Narendra Modi | రెండు గంటల పాటు ప్రవాస భారతీయులతో మోదీ
Narendra Modi ప్రఖ్యాత రొనాల్డ్ రీగన్ భవనంలో కార్యక్రమం ఇప్పటికే మొదలైన కోలాహలం విధాత: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికా పర్యటనకు అక్కడి భారత సంతతి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోదీ జూన్ 21 నుంచి 24 వరకు అగ్రరాజ్యంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. 21న ఐక్యరాజ్య సమితి (UNO) ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ఆయన స్వయంగా పాల్గొంటారు. అనంతరం 22న యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ (Jo Biden) […]

Narendra Modi
- ప్రఖ్యాత రొనాల్డ్ రీగన్ భవనంలో కార్యక్రమం
- ఇప్పటికే మొదలైన కోలాహలం
విధాత: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికా పర్యటనకు అక్కడి భారత సంతతి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోదీ జూన్ 21 నుంచి 24 వరకు అగ్రరాజ్యంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. 21న ఐక్యరాజ్య సమితి (UNO) ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ఆయన స్వయంగా పాల్గొంటారు. అనంతరం 22న యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ (Jo Biden) దంపతులు ఇచ్చే విందుకు హాజరవుతారు. అదే రోజు ఆ దేశ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు.
23న ప్రవాస భారతీయులతో మాత్రమే సుమారు 2 గంటల పాటు మోదీ గడపనున్నారు. వాషింగ్టన్ డీసీలో ఉన్న ప్రఖ్యాత రొనాల్డ్ రీగన్ బిల్డింగ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ (యూఎస్ ఐసీఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభ ప్రఖ్యాత ఆఫ్రికన్ అమెరికన్ గాయని మేరీ మిల్‌బెన్ ప్రదర్శనతో ప్రారంభం కానుంది.
దీన్ని ఒక కోలాహల వేడుకలా చేద్దామని నిర్వాహకులు భావించినప్పటకీ మోదీ బిజీ షెడ్యూల్ కారణంగా ఇది ఒక నిరాడంబరమైన చిన్న కార్యక్రమంలా మాత్రమే జరగనుంది.
ఈ కార్యక్రమానికి సమయం కేటాయించడానికే మోదీ తన తిరుగు ప్రయాణాన్ని కొన్ని గంటల పాటు వాయిదా వేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. భారత ప్రధానుల్లో మోదీ అత్యంత ప్రభావవంతమైన వారని, ప్రస్తుతం ఉన్న ప్రపంచ నాయకుల్లో మోదీకి విశిష్ట స్థానం ఉందని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ చైర్మన్ బరాయ్ వెల్లడించారు. అందుకే ప్రతి ప్రవాస భారతీయుడు మోదీ రాక కోసంఎదురుచూస్తున్నారని తెలిపారు. మోదీకి యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం పలికే కార్యక్రమాన్ని చూడటానికి ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రవాసులు రాజధాని వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు.
మోదీ రాకకు మద్దతుగా ర్యాలీలు
ప్రధాని మోదీ అమెరికాలో కాలు పెట్టకముందే అక్కడ హడావిడి మొదలైపోయింది. మోదీ పర్యటనకు మద్దతుగా యూఎస్ లోని 20 ప్రధాన నగరాల్లో ప్రవాస భారతీయులు ర్యాలీలు నిర్వహించారు. మోదీ మోదీ, వందే మాతరం, వందే అమెరికా నినాదాలు ఈ ప్రదర్శనల్లో మారుమోగాయి. కొన్ని చోట్ల హర్ హర్ మోదీ పాటకు నృత్యాలు సైతం చేశారు.
భారత్ (India) అమెరికా (America) ఐక్యతకు గుర్తుగా యూనిటీ డే పేరుతో జరిగిన ఈ ర్యాలీల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు పాల్గొన్నారని వాషింగ్టన్ డీసీకి చెందిన రమేష్ అనం రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీని జో బైడెన్ అధికార పర్యటనకు ఆహ్వానించడం ఎంతో గర్వంగా ఉందని, అందుకే మోదీకి మద్దతుగా ఈ ర్యాలీలు చేస్తున్నామని రాజ్ భన్సాలీ అనే భారతీయుడు వ్యాఖ్యానించారు.