USA Imperialism | వెనెజువెలాపై అమెరికా టెర్రరిస్టు దాడి – కారణాలు, పర్యవసానాలు.. ఇఫ్టు ప్రసాద్‌ విశ్లేషణ

స్థూలంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సంక్షోభ స్థితి నుండి తీవ్ర సంక్షోభ స్థితి వైపు నడుస్తోంది. అది క్రమంగా 1929 నాటి మహా మాంద్యం వైపు కూడా అడుగులు వేస్తోంది. ఈ సంక్షోభ పరిస్థితి ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాలను దిగజార్చుతోంది. ఇది ఒకవైపు తీవ్ర అతివాద, తీవ్రవాద విప్లవోద్యమాల నిర్మాణానికీ; మరోవైపు తీవ్ర మితవాద, ప్రతీఘాత, ఫాసిస్టు శక్తులకూ బలాన్నిస్తోంది. ఈ పరిస్థితి ప్రపంచాన్ని సాధారణ స్థితిలో వుంచనివ్వదు. తీవ్ర చలనాలను సృష్టిస్తుంది.

  • By: TAAZ |    opinion |    Published on : Jan 19, 2026 8:48 PM IST
USA Imperialism | వెనెజువెలాపై అమెరికా టెర్రరిస్టు దాడి – కారణాలు, పర్యవసానాలు.. ఇఫ్టు ప్రసాద్‌ విశ్లేషణ

(పీ ప్రసాద్‌, ఇఫ్టు)
USA Imperialism | కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ రెండవ మహాసభలు 1920 జూలై 19 నుండి ఆగస్టు 7 వరకు జరిగాయి. మొదటి రోజు 19-7-1920 తేదీన అంతర్జాతీయ పరిస్థితి పైనా, కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ (కొమింటర్న్) మౌలిక కర్తవ్యాల పైనా లెనిన్ నివేదికను ప్రవేశపెట్టాడు. అందులో తొలి విభాగం అంతర్జాతీయ పరిస్థితిపై క్రింది ప్రారంభ వాక్యంతో లెనిన్ మొదలు పెట్టాడు. ‘సామ్రాజ్యవాద ఆర్థిక సంబంధాలు మొత్తం అంతర్జాతీయ పరిస్థితికి మూలాధారం.’

పై ఒకే ఒక వాక్యం ద్వారా అంతర్జాతీయ పరిస్థితులను శాసించేది ఆర్థిక రంగమని మనకు అర్ధమవుతుంది. పైన పేర్కొన్న రెండో మహాసభ మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక రెండేండ్ల తర్వాత జరగడం గమనార్హం! యుద్ధకాల అంతర్జాతీయ పరిస్థితి మీద ప్రవేశపెట్టిన నివేదిక గూర్చి లెనిన్ మాట్లాడింది కాదు. అందుకు భిన్నంగా యుద్ధానంతర ప్రపంచ పరిస్థితిపై మాట్లాడటం గమనార్హం! ఇంకా చెప్పాలంటే యుద్ధానంతర పారిస్ శాంతి సంధి, వర్సెయిల్స్ ఒప్పందం జరిగి “ప్రపంచ శాంతి” ఏర్పడినట్లు చెప్పుకొన్న కాలంలో కొమింటర్న్ రెండవ మహాసభ జరగడం గమనార్హం!

వెనెజువెలా పై 3–1–2026న అమెరికా ఉగ్రవాద దాడికి దిగింది. అది కూడా మున్నెన్నడూ పాల్పడనంత తెంపరితనంతో దిగింది. వెనిజువెలా దేశాధ్యక్షుడ్ని బంధించి అమెరికా తీసుకెళ్ళి తమదైన శైలిలో ముద్దాయిని చేసి విచారణకు దిగింది. ఈ టెర్రరిజం వెనుక సామ్రాజ్యవాద ఆర్థిక లక్ష్యాలు దాగి వున్నాయి. మదురోని నిర్బంధించడం వెనుకా, ఆయన్ని విచారించడం వెనుకా సామ్రాజ్యవాద ఆర్థిక అవసరాలున్నాయి. ఈ ఉగ్రవాద రాజకీయ పరిణామాల వెనుక ఉగ్రవాద ఆర్థిక విధానాలున్నాయి. ఈ ఉగ్రవాద రాజకీయ పరిణామాలు ఒకవేళ మున్ముందు యుద్ధానికి కూడా దారితీయవచ్చు. ఆ యుద్ధానికి కూడా సామ్రాజ్యవాద ఆర్ధిక పరిస్థితులే మూలాధారంగా వుంటాయి. ఇదే లెనిన్ సూక్తి వెనుక దాగిన సారాంశం.

సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధాలని లెనిన్ అంటాడు. ఆ ప్రకారం సామ్రాజ్యవాద యుగం అంటే యుద్ధాల యుగం అవుతుంది. యుద్ధమంటే రక్తపాతంతో కూడిందే కాదు, రక్త రహితంగా కూడా సాగుతుంది. వాణిజ్య యుద్ధాలను ఆర్ధిక యుద్ధాలంటారు. ఆర్ధిక యుద్ధాలలో రక్తపాతం వుండదు. అవి “శాంతియుత” రూపంలో సాగుతాయి. కానీ, నిజమైన శాంతికి అవకాశం వుండదు. నిరంతర పోటీ వల్ల ఆర్థిక యుద్ధాలు అనివార్యంగా రాజకీయ యుద్ధాలకు దారితీస్తుంటాయి. ఫలితంగా రాజకీయ ఆంక్షలు, నియంత్రణలు, ఒత్తిళ్ళు, దిగ్బంధనాలు వంటి చర్యలకు దారితీస్తాయి. అప్పటికీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోలేనప్పుడు, రక్తపాతంతో కూడిన సైనిక యుద్ధాలకు దిగడం జరుగుతుంది. అమెరికా ఆర్థిక పరిస్థితి వెనిజువెలా వంటి దేశాలను పరాధీనం చేసుకోవాల్సిన ఆవశ్యకతను సృష్టిస్తుంది. మొదటి దశలో శాంతియుతంగా పరాధీనం చేసుకోవడానికి అమెరికా ప్రయత్నించింది. రెండవ దశలో రాజకీయ ఒత్తిళ్ళ ద్వారా లొంగదీసుకునే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో చివరకు సైనిక చర్యతో తన లక్ష్యాన్ని నెరవేర్చుకోజూసింది. ఈ మూడు దశల్లో “యుద్ధం” సాధారణ లక్షణంగానే వుంటుంది. అయితే, ఆర్ధిక యుద్ధం, రాజకీయ యుద్ధం, సైనిక యుద్ధం అనే వేర్వేరు రూపాలలో వివిధ దశలలో కొనసాగుతుంది. ఈ మూడింటిలో ఏ ఒక్క రకం యుద్ధం లేని కాలం అంటూ వుండదు. అదే సామ్రాజ్యవాద యుగ లక్షణం. అందుకే లెనిన్ చెప్పినట్లు సామ్రాజ్యవాద యుగం అంటే యుద్ధాల యుగం అవుతుంది.

పాతికేళ్ళ క్రితం వెనెజువెలా దేశ ప్రజలు తమ అధ్యక్షునిగా చావెజ్‌ను ఎన్నుకున్నారు. చమురు వనరులను చావెజ్ ప్రభుత్వం జాతీయం చేసింది. ఆ రోజు నుంచే రెండు దేశాల మధ్య పోటీ తీవ్రమైంది. చావెజ్ సర్కారును కూల్చివేయడానికి అమెరికా కుట్ర పన్నింది. దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చి చావెజ్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చి నిలబెట్టుకున్నారు. అది సారాంశంలో వెనిజువెలా ప్రజలకూ, అమెరికన్ సామ్రాజ్యవాదానికీ మధ్య పోటీగా మారింది. అది దశల వారీగా రూపాలు మార్చుకుంటూ చివరకు సైనిక రూపం తీసుకున్నది. చమురు నిల్వలను కబ్జా చేయడం కోసం వాటికి సంరక్షక పాత్ర (గార్డు) పోషిస్తున్న ప్రభుత్వాధినేతనే కిడ్నాపు చేయాల్సిన రూపం తీసుకున్నది. తాజా సైనిక దురాక్రమణ పూరిత దాడికి కూడా మూలాధారంగా సామ్రాజ్యవాద ఆర్థిక విధానమే వుండడం గమనార్హం! లెనిన్ చెప్పిన మాట సారం దీనికి కూడా వర్తిస్తుంది.

పైన పేర్కొన్న యుద్ధాలలో పరాకాష్ట దశకు చేరిందే రక్తపాత యుద్ధం! అది ఆ దశకు చేరుకోవాలంటే, దానికంటే ముందుగా విధిగా రక్తరహిత యుద్ధదశ కొనసాగి తీరాలి. దీనర్థం ఆర్ధిక యుద్ధ దశ (వాణిజ్య యుద్ధ) కొనసాగే క్రమంలో రాజకీయ యుద్ధదశకూ, తర్వాత సైనిక యుద్ధదశకూ అనివార్యంగా వివిధ రూపాలు తీసుకుంటుంది. పూర్తి స్థాయి సైనిక యుద్ధదశ రూపం తీసుకోక ముందు అది రక్త రహిత రూపాలకే పరిమితం అవుతుందని అనుకోరాదు. స్థూలంగా రక్తరహిత యుద్ధదశలో కూడా సూక్ష్మస్థాయి రక్తసిక్త సంఘటనలు సంభవిస్తూ వుంటాయి. ఆ కోవలోకి వచ్చేవే వెనిజువెలా దేశాధ్యక్షుడి కిడ్నాపు ఘటన! 1923 లో వాణిజ్య సంధులపై చర్చలలో సోవియట్ ప్రతినిధి వర్గానికి కార్య నిర్వాహక కార్యదర్శిగా వొరోవ్స్కి పాల్గొన్నారు. ఆ చర్చలు జరిగిన లాసేన్ (స్విట్జర్లాండ్) లో ఆయన్ని ఒక కిరాయి హంతకుడితో బ్రిటీష్ సామ్రాజ్యవాదులు హత్య చేయించారు. ఆ హత్య 10–5–1923 తేదీన జరిగింది. నేటికి 102 ఏండ్లు దాటింది. అది కూడా రక్తరహిత యుద్ధదశలో జరిగిన రక్తసిక్త సంఘటనే! వెనిజువెలా దేశాధ్యక్షుణ్ణి కారకస్ నుంచి ఎత్తుకొని వెళ్ళిన రక్తసిక్త సైనిక ఘటన కూడా అలాంటి సంఘటనల కోవలోకే వస్తుంది.

1918 లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ తర్వాత 21 ఏండ్లకి 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది. 1919 నుంచి 1938 వరకూ ఇరవై ఏండ్లు ప్రపంచాన్ని సామ్రాజ్యవాదులు శాంతియుతంగా వుంచలేదు. ఆ కాలంలో కూడా సైనిక చర్యలు, సైనిక దురాక్రమణలు జరిగాయి. అయితే, అవి ప్రపంచ యుద్ధ రూపం తీసుకోలేదు. అందుకే స్థూలంగా రక్తసిక్త యుద్ధ రూపం తీసుకోకముందే, సూక్ష్మస్థాయి రక్తసిక్త చర్యలు సంభవిస్తాయి. అదేవిధంగా స్థూలంగా ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ప్రాంతీయ సైనిక యుద్ధాలు సంభవిస్తూ వుంటాయి. వెనిజువెలా దేశాధ్యక్షుడి కిడ్నాప్ సంఘటన కూడా ప్రపంచ యుద్ధ దిశలో ఓ ఘటన!

మొదటి ప్రపంచ యుద్ధం ఒక సామ్రాజ్యవాద సైనిక కూటిమి పై మరో సామ్రాజ్యవాద సైనిక కూటమి నిర్ణయాత్మక విజయాన్ని సాధించింది. యుద్ధానంతరం జరిగిన పారిస్ సంధి ‘వాడు గెలిచాడు; వీడు గెలిచాడు’ అనే కోవలోకి రాదు. (అలా సమవుజ్జీల మధ్య జరిగే శాంతి ఒడంబడికలను సాధారణంగా ‘విన్-విన్ ఒప్పందాలు’ అంటారు) తద్భిన్నంగా విజేతల న్యాయ (విక్టర్స్ జస్టిస్) సూత్రాల ప్రకారం జరిగిన ఒప్పందమిది. అందుకే చరిత్రలో ‘వర్సెయిల్స్ సంధి’ విజేతల ఒప్పందం (విక్టర్స్ అగ్రి మెంటు) గా పేరొందింది. ఆ తర్వాత కొద్దికాలం గడవక ముందే సైనిక చర్యల రూపం తీసుకున్నది. అంటే, శాంతియుత (రక్తరహిత) దశలో కూడా రక్తసిక్త సంఘటనలు సంభవిస్తూ ఉంటాయనడానికి వొరొవ్స్కి హత్యా ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కాలేదు. కనీసం ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిమియా తరహాలో వెనిజువెలా సైనిక దురా క్రమణకు గురికాలేదు. అంటే ప్రాంతీయ సైనిక యుద్ధం కూడా ప్రారంభం కాలేదు. అయినా ఆ దేశ అధ్యక్షుడ్ని ఆ దేశ రాజధాని నుంచి సైనిక చర్యతో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళడం జరిగింది. ఈ సైనిక చర్య రక్తరహిత యుద్ధాన్ని రేపు రక్తపాత యుద్ధంగా పరివర్తన చెందించే దిశలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.

మొదటి ప్రపంచ యుద్ధంలో గెలిచిన విజేత రాజ్యాలు (విక్టర్ పవర్స్) ప్రపంచ ఆర్ధిక వనరుల పంపిణీ కోసం వాణిజ్య యుద్ధాలకు పరస్పరం తలపడ్డాయి. ఆ సందర్భంగా అట్టి ఆర్థిక యుద్ధాలలో భాగంగా స్విట్జర్లాండ్ల లోని లాసాన్ లో 1922 నవంబర్ 20న విజేత రాజ్యాల ప్రతినిధి వర్గాలు సమావేశమైనవి. దానినే లాసాన్ కాన్ఫరెన్స్ అంటారు. దానికి సోవియట్ రష్యా ప్రతినిధి వర్గాన్ని రాకుండా బ్రిటన్ అడ్డుకోజూసింది. కానీ, అది సమీప ప్రాచ్య దేశాల కోసం ఏర్పాటు చేయడం వల్లా, దాని సంబంధిత దేశాల ఒత్తిళ్ళు, విజ్ఞప్తుల ఫలితంగా, ముఖ్యంగా దానికి హాజరై తీరాలని లెనిన్ చొరవతో ఆనాటి సోవియట్ రష్యా సర్కార్ వ్యూహాత్మక దౌత్య కృషి ఫలితంగా బ్రిటన్ దాన్ని అడ్డుకోలేకపోయింది. దానికి హాజరైన సోవియట్ ప్రతినిధివర్గం సమర్పించిన పత్రంలో పర్షియన్ సింధు శాఖను తన స్వంత సరస్సుగా బ్రిటన్ మార్చుకోబోతున్న విషయాన్ని బహిర్గతం చేసింది. ఆ శాంతియుత చర్చల వెనుక రక్తసిక్త కుట్రలున్న వాస్తవాన్ని వెల్లడించింది. ఆ నేపథ్యంలో ఆ చర్చల ప్రక్రియ కొనసాగింపు క్రమం సోవియట్ దౌత్యవేత్త హత్యకు దారి తీయించడం గమనార్హం! ఆనాటి సోవియట్ రష్యా ప్రపంచ సోషలిస్టు విప్లవ కేంద్రంగా వుండేది. అది ఈనాడు లేదు. కానీ, సామ్రాజ్యవాద ఆర్థిక విధానాలు మాత్రం వున్నాయి. అవి వాటి పనిని చేసుకుంటూ పోతాయి. అవి కుహానా శాంతి కాలంలో కూడా వాస్తవిక సైనిక చర్యలను సృష్టిస్తూనే వుంటాయి. అలాంటి వాటిలో మదురో కిడ్నాప్ ఒకటి!

మదురో కిడ్నాప్ ఘటనకు మాదక ద్రవ్యాల వాణిజ్యం కారణం కాదు. లెనిన్ అన్నట్లు సామ్రాజ్యవాద ఆర్ధిక సంబంధాలు లేదా ఆర్ధిక వ్యవహారాలే మూలాధారంగా వుంటాయి. లెనిన్ చెప్పిన దృక్కోణం నుంచి శాస్త్రీయ పరిశీలన మరియు విశ్లేషణలు చేయగలిగితే మదురోను నిర్బంధించడానికి మూలకారణాలు అర్ధమవుతాయి. అంతే తప్ప, మదురోకూ, ట్రంప్ కూ మధ్య వివాదంగా చూసే వ్యవహారం కాదు. అదేవిదంగా మదురో సర్కారు, ట్రంప్ సర్కారు మధ్య వివాదంగా కూడా చూడరాదు. పైగా ఇదేదో ట్రంప్ దూకుడు వైఖరి వల్ల జరిగిన సంఘటనగా కూడా చూడరాదు. ట్రంప్ ఉన్మాద వైఖరి గూర్చి ఎక్కువ స్థాయిలో మాట్లాడుకోవడమంటే దానికి మూలకారణమైన అమెరికా సామ్రాజ్యవాద ఉగ్రవాద ఆర్థిక విధానాల తీవ్రతని తగ్గించడం లేదా మరుగుపరచడమే అవుతుంది. లెనిన్ చెప్పిన వెలుగులో పరిశీలిస్తే కిడ్నాప్ దుష్టచర్యకు కూడా సామ్రాజ్యవాద ఆర్థిక విధానమే కారణమని అర్థమవుతోంది.

1898లో ఫిలిప్పీన్స్ కేంద్రంగా అమెరికా స్పెయిన్ మధ్య యుద్ధం జరిగింది. అంతవరకూ అమెరికా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల వరకే పరిమితమైంది. ఆ అమెరికా-స్పానిష్ యుద్ధం (1898) ద్వారా సామ్రాజ్యవాద యుగం ప్రారంభమైందని లెనిన్ చెప్పాడు. లెనిన్ కంటే ముందే సామ్రాజ్యవాదం గూర్చి రచనలు చేసిన ఆర్ధికవేత్తల వ్యాఖ్యల ఆధారంగా లెనిన్ ధృవీకరించాడు. దీనిని బట్టి సామ్రాజ్యవాద యుగంగా పరివర్తన చెందే తొలిదశ నాటికే అమెరికా సామ్రాజ్యవాద దేశంగా రూపొందిందని అర్ధమవుతుంది. నిజానికి ఆర్ధిక, రాజకీయ, సైనిక రంగాల్లో అమెరికా కంటే ఆనాటికి బ్రిటన్, ఫ్రాన్స్ చాలా ముందున్నాయి. కానీ నాటికి అమెరికా కూడా ఒక ఎదుగుతున్న సామ్రాజ్యవాద ఆర్ధిక రాజ్య వ్యవస్థే! అయితే బ్రిటన్, ఫ్రాన్స్ ప్రపంచ యుద్ధంలో, యూరప్ ఖండంలోని ప్రాంతీయ యుద్ధాల్లో లోతుగా కూరుకుపోయాయి. ఆ పరిస్థితి నాటి అమెరికాకి లేదు. ఆ స్థితే బ్రిటన్, ఫ్రాన్స్ కంటే కాలక్రమంలో తన సామ్రాజ్యవాద ఆర్థిక వ్యవస్థను సాపేక్షికంగా స్థిరపరుచునే అవకాశం అమెరికాకి లభించింది. అలా స్థిరపడ్డ అమెరికా సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్థే, సైనికంగా దాన్ని బలోపేతం చేసింది. ఆ సైనిక సామ్రాజ్యవాద రాజ్యం నేడు యుద్ధాల ఊబిలో దిగబడి ఆర్ధికంగా పతన దిశలోకి దిగజారింది. ఫలితంగా, నేడు సామ్రాజ్యవాద రాజ్యాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాలను సైతం కాలరాసే వైపుకు అనివార్యంగా అమెరికాని నెడుతున్నది. ఆ నేపథ్య వెలుగులో మదురో కిడ్నాప్ సంఘటనను చూడాలి.

