Neuralink : మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే ప్రయోగాలను చేపట్టిన న్యూరాలింక్ (Neuralink) స్టార్టప్ నుంచి బుధవారం కీలక అప్డేట్ వచ్చింది. ఎలక్ట్రానిక్ చిప్‌ను ఎవరికైతే అమర్చారో ఆ వ్యక్తి నోలాండ్ అర్బాగ్ (Noland Arbaugh) ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. పక్షవాతంతో బాధపడుతున్న ఆయనతో వీడియో గేమ్ సివిలైజేషన్ VI, చెస్ లాంటి ఆటలు ఆడించింది. అర్బాగ్ ఆడుతున్న దృశ్యాలను ‘ఎక్స్’లో లైవ్ స్ట్రీమ్ చేసింది.
ఎవరి సాయం లేకుండా అర్బాగ్ గేమ్ ఆడినట్లు న్యూరాలింక్ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను న్యూరాలింక్ సహ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. లైవ్ స్ట్రీమ్ సమయంలో అర్బాగ్ మాట్లాడారు. తన జీవితంలో ఇక చేయలేననుకున్న చాలా పనులు సొంతంగా చేసుకోగలుగుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు. ఈ అధునాతన సాంకేతికతలో ఇంకా మార్పులు రావాల్సి ఉందని తెలిపారు. మరింత మెరుగుపరిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పారు. జీవితంలో తాను గేమ్స్ ఆడతానని ఊహించలేదని, కానీ న్యూరాలింక్ (Neuralink) చిప్ వల్ల అది సాధ్యమైందని అన్నారు. తన జీవితంలో చాలా సానుకూల మార్పులు వచ్చాయని, గంటలకొద్దీ వీడియో గేమ్స్ ఆడగలుగుతున్నానని ఆయన తెలిపారు.
కాగా, ఎనిమిదేళ్ల క్రితం అర్బాగ్ ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెన్నెముక దెబ్బతినటంతో మెడ కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది. కాళ్లు, చేతులు సొంతంగా కదల్చలేని పరిస్థితి. దాంతో తనకిష్టమైన వీడియో గేమ్స్ కూడా ఆడలేకపోయేవాడు. కానీ, చిప్ అమర్చిన తర్వాత గంటల కొద్దీ ఆడగలుగుతున్నారు. ఎవరి సాయం లేకుండా మెదడుతో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతున్నానని తెలిపారు. చిప్‌ను తరచూ ఛార్జ్ చేయాల్సి రావడం ప్రస్తుతానికి ఉన్న ఒక పెద్ద పరిమితి అన్నారు. వైర్లెస్ విధానంలో చిప్‌ను ఛార్జింగ్ చేస్తారు.
మానవ మెదడులో విజయవంతంగా చిప్‌ను అమర్చినట్లు జనవరి చివర్లో న్యూరాలింక్ ప్రకటించింది. కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్- కంప్యూటర్ ఇంటర్ఫేస్ (BCI)’ ప్రయోగాలకు అమెరికాకు చెందిన ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA)’ గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది. న్యూరాలింక్ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని రుజువైనట్లు ఆ సంస్థ నిపుణులు చెప్పారు. ఎలక్ట్రానిక్ చిప్ సాయంతో ‘పాంగ్’ అనే కోతి వీడియో గేమ్ ఆడింది.
చిప్ ఎలా పనిచేస్తుంది..?
న్యూరాలింక్ ‘బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ (BCI)’ లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్1 అనే చిప్ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు అనుసంధానించి ఉంటాయి. ఈ ఎలక్ట్రోడ్ల మందం వెంట్రుకతో పోలిస్తే 20వ వంతు మాత్రమే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్1 చిప్‌ను అమరుస్తారు. ఈ చిప్‌కు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌కు పంపుతాయి. ఒక వ్యక్తి మెదడులోకి గరిష్ఠంగా 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి.