Tesla | టెస్లా కొంప ముంచుతున్న ఎలాన్‌ మస్క్‌ చర్యలు..

ప్రపంచవ్యాప్తంగా టెస్లా వాహనాల అమ్మకాలు పడిపోవడం, షేర్ల పతనం నేపథ్యంలో స్పందించిన మస్క్‌.. ఈ పరిస్థితిని చిన్నపాటి అలజడిగా అభివర్ణించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడుతామని భరోసా ఇచ్చారు.

Tesla | టెస్లా కొంప ముంచుతున్న ఎలాన్‌ మస్క్‌ చర్యలు..

Tesla । మొన్న‌టిదాకా ఒక వెలుగు వెలిగి.. ఇప్పుడు తీవ్ర‌మైన స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్న టెస్లాను కాపాడేందుకు సీఈవో ఎలాన్ మ‌స్క్ వెంట‌నే త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని దాని మ‌ద్ద‌తుదారులు, ఇన్వెస్ట‌ర్లు మొత్తుకుంటున్నారు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గ‌వ‌ర్న‌మెంట్ ఎఫిషియెన్సీ(డీవోజీఈ) లో మ‌స్క్ ప‌ని చేయ‌డం మొద‌లుపెట్టిన ద‌గ్గ‌ర నుంచీ ఆయ‌న చుట్టూ వివాదాలు క‌మ్మ‌కున్నాయి. అదే స‌మ‌యంలో ఆయ‌న బ‌య‌ట చేసే కామెంట్లు త‌దిత‌రాల‌న్నీ క‌లిసి మొత్తంగా టెస్లాకే ఎస‌రు తెచ్చాయి. అప్ప‌టి నుంచి టెస్లా కార్ల డిమాండ్ త‌గ్గిపోయి.. ఆ కంపెనీ స్టాక్ ప్రైస్ దాదాపు 40% త‌గ్గిపోయింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా టెస్లాపై నిర‌స‌న‌లు విధ్వంసాలు పెరిగాయి. దానికితోడు జ‌నవ‌రి నుంచి టెస్లా వాహ‌నాల అమ్మ‌కాలు ప‌దిశాతం త‌గ్గిపోయాయ‌ని డాటా, ట్రెండ్స్‌ను ప‌రిశీలించే కోక్స్ ఆటోమోటివ్ ఇటీవ‌ల పేర్కొన్న‌ది.

‘ఇది టెస్లాకు, మ‌స్క్‌కు ప‌రీక్షాకాలం. ఆయ‌న ఈ ప‌రిణామాల ప‌ట్ల త‌దుప‌రి కొద్ది నెల‌ల్లో ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేదానిపై భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంటుంది’ అని ప్రముఖ టెస్లా ఎనలిస్ట్ డాన్ ఇవేస్ చెప్పారు. డీవోజీఈ, టెస్లా నాయకత్వ బాధ్యతల మధ్య మెరుగైన విధంగా వర్క్‌బ్యాలెన్స్ చేసుకుంటానంటూ ఒక స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మస్క్‌పైనే ఉందని ఆయన అన్నారు. మస్క్ సోషల్ మీడియా పోస్టులు, వాటిలో అతివాద కామెంట్లు, కుట్ర సిద్ధాంతాలు, తప్పుడు సమాచారాలు, డీవోజీఈలో డొలాల్డ్ ట్రంప్ కింద పనిచేయడం ఇవన్నీ టెస్లా ప్రతిష్ఠను దెబ్బతీశాయని ప్రముఖ టెస్లా ఇన్వెస్టర్‌, బూస్టర్ రోస్ గర్బర్ బ్రిటిష్ టీవీ చానల్ స్కై న్యూస్‌కు చెప్పారు. టెస్లాను మస్క్ నిర్వహించడం లేదని ఆయన అన్నారు. డీవోజీఈని వదిలేయడం లేదా టెస్లాకు కొత్త సీఈవోను నియమించడం ఈ రెండింటిలో ఒక దాన్ని మస్క్‌ ఎంచుకోవాలని ఆయన తేల్చి చెప్పారు.

సాధారణ షేర్‌ హోల్డర్ల సంగతి పక్కన పెడితే.. టెస్లా టాప్‌ ఎగ్జిక్యూటివ్స్‌, బోర్డు మెంబర్లలో కొందరు సైతం తమ షేర్లను భారీగా అమ్మేయడం గమనార్హం. వారిలో జేమ్స్‌ మర్డోక్‌ (రుపర్ట్‌ మర్డోక్‌ కుమారుడు, బోర్డు సభ్యుడు మార్చి 10వ తేదీన 13 మిలియన్‌ డాలర్ల షేర్లను అమ్మేశారు. గడిచిన ఐదేళ్లలో వరస్ట్‌ సింగిల్‌ డే పతనం నేపథ్యంలో ఈయన ఈ చర్య తీసుకున్నారు. రోబ్యన్‌ డెన్‌హామ్‌ (చైర్‌) దాదాపు 75 మిలియన్‌ డాలర్ల షేర్లను గత ఐదువారాల వ్యవధిలో విక్రయించేశారు. ఆఖరుకు మస్క్‌ సోదరుడు, బోర్డు సభ్యుడు కూడా అయిన కింబల్‌ మస్క్‌.. 27 మిలియన్‌ డాలర్ల విలువ చేసే 75వేల షేర్లను విక్రయించారు. సీఎఫ్‌వో వైభవ్‌ తనేజా కూడా ఇదే బాటలో నడిచారు. ఇటీవలి వారాల్లో 5 మిలియన్‌ డాలర్ల షేర్లను అమ్మేశారు. అయితే.. వీటిని స్మార్ట్‌ పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్‌గా కొందరు అభివర్ణిస్తుంటే.. ఇంకొందరు మాత్రం టెస్లా భవిష్యత్తు గురించి నెలకొన్న ఆందోళనలకు ఈ అమ్మకాలు అద్దం పడుతున్నాయని తేల్చేస్తున్నారు.

చిన్న అలజడేనంటున్న మస్క్‌
ప్రపంచవ్యాప్తంగా టెస్లా వాహనాల అమ్మకాలు పడిపోవడం, షేర్ల పతనం నేపథ్యంలో స్పందించిన మస్క్‌.. ఈ పరిస్థితిని చిన్నపాటి అలజడిగా అభివర్ణించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడుతామని భరోసా ఇచ్చారు. ‘మీరు వార్తలను కనుక చదివినట్టయితే.. దేవుడికి, దయ్యాలకు మధ్య జరిగే యుద్ధంలా అనిపిస్తుంది’ అని గురువారం రాత్రి ఎక్స్‌లో బ్రాడ్‌కాస్ట్‌ చేసిన ఆల్‌ హ్యాండ్స్‌ మీటింగ్‌లో వ్యాఖ్యానించారు. ఏ టీవీలో చూసినా టెస్లా కార్లు తగలబెడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయంటూ తన వ్యతిరేకులనుద్దేశించి చమత్కరించారు. ‘మీరు మా ఉత్పత్తులను కొనుగోలు చేయకపోతే నేను అర్థం చేసుకోగలను. కానీ.. వాటిని తగలబెట్టాల్సిన అవసరం లేదు. ఇది సమంజసంగా లేదు’ అని మస్క్‌ అన్నారు.