనలో మార్పు కోరుకున్నారని, ఇది ప్రజా ప్రభుత్వమని అధికారులు ఎక్కడా కూడా నిజాయితీ తగ్గకుండా తమ విధులు నిర్వర్తించాలని, ప్రజలకు ప్రజాపాలన అందించాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. శనివారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. టౌన్ హాల్ ను పరిశీలించి అధికారులతో సమావేశం నిర్వహించారు.
అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు, తాగునీటి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు తమ విధులు జాగ్రత్తగా నిర్వహించాలని ,ఏ అధికారి పైన రాజకీయ ఒత్తిళ్లు ఉండవని అలాంటివి అనిపిస్తే తప్పకుండా తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఎంతటి పనినైనా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే జరగాలని స్పష్టం చేశారు.
ఎండలు తీవ్రంగా ఉండటం వలన మంచినీటి సమస్య రావచ్చని మున్సిపాలిటీలలో, గ్రామాలలో అన్ని బోర్లను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి ఎస్‌డీఎఫ్ నిధులు మంజూరీ చేశామని వెల్లడించారు. కృష్ణా నదిలో పులిచింతల బ్యాక్ వాటర్ నందు గతంలో పైపుల ద్వారా త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని, దీనిపై మళ్లీ అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.
ఈ వేసవికాలంలో సంబంధిత ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్ అధికారులు, అప్రమత్తంగా ఉండాలని, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చే అవకాశమున్నందునా ఈ నెల 11లోగా కొత్త పనులు మంజూరు చేయాలని డీఆర్‌డీవో పీడీని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ప్రజా పాలనలో ప్రజలకు మెరుగైన పాలన అందించాలని మంత్రి తెలిపారు.
అభివృద్ధిలో ఆదర్శంగా హుజూర్‌నగర్
హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అధికారులు తీర్చిదిద్దాలని, దీనికి అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని మంత్రి ఉత్తమ్ కోరారు. టౌన్ హాల్ సుందరి సుందరీకరణ, అభివృద్ధి కొరకు చేపట్టనున్న పనులకు కోటి రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. చిన్న, మధ్య తరగతి కుటుంబాలు శుభకార్యాలు జరుపుకొనుటకు వీలుగా ఈ టౌన్‌హాల్‌లో అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇది మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణలో ఉంటుందని పేర్కోన్నారు. హుజూర్ నగర్ పట్టణంలోని ప్రధాన రహదారులు రూ. 5.30 కోట్లు మంజూరు చేశామని, అలాగే పైప్ లైన్ ల నిర్మాణం డ్రైన్‌ల రిపేరు, గ్రంథాలయ బిల్డింగ్ పనులు, మిగిలిన రింగ్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రి నందు రూ 2.25 కోట్లతో సిటీ స్కాన్ మిషన్ కూడా మంజూరు చేశామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
మేళ్లచెరువులో మహాశివరాత్రి జాతరకు కోటి రూపాయలు మంజూరి చేశామని తెలిపారు. ముస్లిం బజారులో షాదీఖానా మంజూరు చేశామని, రాంపురం నందు షాది ఖానా కొరకు 75 లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలిపాటు. అటు కోదాడ ఈద్గాలో 2 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు, షాదీఖానా కోసం మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కోన్నారు.
హౌజింగ్ కాలనీ పనులు పూర్తి చేయాలి
అనంతరం హుజూర్‌నగర్ రామస్వామి గుట్ట వద్ద క్రిస్టియన్ స్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. అక్కడ చేపట్టబోయే పనుల గురించి అధికారులతో సమీక్షించారు. క్రిస్టియన్ స్మశాన వాటికకు 50 లక్షల రూపాయలు మంజూరి చేశామని వెల్లడించారు. అక్కడి నుంచి రామస్వామి దేవాలయం గుట్ట సమీపంలోని హౌసింగ్ కాలనీ సందర్శించారు. హౌసింగ్ కాలనీకి మంజూరు చేసిన 70 కోట్లతో చేపట్టవలసిన పనులపై అధికారులతో చర్చించారు.కోర్టు కాంప్లెక్స్ కొరకు 5 ఎకరాలు కేటాయించాల్సిందిగా హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ వారు కోరుతున్నారని వారికి అనువైన స్థలాన్ని పరిశీలించాల్సిందిగా హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివాస్ ను ఆదేశించారు. ఆయా సమావేశాల్లో ఆర్‌ఆండ్‌బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ఎంపీడీవో, మైనార్టీ, వైద్య, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.