పార్లమెంటులో చొరబడినవారి మొదటి ప్లాన్‌ తెలిస్తే గుండె ఝల్లుమనటం ఖాయం

రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచనతోపాటు.. పార్లమెంటు వెలుపల ఆత్మాహుతి చేసుకోవాలనే ఆలోచన కూడా పార్లమెంటులో చొరబడిన యువకులు చేసినట్టు తెలుస్తున్నది.

  • By: TAAZ    latest    Dec 16, 2023 12:29 PM IST
పార్లమెంటులో చొరబడినవారి మొదటి ప్లాన్‌ తెలిస్తే గుండె ఝల్లుమనటం ఖాయం

న్యూఢిల్లీ : పార్లమెంటులో చొరబడి హల్‌చల్‌ చేసిన యువకుల్లో ఒకడైన సాగర్‌ శర్మను విచారిస్తున్న పోలీసులకు దిగ్భ్రాంతికర అంశాలు వెలుగు చూస్తున్నాయని సమాచారం. వాస్తవానికి తాము పార్లమెంటు వెలుపల ఆత్మాహుతి చేసుకుందామని అనుకున్నామని సాగర్‌ శర్మ విచారణలో చెప్పినట్టు తెలుస్తున్నది. అయితే.. ఆ ప్లాన్‌ను వదిలిపెట్టి, లోక్‌సభలో నిరసనకు దిగినట్టు సమాచారం. ఆందోళన కార్యక్రమానికి ముందు మీడియా దృష్టిలో పడి, రాజకీయ పార్టీ స్థాపించాలనే ఆలోచనలో ఉన్నారని దర్యాప్తు వర్గాల ద్వారా తెలుస్తున్నది.


తమ అభిప్రాయాలను వెల్లడించడానికి అదే సరైన మార్గం అని భావించారని చెబుతున్నారు. సైద్ధాంతిక విభేదాల కారణంగా ఏ రాజకీయ పార్టీకీ అనుబంధంగా ఉండాలని భావించలేదని సాగర్‌ వెల్లడించాడని సమాచారం. ఒక దశలో పార్లమెంటు వెలుపల తమను తాము తగులబెట్టుకోవాలని భావించినట్టు చెప్పాడని తెలిసింది. ఇందుకోసం హానికారకం కాని జెల్‌ వంటి పదార్థాన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డారని, అందుకోసం నిధులు కూడా సమీకరించారని సమాచారం. అయితే పేమెంట్‌ విఫలం కావడంతో కొనుగోలు చేయలేకపోయినట్టు సాగర్‌ చెప్పాడని తెలిసింది.


డిసెంబర్‌ 13వ తేదీన సాగర్‌ శర్మ, మనోరంజన్‌ అనే ఇద్దరు యువకులు లోక్‌సభలోకి దుంకి హానికారకం కాని గ్యాస్‌ను వెదజల్లగా, పార్లమెంటు వెలుపల అమోల్‌ షిండే, నీలంకౌర్‌ నిరసనకు దిగారు. వీరిని అరెస్టు చేసి, విచారించగా.. విశాల్‌ శర్మ అనే ఐదో నిందితుడు చిక్కాడు. ఇతడి నివాసంలోనే నిందితులందరూ ఘటనకు ముందు ఉన్నారు. వీరిపై ఢిల్లీ పోలీసులు కఠినమైన ఉపా చట్టంతోపాటు. ఐపీసీ 120బీ, 452 కింద కేసులు నమోదు చేశారు. తదుపరి కీలక కుట్రదారుడు, ఈ పథకం వెనుక ఉన్న వ్యక్తి లలిత్‌ మోహన్‌ ఝా అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అతడితోపాటు మహేశ్‌ కుమావత్‌ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. ఝా, ఇతరులు భగత్‌ సింగ్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌ అనే ఫేస్‌బుక్‌ పేజీలో సభ్యులు. అయితే.. తదుపరి ఆ పేజీని తొలగించారు.


ఈ దాడి వ్యూహ‌క‌ర్త ల‌లిత్ ఝాతో పాటు మ‌హేశ్ రెండు రోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయిన విష‌యం విదిత‌మే. మ‌హేశ్ కుమావ‌త్ ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఆధారాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో మ‌హేశ్ ఏడు రోజుల పాటు పోలీసుల క‌స్ట‌డీలో ఉండ‌నున్నాడు. సాగ‌ర్ శ‌ర్మ‌, నీలం ఆజాద్, అమోల్ షిండే, మ‌నోరంజ‌న్ ఫోన్ల‌ను మ‌హేశ్ ధ్వంసం చేసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ల‌లిత్ ఝా కూడా పోలీసుల క‌స్ట‌డీలోనే ఉన్నాడు.