యూరోపియన్ సంపన్న రాజ్యాలకు అమెరికా సహా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు 16, 17, 18 శతాబ్దాలలో వలసలుగా మారాయి. ఆ వలస వాద పాలనకు వ్యతిరేకంగా తొలి నిర్ణయాత్మక యుద్ధం చేసిన నేపథ్యం ఈనాటి అమెరికా (యు.ఎస్.ఏ) దేశానికి వుంది. 1776లో బ్రిటన్ మీద అమెరికా స్వాతంత్ర్య పోరాటం విజయం సాధించింది. అది మిగిలిన అమెరికా ఖండదేశాల ప్రజలతో పాటు ఫ్రాన్స్ ప్రజలకు స్ఫూర్తిని అందించింది. ఆ విప్లవ స్ఫూర్తితో వేగంగా మార్పులు జరిగి 1789 లో ఫ్రెంచి పారిశ్రామిక విప్లవం జయప్రదమైనది. నెమ్మదిగా పరివర్తనకు దారితీసి దక్షిణ అమెరికా ఖండంలో సైమన్ బొలీవర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన విప్లవ రూపం తీసుకున్నది. అది చరిత్రలో బొలీవియన్ విప్లవంగా పేరొందింది. ఉత్తర అమెరికా ఖండంలోని ఈనాటి యు.ఎస్.ఏ దేశం బ్రిటన్ వలసవాదం నుంచి స్వాతంత్ర్యం పొందినట్లే, బొలీవియన్ విప్లవం ద్వారా దక్షిణ అమెరికా ఖండానికి చెందిన వెనిజువెలా, బొలీవియా, బ్రెజిల్, కొలంబియా, పెరూ, ఈక్విడార్, పనామా వంటి దేశాలు స్పెయిన్ వలసపాలన నుంచి స్వాతంత్ర్యం పొందాయి. అదే బాటలో పోర్చుగల్ వలసపాలన నుంచి బ్రెజిల్ కూడా స్వాతంత్ర్యం పొందింది. సైమన్ బొలీవర్ నిజానికి వెనిజువెలా సైన్యాధికారే అయినప్పటికీ, ఆయన స్వాతంత్ర పతాకాన్ని చేబూని మొత్తం లాటిన్ అమెరికా ఖండ విప్లవ నేతగా రూపొందడం గమనార్హం! ఆయన సారధ్యంలో 1820 కి ముందే స్వాతంత్య్రాలు సాధించాయి. ఆ విధంగా స్వాతంత్య్రం పొందిన లాటినమెరికా దేశాల పై ఆధిపత్యం చెలాయించే లక్ష్యంతో అంతకంటే నాలుగైదు దశాబ్దాల ముందే స్వాతంత్య్రం పొందిన అమెరికా పథకం వేసింది. ఆ పధకంలో భాగంగా మన్రో సిద్ధాంతం ముందుకొచ్చింది. అదే చరిత్రలో అమెరికా విస్తరణవాదానికి తొలి పునాదిని వేయించింది.

1776లో బ్రిటీష్ వలసవాదం పై పోరాడి స్వాతంత్య్రం పొందిన అమెరికా ఆర్థిక వ్యవస్థని సుస్థిర పరుచుకునే విధానాలను మొదట రూపొందించాల్సి వచ్చింది. వాటికి తొలి కాలపు అమెరికా దేశాధ్యక్షులైన జార్జి వాషింగ్టన్, థామస్ జఫర్సన్ వంటి వారు రూపకర్తలుగా మరియు అమలుదార్లుగా అమెరికా చరిత్రలో పేరొందారు. తద్వారా నాలుగైదు దశాబ్దాలలో ఆర్ధిక, రాజకీయ రంగాల్లో అది నిలద్రొక్కుకున్నది. ఆ తర్వాత మాత్రమే అది విస్తరణవాద రాజ్యంగా పరివర్తన చెందింది. ఆ నూతన విధానాలకు అమెరికా అధ్యక్షులు జేమ్స్ మన్రో ప్రతినిధిగా, ప్రతీకగా పేరొందాడు. మన్రో రెండవసారి 1820 లో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. తర్వాత అమెరికా పార్లమెంటు (కాంగ్రెసు) లో ఆయన 2-12-1823 తేదీన ఒక ప్రకటన చేశాడు. అదే మన్రో సిద్ధాంతం (మన్రో డాక్టిన్)గా చరిత్రలో పేరొందింది. ఈనాటి ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను భౌగోళికంగా పశ్చిమార్ధ భూగోళం (వెస్టర్న్ హెమీస్పియర్) అంటారు. ఆ పశ్చిమార్ధ భూగోళ వ్యవహారాల్లో యూరప్ రాజ్యాలు జోక్యం చేసుకోరాదనేది ఆ సిద్ధాంత సారాంశం. ఆ ప్రకారం పశ్చిమార్ధ భూగోళాన్ని తన (యు.ఎస్.ఏ) ప్రభావిత ప్రాంతం అవుతుంది. అది తదనంతర కాలంలో ఆ ప్రాంతాన్ని తన పెరటి దొడ్డిగా భావించడానికి దారితీయడం గమనార్హం!

