పదివేల పాములను రక్షించిన హైదరాబాద్ సంస్థ
పామును చూస్తే భయంతో వణికిపోతాం. అక్కడ నుంచి దూరంగా పారిపోతాం. ధైర్యం ఉన్న కొందరు వాటిని చంపేస్తారు కూడా. కానీ, కొందరు పాముల రక్షణలోనే ఉన్నారు

- తెలంగాణలో ఏడాదిలోనే కాపాడిన స్నేక్ సొసైటీ
- 2030 నాటికి పాముకాటు మరణాలు సున్నా
- చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఎఫ్‌వోఎస్ఎస్
విధాత: పామును చూస్తే భయంతో వణికిపోతాం. అక్కడ నుంచి దూరంగా పారిపోతాం. ధైర్యం ఉన్న కొందరు వాటిని చంపేస్తారు కూడా. కానీ, కొందరు పాముల రక్షణలోనే ఉన్నారు. ప్రాణాలకు తెగించి వాటిని కాపాడుతున్నారు. వారే హైదరాబాద్‌కు చెందిన ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ (FOSS) సభ్యులు. ఒక్క ఏడాదిలోనే హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పది వేలకుపై పాములను రక్షించారు. పాములను సంరక్షించి 2030 నాటికి తెలంగాణలో పాముకాటు మరణాలను సున్నా సాధించే దిశగా స్నేక్స్ సొసైటీ సభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రకృతిలో జీవవైవిధ్యాన్ని కాపాడుతున్నారు.
హైదరాద్‌లోని ఇండ్లు, నివాస ప్రాంతాలు, కార్యాలయాల్లోకి చొరబడిన పాములను నిఫుణులైన పీవోస్ఎస్ సభ్యులు రక్షించి అడవుల్లో వదిలేస్తున్నారు. పాము చొరబాట్లకు సంబంధించిన సాధారణ ప్రజల నుంచి రోజుకు 200 నుంచి 300 ఫోన్‌కాల్స్ వస్తాయని సంస్థ సభ్యులు వెల్లడించారు
“అటువంటి రెస్క్యూ కాల్‌లకు హాజరవుతాము. పాములను రక్షిస్తాం. అలాగే మా నిపుణుల బృందం పాములపై అవగాహన వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. ఇవి పాము మరణాలు. పాము కాట్లను తగ్గించడంలో దోహదం చేస్తాయి. 1995 నుంచి మేము పాము సంరక్షణలో ఉన్నాము. పాములను రక్షించడానికి మా ప్రయత్నాలను నిరంతరం పెంచుతున్నాము ”అని ఎఫ్‌వోఎస్ఎస్ జనరల్ సెక్రటరీ అవినాష్ విశ్వనాథన్ చెప్పారు.
ఈ ఏడాది ఇప్పటివరకు 3,151 పాములను రక్షించినట్టు తెలిపారు. పాముల రెస్క్యూల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని పేర్కొన్నారు. ఒక్క తెలంగాణలోనే గత ఏడాది 10,282 పాములను కాపాడినట్టు పేర్కొన్నారు. రక్షించబడిన అన్ని పాములను తెలంగాణ అటవీ శాఖ సహాయంతో అనువైన అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టినట్టు వెల్లడించారు.
“మా వాలంటీర్లు పాము జాతుల పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తున్నారు. 2023లో మొత్తం 25 రకాల పాము జాతులు రక్షించారు. వాటిలో 46 శాతం స్పెక్టాకిల్ కోబ్రాస్, 27 శాతం రాట్ స్నేక్స్, 10 శాతం చెకర్డ్ కీల్‌బ్యాక్‌లు, 4 శాతం రస్సెల్స్ వైపర్స్, 4 శాతం బ్రాంజ్‌బ్యాక్ ట్రీ ఉన్నాయి. మిగిలిన ఇతర జాతుల పాములు ఉన్నాయి” అని ఎఫ్‌వోఎస్ఎస్ తెలిపింది.
2014లో 3,151, 2015లో 3,389, 2016లో 3,097, 2017లో 4,504, 2018లో 5,644, 2019లో 6,689, 2020లో 8,895, 2021లో 10,525, 2022లో 9,101, 2023లో 10,282 పాములను ఎఫ్‌వో ఎస్ఎస్ సభ్యులు రక్షించారు.
తాజాగా ఆదివారం లంగర్ హౌజ్‌లోని డిఫెన్స్ కాలనీ నివాసితులు మూడు పెద్ద కొండచిలువలను గుర్తించారు. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ (8374233366) ద్వారా ఎఫ్‌వోఎస్ఎస్‌కు ఫోన్‌చేశారు. FOSS సభ్యులు వినయ్, వరప్రసాద్ ఘటనా స్థలానికి వెళ్లి మూడు కొండచిలువలను విజయవంతంగా రక్షించారు. ఒక్కొక్కటి సుమారు ఏడు అడుగుల పొడవు ఉన్నాయి.
తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఇండియన్ రాక్ కొండచిలువలు ఫిబ్రవరిలో తమ సంభోగం సీజన్‌లోకి ప్రవేశిస్తాయి. గుడ్లు పెట్టడం ఏప్రిల్, మేలో జరుగుతుంది. రెండు నెలల పొదిగే కాలం. జూలై, ఆగస్టులో 15 వరకు పొదిగే పిల్లలు బయటకు వస్తాయి. అవి మానవ నివాసాలకు దగ్గరగా వస్తాయి.