Patna Bheti | పాట్నా భేటీ నేడే.. ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు ప్రణాళిక

Patna Bheti బీజేపీపై పోరాటానికి వ్యూహాల రచన కాంగ్రెస్‌, లెఫ్ట్‌ సహా 18పార్టీల హాజరు శుభారంభమన్న తృణమూల్‌ నేత న్యూఢిల్లీ: మతవిద్వేషాలు, వ్యవస్థల విధ్వంసంతో దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీపై పోరాటానికి తొలి అడుగుగా భావసారూప్యం ఉన్న ప్రతిపక్ష పార్టీలు పాట్నాలో శుక్రవారం సమావేశం కానున్నాయి. ఐదు పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులతోపాటు.. పలు కీలక రాజకీయ పార్టీల నాయకులు హాజరుకానుండటంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌, ఆర్జేడీ నాయకుడు బీహార్‌ […]

Patna Bheti | పాట్నా భేటీ నేడే.. ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు ప్రణాళిక

Patna Bheti

  • బీజేపీపై పోరాటానికి వ్యూహాల రచన
  • కాంగ్రెస్‌, లెఫ్ట్‌ సహా 18పార్టీల హాజరు
  • శుభారంభమన్న తృణమూల్‌ నేత

న్యూఢిల్లీ: మతవిద్వేషాలు, వ్యవస్థల విధ్వంసంతో దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీపై పోరాటానికి తొలి అడుగుగా భావసారూప్యం ఉన్న ప్రతిపక్ష పార్టీలు పాట్నాలో శుక్రవారం సమావేశం కానున్నాయి. ఐదు పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులతోపాటు.. పలు కీలక రాజకీయ పార్టీల నాయకులు హాజరుకానుండటంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌, ఆర్జేడీ నాయకుడు బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ చొరవతో జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు వామపక్షాల నేత సీతారాం ఏచూరి, డీ రాజా, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ, జర్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్ తదితరులు పాల్గొనబోతున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యత దిశగా ఇది ఒక శుభారంభమని తృణమూల్‌ కాంగ్రెస్‌ పేర్కొన్నది. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు పాటుపడుతున్నాయని టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓ బ్రైన్‌ పేర్కొన్నారు. ఈ సమావేశానికి మమతతోపాటు.. ఆమె మేనల్లుడు, పార్టీ కీలక నేత అభిషేక్‌ బెనర్జీ కూడా హాజరుకానున్నారు.

బెంగాల్‌లో వాపమక్షాలతో కాంగ్రెస్‌ జట్టుకడితే తాము సహకరించేది లేదని మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలు, యూపీలో గట్టి పార్టీ అయిన తమకు ప్రతిపక్షాలు అండగా ఉండాలని అఖిలేశ్‌యాదవ్‌ చేసిన వ్యాఖ్యలతో పాట్నా భేటీపై కొంత అనుమానపు నీడలు ఏర్పడినప్పటికీ.. ముందుగా ఒక ప్రణాళికపై అవగాహన కోసం జరుగుతున్న సమావేశానికి ఈ ఇద్దరు నేతలు కూడా హాజరుకానుండటం సానుకూల సంకేతాలను పంపుతున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.