దక్షిణ అమెరికా ఖండ దేశాల ప్రజలు నిజానికి అమెరికా స్వాతంత్య్ర పోరాట విప్లవ స్ఫూర్తితో నాలుగైదు దశాబ్దాలలో స్వాతంత్ర్యం పొందారు. వాటికంటే ముందుగా స్వాతంత్ర్యం పొందిన అమెరికా నిజానికి వాటికి స్ఫూర్తిదాత అనుటలో సందేహం లేదు. వాటి పురోగమనానికి అది పోషించిన టార్చిలైటు పాత్ర ఆహ్వానించ దగినదే. యూరప్ రాజ్యాలు ఒకవేళ వాటిని పునరాక్రమణకు దిగితే, ఆ దేశాల ప్రజల స్వాతంత్య్ర పరిరక్షణ పోరాటాలకు అండగా నిలిస్తే ఆదర్శంగా వుంటుంది. కానీ, యూరప్ రాజ్యాల జోక్యం నుంచి వాటి పరిరక్షణకు వకాల్తా తీసుకోవడం తీవ్ర అభ్యంతరకరం. ఆ ప్రాంతం తన ప్రభావిత ప్రాంతంగా భావించడం ముమ్మాటికీ విస్తరణ వాదం అవుతుంది. 202 ఏండ్ల క్రితం రూపొందిన మన్రో సిద్ధాంతం అమెరికా చరిత్ర గమనాన్ని విస్తరణ వాదం వైపు మలుపు త్రప్పింది.
అమెరికా స్వాతంత్య్ర సాధనకు జార్జి వాషింగ్టన్ పాత్ర; అదో విస్తరణవాద దేశంగా రూపొందించే విధానాలకు జేమ్స్ మన్రో పాత్ర; దానిని 1929 నాటి మహా మాంద్యం నుంచి కీన్స్ సంక్షేమ ఆర్ధిక విధానాలతో కాపాడి అగ్ర రాజ్యంగా రూపొందించడంలో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ పాత్ర; దానిని మార్షల్ పధకం, నాటో కూటమి ద్వారా యూరప్ సామ్రాజ్వవాద రాజ్యాల నియంత్రణ శక్తిగా రూపొందించడంలో హారీ ట్రూమన్ పాత్ర; ఉదారవాద ఆర్ధిక విధానాల ద్వారా ప్రపంచ ప్రబలశక్తిగా అమెరికాను తీర్చిదిద్దే ప్రక్రియకు రోనాల్డ్ రీగన్ పాత్ర; ఏకధృవ అగ్రరాజ్యంగా రూపొందించడంలో సీనియర్ జార్జి బుష్ పాత్ర, ఇలా ఒక్కొక్క దశలో ఒక్కొక్క మలుపు త్రిప్పిన నేపథ్యం వుంది. ప్రస్తుతం ట్రంప్ సర్కారు కూడా ఒక మలుపు తీసుకుంటున్నది. కానీ, గత మలుపులకు విరుద్ధ దారిలో ట్రంప్ సర్కారు కూడా ఓ మైలురాయిగా నిలుస్తుంది. అది స్థల, కాలాలను బట్టి చారిత్రక జోస్యం చెప్పగలిగేది.

ట్రంప్ సర్కారు ప్రకటిత లక్ష్యం అమెరికా పూర్వ వైభవాన్ని తిరిగి సాధించడం. దాన్ని తిరిగి మహా సామ్రాజ్యంగా రూపొందించాలనే లక్ష్య ప్రకటన చేసింది. దానినే ‘మాగా’ వుద్యమం అని అంటారు. దానికి ముందు దశగా 200 ఏండ్ల క్రితం మన్రో సిద్దాంతాన్ని తన భుజస్కందాల మీద వేసుకున్నది. ఉక్రెయిన్, గాజా పరిణామాలు బెడిసికొట్టాయి. వాటి కంటే ముఖ్యంగా ఇరాన్ అణు స్థావరాలపై ట్రంప్ సర్కారు చేసిన దాడి బెడిసికొట్టింది. స్తూలంగా అట్లాంటిక్ సముద్రానికి తూర్పు అర్ధగోళంలో ట్రంప్ సర్కారు సైనిక, రాజకీయ వ్యూహాలు బెడిసి కొట్టాయి. అందుకే ట్రంప్ సర్కారుకు మన్రో సిద్ధాంతం తక్షణ మార్గదర్శకంగా మారింది. అట్లాంటిక్ సముద్రానికి తూర్పు భూగోళం కంటే, పడమరనున్న పశ్చిమార్ధ భూగోళం మీద తొలుత సంపూర్ణ ఆధిపత్యం పొందాల్సి వుందని ట్రంప్ సర్కారు గుర్తించింది. గత మన్రో సర్కారు నేటి ట్రంప్ సర్కారుకు దారిదీపంగా మారింది. దాని అమలు వెనిజువెలాతో ప్రారంభించడం గమనార్హం! అందుకే వర్తమాన అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు దీనిని డాన్రో సిద్ధాంతంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మన్రో సారాయిని ట్రంప్ సీసాలోకి మార్చినట్లు వ్యంగ్య రూపంలో దీనికి నామకరణం చేశారు. మన్రో పేరిట ప్రాచుర్యం పొందిన మన్రో సిద్ధాంతాన్ని డాన్రో సిద్ధాంతంగా పిలుస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ లోని మొదటి అక్షరమైన ‘డి’ ని మన్రో లోని మొదటి అక్షరమైన ‘యం’ స్థానంలో చేర్చి ‘డాన్రో’ సిద్ధాంతంగా పిలవడం గమనార్హం!

మన్రో సిద్ధాంతం తొలుత అమెరికాను విస్తరణవాద రాజ్యంగా రూపొందించింది. దాని ఫలితంగా, అది తర్వాత సామ్రాజ్యవాద దేశంగా, తర్వాత అగ్రరాజ్యంగా, ఆ పిమ్మట అదో ఏకధృవ అగ్రరాజ్యంగా దశలవారీ రూపొందించడానికి తొలి ముందుడుగుగా పని చేసింది. కానీ, తాజా డాన్రో సిద్ధాంతం అమెరికా అగ్రరాజ్య స్థానాన్ని కాపాడలేదు. పైగా పతన దిశలో మైలురాయిగా మార్చే అవకాశం వుంది. అందుకు కారణం వుంది. మన్రో సిద్ధాంత కాలానికీ, డాన్రో సిద్ధాంత కాలానికీ మధ్య ప్రాపంచిక భౌతిక పరిస్థితులలో తేడాయే అందుకు కారణం.

