Modi | ప్రైవేటీకరణపై ఉన్న దృష్టి.. ప్రజాభద్రతపై ఏది?

Modi | ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 278 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పదకొండు వందలకుపైగా గాయపడ్డారు. దీంతో మన రైల్వే భద్రతపై ఎన్నోసందేహాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ.. ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నది. ఆయన అనుయాయులకు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కట్టబెడుతున్నదనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. అన్నింటికి కంటే ప్రధానమైంది ప్రమాదం జరిగిన తర్వాత బాధ్యతనుంచి తప్పించుకునేందుకు కుట్ర కోణాన్ని ముందుకు […]

  • By: krs    latest    Jun 08, 2023 3:54 AM IST
Modi | ప్రైవేటీకరణపై ఉన్న దృష్టి.. ప్రజాభద్రతపై ఏది?

Modi |

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 278 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పదకొండు వందలకుపైగా గాయపడ్డారు. దీంతో మన రైల్వే భద్రతపై ఎన్నోసందేహాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ.. ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నది. ఆయన అనుయాయులకు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కట్టబెడుతున్నదనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. అన్నింటికి కంటే ప్రధానమైంది ప్రమాదం జరిగిన తర్వాత బాధ్యతనుంచి తప్పించుకునేందుకు కుట్ర కోణాన్ని ముందుకు తెచ్చి సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నది.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేవనెత్తిన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. అందులో ప్రధానంగా కాగ్‌ నివేదికను ఆయన ఉటంకించారు. 2017-18 నుంచి 2021-21 మధ్య కాలంలో జరిగిన 10 ప్రమాదాల్లో 7 పట్టాలు తప్పడం వల్లనే జరిగినట్లు కాగ్‌ ప్రత్యేకంగా చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయినా కేంద్రం దీనిపై అలసత్వం ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2017-21 మధ్య కాలంలో ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో రైల్‌, వెల్డ్‌ (ట్రాక్‌ మెయింటెన్స్‌) తనిఖీలు ఒక్కటి కూడా జరగలేదని కాగ్‌ చెప్పిన ప్రధాన విషయాన్ని ఎందుకు విస్మరించారని? రైళ్లు ఢీ కొనకుండా గత ప్రభుత్వాలు తీసుకున్న ‘కవచ్‌’ ఎందుకు పక్కనపెట్టారు? ఆయన ప్రశ్నించారు. బాలేశ్వర్‌ ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నామని రైల్వే మంత్రి చెప్పినప్పటికీ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన నిలదీశారు. నేరాలపై దర్యాప్తు చేసే సంస్థలను ప్రమాదాల కోసం కాదని ఖర్గే మాటలు ఆలోచించదగినవే.

ప్రభుత్వ అసమర్థతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలను ప్రచారం చేయడం కేంద్రంలోని పెద్దలకు అలవాటే. ఇదే విషయాన్ని గతంలో సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన ఎం. నాగేశ్వర్‌రావు కేంద్రం తీరును తప్పుపడుతూ.. ప్రజాగ్రహాన్ని తప్పించుకోవడానికే కుట్రకోణం తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు.

ఐటీ సెల్‌లోని పెయిడ్‌ ఆర్టిస్టులు దానికి అన్నిరకాల అబద్ధాలూ చేర్చి, మతపరమైన మసాలా జోడించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలకు తగ్గట్టుగానే వాట్సప్‌ యూనివర్సిటీలో స్టేషన్‌ మాస్టర్‌ పేరు ముస్లింగా చిత్రీకరించి ఆయన పరారీలో ఉన్నట్టు ప్రచారం చేశారు. నిజం నిద్రలేచే లోగా అబద్ధం ఊరంతా చక్కర్లు కొడుతుందని వాట్సప్‌ వర్సిటీ ప్రచారం అసత్యాలు రుజువు చేస్తున్నాయి.

మన రైల్వే వ్యవస్థ అమెరికా, చైనా, రష్యా తర్వాత ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్నది. రైల్వే సిగ్నలింగ్‌, ప్రయాణికుల సమాచార వ్యవస్థ తదితరాల డిజిటలీకరణ, ఆధునిక సాంకేతిక వినియోగంపై కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. అలాగే దేశవ్యాప్తంగా అత్యధిక వేగంతో ప్రయాణించగల 15 వందే భారత్‌ రైళ్లను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా మోడీ ఇప్పటికీ వందే భారత్‌ రైళ్లను ప్రారంభిస్తూనే ఉన్నారు.

కానీ గత నాలుగేళ్లలో సంభవించిన పది రైలు ప్రమాదాల్లో ఏడు పట్టాల తప్పడం వల్లనే జరిగాయి. ట్రాక్‌ లోపాలు, నిర్వహణ సమస్యలు, ఆపరేటింగ్‌ తప్పిదాల వల్లనే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతమౌతున్నాయని కాగ్‌ నివేదిక వెల్లడించింది. దీనిపై సమీక్షలు లేవు, పరిష్కార మార్గాలు లేవు. దీంతో ఒడిశా దుర్ఘటన తర్వాత వేగవంతమైన రైళ్లను నడపడానికి భారత్‌ సిద్ధంగా ఉన్నదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రైల్వేలో 3.14 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆధునిక విధానాల ద్వారా రైల్వే ప్రమాదాలను పూర్తిగా అరికట్టేందుకు రతన్‌ టాటా నేతృత్వంలో 2015లో ఒక కౌన్సిల్‌ ఏర్పాటైంది. అప్పటికే రైల్వే భద్రత విభాగంలో 1.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీలను భర్తీ చేయాలని కార్మిక సంఘాలు కూడా కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి.

నిత్యం 2.40 కోట్ల మంది ప్రయాణం సాగించే రైల్వేను ఆదాయ కోణంలోనే చూస్తున్నది తప్పా సామాజిక, సంక్షేమ పరంగా చూడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ రైల్వేల ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ దీనికి విరుద్ధంగా కేంద్రం రైల్వేలను ప్రైవేటీకరించడానికే ఉత్సాహం చూపుతూ.. ప్రజల భద్రతను గాలికి వదిలేస్తున్నదని ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు స్పష్టమౌతున్నది.