ప్రాచీన యుగంలో రోమ్ సామ్రాజ్య పతన పరిణామాన్ని చూశాం. ఆధునిక యుగారంభ కాలాలలో స్పెయిన్, పోర్చుగల్ అగ్రరాజ్యాల పతన పరిణామాలను చూశాం. పారిశ్రామిక విప్లవం జరిగిన తర్వాత కొత్తగా అగ్రరాజ్యాలుగా బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అవతరించాయి. అవి సామ్రాజ్యవాద యుగం లోనూ అగ్ర రాజ్యాలుగా కొనసాగాయి. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అవి కూడా తమ అగ్రరాజ్య స్థానాలను కోల్పోయాయి. ఏ అగ్ర రాజ్యమూ శాశ్వతం కాదని చరిత్ర రుజువు చేసింది. ‘పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశే సామ్రాజ్యవాదం’ అనే గ్రంథంలో లెనిన్ విశ్లేషించినట్లు సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానం యొక్క అవసానదశ మాత్రమే. అట్టి అవసాన వ్యవస్థకు ప్రాతినిధ్యం వహంచే అగ్రరాజ్యాల స్థానం కూడా అంతమై తీరాల్సిందే. రోమ్ నుంచి స్పెయిన్, పోర్చుగల్ ద్వారా బ్రిటన్, ఫ్రాన్స్ వరకూ తమ పూర్వ వైభవాలను కోల్పోయిన దారిలో నేటి అమెరికా ప్రయాణం సాగుతున్నది. ఇది అమెరికా పతనోన్ముఖ దారిలో ప్రయాణించే కాలం. ఈ కాలంలో తిరిగి మన్రో స్వయంగా అమెరికా అధ్యక్షుడయ్యాడని వూహించుకుందాం. లేదా రూజ్వెల్డ్, ట్రూమన్, రీగాన్, జార్జిబుష్ వంటి వాళ్ళు ఎన్నికయ్యారని అనుకుందాం. వారెవరూ ఇలాంటి తిరోగమన చరిత్ర గమనాన్ని దారి తప్పించలేరనేది నిజం!

ఇలా అంచెలంచెలుగా సామ్రాజ్యవాద ప్రపంచ వ్యవస్థకి అధినేతగా ఎదిగి వర్ధిల్లిన నేపథ్యం అమెరికాకి వుంది. అది సామ్రాజ్యవాద నీతి ప్రకారం వైభవమే కదా! దాని పునరుద్ధరణ లక్ష్యంతో అమెరికా కార్పొరేటు సంస్థల ఆంకాక్షల నుంచి ‘మాగా’ వుద్యమం రూపొందింది. దానికి ప్రాతినిధ్యం వహించేదే ట్రంప్ సర్కారు! కానీ, ఆ లక్ష్యం ఆచరణాత్మకమైనది కాదు. ఆ దారిలో ట్రంప్ రూపొందించే ప్రణాళికలు ఆచరణలో బెడిసికొట్టి తీరతాయి. అందుకు తగిన కారణాలున్నాయి.

కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ (కొమింటర్న్) రెండవ మహాసభలో దాని మౌలిక కర్తవ్యాల గూర్చి ఇచ్చిన నివేదికలో లెనిన్ మాట్లాడుతూ చెప్పిన వ్యాఖ్య క్రింద పేర్కొందాం.
“అమెరికా జనాభా పది కోట్ల మందికి మించలేదు. కానీ, యుద్ధం (మొదటి ప్రపంచ యుద్ధం-పి.పి) నుంచి పూర్తిగా లబ్ది పొందిన ఒకే ఒక్క దేశం అమెరికా! అది భారీ రుణ గ్రహీతగా వుంటూ వచ్చి సార్వత్రిక రుణదాత దేశంగా మారింది.”
అమెరికా ఆర్ధిక స్థితి గూర్చి పైన పేర్కొన్న వ్యాఖ్యను లెనిన్ చేసి 105 ఏండ్లు దాటింది. ఈనాటి అమెరికా ఆర్ధిక వ్యవస్థ స్థితి ఏమిటో తులనాత్మక దృష్టితో పరిశీలించుదాం.
మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అగ్రరాజ్యాలైన బ్రిటన్, ఫ్రాన్స్ లకి అమెరికా మూరెడు వడ్డీకి బారెడు అప్పులిచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం నాటికి మరో ముందడుగు వేసి అప్పుతో పాటు ఆయుధ సంపత్తిని అమ్ముకొని లాభాలను గడించింది. ఈ రెండు యుద్ధాలలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొని నష్టపోయింది లేదు. కానీ భారీగా లాభాలు గడించింది. (ప్రపంచ సోషలిస్టు కేంద్రం యు.ఎస్.ఎస్.ఆర్ నిర్ణయాత్మక విజయం సాధించే పరిస్థితి పట్ల భీతిల్లిన అమెరికా చివరి దశలో పసిఫిక్ ప్రాంత పెరల్ హార్బర్ వైపు సైనిక బలగాలను దింపి జపాన్ దాడిలో తన సైనికులను కోల్పోయింది. ప్రతీకారం పేరిట హిరోషిమా, నాగసాకీలపై అణు ప్రయోగం చేసింది. యుఎస్ఎస్ఆర్ లక్ష్యంగా తప్ప ఆ యుద్ధంలో అది భాగస్వామ్య దేశం కాదు) నూరేళ్ళ క్రితం లెనిన్ చెప్పినట్లు రుణదాత దేశంగా నిలిచింది. అదే ఆర్ధిక వైభవం రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కూడా వర్ధిల్లింది. అదే అమెరికా ఇప్పుడు 38 ట్రిలియన్ డాలర్ల అప్పులలో ప్రపంచంలోనే అతిపెద్ద రుణగ్రస్త దేశంగా మారింది. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కారు చేపట్టిన ‘మాగా ‘ వుద్యమ సాధ్యాసాధ్యాలను విశ్లేషించాల్సి వుంది.

అమెరికాకు దురాక్రమణ యుద్ధాలు కొత్తకాదు. ప్రపంచంలో సైనిక శిబిరాలు నెలకొల్పడం కొత్త కాదు. సైనిక బడ్జెట్లకు అధిక నిధుల కేటాయింపులు కొత్త కాదు. ఐనా అమెరికా ఆర్ధిక వ్యవస్థ దశాబ్దాల పాటు ధనాత్మక స్థితిలో కొనసాగింది. కొరియా, వియత్నాం యుద్దాల్లో భారీ సైనిక వ్యయాన్ని భరించినా రుణ గ్రస్త దేశంగా దిగజారలేదు. కానీ, ఏకధృవ అగ్రరాజ్యంగా మారిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ దురాక్రమణలు అమెరికా ఆర్ధిక వ్యవస్థని రుణగ్రస్త స్థితికి దిగజార్చింది. 50 బిలియన్ల డాలర్ల వ్యయంతో ఇరాక్ దురాక్రమణ పధకాన్ని అమలుచేసి, మరో వంద బిలియన్ల వ్యయంతో పునర్నిర్మాణ ప్రక్రియను పూర్తిచేయగలమని ఇరాక్ దురాక్రమణకు ముందు అమెరికన్ కాంగ్రెసు (పార్లమెంటు) 2003 లో అంచనా వేసింది. కానీ, 2006 నాటికే మూడు ట్రిలియన్ (మూడు వేల బిలియన్ డాలర్లు) వ్యయం ఐనట్లు ఆధారలతో నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ ఒక గ్రంథం రచించాడు. ఆ తర్వాత పునర్నిర్మాణ వ్యయం పెరుగుతూనే పోయింది. తమ దురాక్రమణ లక్ష్యం నెరవేరకుండానే ఇరాక్ లో నిలదొక్కుకోకుండా ఒబామా కాలంలో సైనిక ఉపసంహరణ చేసుకోవాల్సి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం కూడా ఇలాంటి దుస్థితికే అమెరికాను యీడ్చింది. యుద్ధాలలో మరణించిన సైనిక కుటుంబాలకు భారీ నష్టపరిహారాలు, జీవిత కాల ఫించన్లు, క్షతగాత్రులకు పరిహారాలు, ఫించన్ల వంటి అదనపు ఆర్థిక భారాలను మోయాల్సి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా సైనిక శిబిరాల నిర్వహణా వ్యయం కూడా పెరిగింది. ఇవన్నీ అప్పులకు తోడై జిడిపిలో 130 శాతానికి అప్పులు చేరాయి. ఈ దుస్థితిలో ట్రంప్ సర్కారు కొత్త యుద్ధాలకు తెరలేపడటం గమనార్హం! ఇది పూర్వ వైభవ పునరుద్ధరణకు సహకరించలేదు. నేటి దుస్థితి, దురవస్థలను తీవ్రతరం చేస్తుంది. అగ్రరాజ్య స్థితిని కూడా ప్రశ్నార్ధకం చేస్తుంది.

నిన్నటి ఏకధృవ ప్రపంచ పరిస్థితి పునరుద్ధరణ చేయకుండా ‘మాగా’ నినాదం సాకారరూపం ధరించే అవకాశం లేదు. కానీ ఆచరణలో అది సాధ్యం కాదు. ఇప్పుటికే ఉనికిలో వున్న బహుళ ధృవ ప్రపంచ పరిస్థితిని మరింత స్థిరపరురుకునే లక్ష్యంతో రష్యా-చైనా కూటమి గరిష్టంగా ప్రయత్నిస్తున్నది. గత ఏకధృవ ప్రపంచంలో డబ్ల్యూటీవో ఉనికిలోకి వచ్చింది. ఆచరణలో ఆ వాణిజ్య సంస్థ బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థకు బలం చేకూరే సాధనంగా మారింది. యు.ఎన్.ఓ కూడా అదే దారిలో నడుస్తుంది. డబ్ల్యూటీవో యు.ఎన్.ఓ.లను అమెరికా ఏకపక్షంగా శాసించేస్థితి కోల్పోతోంది. శాశ్వత సభ్య రాజ్యాల మధ్య ఏకీభావం వుండే సందర్భాలలో మూడవ ప్రపంచ దేశాల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా డబ్ల్యూటీవో, ఐ.ఎం.ఎఫ్, యు.ఎన్.ఓ. వంటివి వుపకరిస్తాయి. ఒక్క అమెరికాకి వాటి పై నియంత్రణ శక్తిలేదు. వీటో హక్కుగల రష్యా, చైనాల్ని కాదని రుణగ్రస్త అమెరికా ఏకపక్షంగా దురాక్రమణలు సాగించి వాటి అండతో విజయం సాధించడం సాధ్యం కాదు. వెనిజువెలా పై దాడిచేసి భార్యతో సహా మదురోను బంధించి వుండొచ్చు. ఈ ఒక్క సంఘటనతో భౌగోళిక రాజకీయ పొందికలో గుణాత్మక మార్పులు రావు. నేడు ఉనికిలో వున్న బహుళధృవ ప్రపంచ పరిస్థితి ట్రంప్ సర్కారు విధానాలకి తీవ్ర ప్రతిబంధకంగా రేపు మారితీరుతుంది. ఇది రేపటి భౌతిక సత్యం.

రష్యా-చైనా కూటమి అండదండలు లేకుండానే ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా జాతీయ విమోచనోద్యమాలు, స్వతంత్రంగా సాగాయి. ఉత్తర కొరియా తన స్వంత కాళ్ళపై నిలబడి అణ్వస్త్ర దేశంగా ఎదిగింది. ఇరాన్ స్వతంత్ర రాజ్యంగా నిలబడి మధ్యప్రాచ్యంలో ప్రతిఘటనా కూటమికి సారధ్యం వహిస్తున్నది. ఉదాహరణులు చాలా వున్నాయి. గాన జాతీయ విమోచనోద్యమాలు, దేశాల స్వాతంత్య్ర పరిరక్షణా పోరాటాలు ఒక నిరంతర ప్రవాహంగా సాగుతాయి. వెనిజువెలా పై దురాక్రమణ దాడి లాటిన్ అమెరికా, సెంట్రల్ అమెరికా దేశాలను ప్రతిఘటనా పధంలోకి తెస్తాయి. అవి ఆసియా, ఆఫ్రికాల్ని అనివార్యంగా అదే దారిలోకి తెస్తాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్థతో పాటు సైనిక వ్యవస్థను పతనం వైపు నెడతాయి.

ఇది దేశాలు స్వతంత్రతను, జాతులు విముక్తినీ, ప్రజలు విప్లవాలనూ కోరే కాలం. ఈ యుగ స్వభావం ఇలా మూడు విప్లవ ప్రవాహాలతో కూడింది. మరోవిధంగా పరిశీలిస్తే నేటి ప్రపంచంలో మూడు మౌలిక వైరుధ్యాలు తీవ్రతరమవుతున్న కాలమిది. ఒకవైపు సామ్రాజ్యవాదానికీ, మరోవైపు పీడిత దేశాలు, జాతులకూ మధ్య వైరుధ్యం తీవ్రతరమౌతూ వుంది. మరోవైపు పెట్టుబడికీ, శ్రమశక్తికీ మధ్య వైరుధ్యం తీవ్రతరమవుతున్నది. ఇంకోవైపు సామ్రాజ్యవాద శిబిరాల మధ్య వైరుధ్యం తీవ్రతరమవుతోంది. ఈ మూడు వైరుధ్యాలు తీవ్రతరమవుతున్న కాలంలో ‘మాగా’ పేరిట ట్రంప్ నూతన దూకుడు యుద్ధ విధానాలను అవలంబించడం గమనార్హం! ఇది రానున్న కాలంలో అనివార్యంగా ప్రతిఘటనల ఊబిలో దిగబడిపోవడానికి దారి తీస్తుంది.

స్థూలంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సంక్షోభ స్థితి నుండి తీవ్ర సంక్షోభ స్థితి వైపు నడుస్తోంది. అది క్రమంగా 1929 నాటి మహా మాంద్యం వైపు కూడా అడుగులు వేస్తోంది. ఈ సంక్షోభ పరిస్థితి ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాలను దిగజార్చుతోంది. ఇది ఒకవైపు తీవ్ర అతివాద, తీవ్రవాద విప్లవోద్యమాల నిర్మాణానికీ; మరోవైపు తీవ్ర మితవాద, ప్రతీఘాత, ఫాసిస్టు శక్తులకూ బలాన్నిస్తోంది. ఈ పరిస్థితి ప్రపంచాన్ని సాధారణ స్థితిలో వుంచనివ్వదు. తీవ్ర చలనాలను సృష్టిస్తుంది.

మార్షల్ పధకం ద్వారా మరియు నాటో ద్వారా గతంలో యూరప్ ని సైతం అమెరికా నియంత్రించింది. కానీ, ఇరాన్ లో అమెరికా ప్రయోగం బెడిసికొట్టి, గాజా, ఉక్రెయిన్ లలో దౌత్యం విఫలమై చివరకు పశ్చిమార్ధగోళం పై డ్రాన్రో సిద్దాంతంతో కేంద్రీకరణ చేయాల్సిన స్థితికి అది చేరింది. రెండు శతాబ్దాల్లో అంచెలంచెలుగా నడిచి వచ్చిన దారితో పోల్చితే డ్రానో సిద్దాంతం అమెరికా ఆత్మరక్షణ స్థితికి అద్దం పడుతుంది. అప్పుల కొంపగా మారిన నేటి అమెరికా దుస్థితితో పోల్చితే దుస్సాహసిక మార్గం అవుతుంది. ఒక సామ్రాజ్యవాద రాజ్యంగా అమెరికా ఎదుట నేటి తక్షణ కర్తవ్యం యుద్ధాలకు దిగడమే. అది తప్ప అమెరికాకు మరో మార్గం లేదు. తత్ఫలితంగా, తలెత్తే యుద్ధాల ద్వారానే తన ఈనాటి స్థితిని సైతం కోల్పోక తప్పదు.

లాటిన్ అమెరికా దేశాల ఆర్ధిక వ్యవస్థలు ప్రధానంగా చైనాతో ముడిపడుతుంటే, సైనిక వ్యవస్థలు ప్రధానంగా రష్యాతో ముడిపడే స్థితి వుంది. అది అమెరికాకు జీవన్మరణ సమస్యగా మారింది. ఉదా : వెనిజువెలా చమురుపై అమెరికాకు నియంత్రణ లేకపోవడం ఒక రకం సమస్య. దాని చమురు చైనాకు సరఫరా కావడం మరో సమస్య. అంతకు మించిన పెద్ద సమస్య డాలర్లతో కాకుండా ఇతర కరెన్సీలతో వాణిజ్య లావాదేవీలు జరగడం! ఇప్పటికే బ్రిక్స్ కూటమి డీ-డాలరైజేషన్ దారి చేపట్టింది! యూరప్, ఆసియా, ఆఫ్రికాల నుంచి తన పెరటి దొడ్డి (లాటిన్ అమెరికా) గా భావించే లాటిన్ అమెరికా దేశాలకి కూడా డీ-డాలరైజేషన్ వాణిజ్య ప్రక్రియ ప్రవేశించి బలపడుతున్నది. ఈ స్థల, కాలాదులతో పోల్చి పరిశీలిస్తే వినాశనకర రాజకీయ విధానాలను చేపట్టక తప్పని పరిస్థితి అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఏర్పడింది. దీనిని లెనిన్ చెప్పిన వెలుగులో చూడాల్సి వుంది. ట్రంప్ సర్కారు చేపట్టే వినాశకర విధానాలకు అమెరికా ఆర్థిక పరిస్థితులు మూలాధారంగా వుంటాయని అర్ధం చేసుకోవాలి. అమెరికా పూర్వ వైభవపు పునరుద్ధరణకు అవి ఉపయోగపడవు. పైగా ఈనాటి స్థితిని కూడా దిగజార్చుతుంది. రెండు శతాబ్దాలు అంచెలంచెల రూపంలో ఎదిగిన అమెరికా శాంతి యుతంగా ఐ.పి. పెట్టి అప్పుల ఎగవేతద్వారా మనుగడ సాగించ లేదు. సైనికంగా తెల్లజెండా ఎత్తడం ద్వారా తన నేటి స్థానాన్ని అది వదులు కోలేదు. ఏ యుద్ధాల ద్వారా అది బలపడుతూ వచ్చిందో, అదే యుద్ధాల ద్వారా అగ్రరాజ్య ఉనికిని కోల్పోవాల్సి రావచ్చు. ఆ దారిలో ఇలా వినాశకర యుద్ధాలు ఓ సాధనంగా మారతాయి కాబోలు! వెనిజువెలా పై తాజా సైనిక చర్య ఆ ప్రక్రియకు ఒక ఉత్ప్రేరకంగా మారుతుందేమో! లేదా తన ప్రస్తుత స్థితిని కొంత కాలం కాపాడుకోవడానికి వుపకరిస్తుందేమో! ఏది ఏమైనా మాగా లక్ష్యం ఫలించడానికి అవకాశం లేదు. అది అనివార్యంగా కొత్త ప్రతిఘటనలను ఎదుర్కోక తప్పదు. ఆ నిర్ధిష్ట పరిస్థితులలోనే ఉన్మాదపూరితంగా ఆఖరి తెగింపు చర్యలుగా హిరోషిమా తరహాలో మారణ హెూమాలను సృష్టించవచ్చు. అయినా అంతిమంగా ఓడిపోక తప్పదు. ఈనాటి ప్రపంచ గమనాన్ని స్థల, కాలాదుల ప్రాతిపదికన పరిశీలిస్తే, అమెరికా తన ప్రస్తుత స్థానాన్ని కాపాడుకోవడం సాధ్యంకాకపోవచ్చని బోధపడుతుంది. పతన మార్గంలో వెనిజువెలా పై దాడి ఒక మైలురాయిగా నిలుస్తుందేమో!, దాని స్థానాన్ని బలహీనపరిచే పాత్రను ప్రపంచ ప్రజలతో పాటు అమెరికా ప్రజలు కూడా పోషించే అవకాశం ఉందేమో! మున్ముందు ఏమి జరుగుతుందో పరిశీలించుదాం.

(ఇది 10-1-2026 తేదీన రాసింది. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఏపీ రాష్ట్ర కమిటీ పక్షపత్రిక 2026 జనవరి 15-31 సంచికలో ప్రచురించినది)