Telangana municipal elections 2026| తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ !

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు వెలువడే సమయానికి కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యతను చాటుకుంది. 116 మున్సిపాల్టీలలో ఇప్పటికే 67 చోట్ల, ఏడు కార్పోరేషన్లలో 5చోట్ల విజయం సాధించింది.

Telangana municipal elections 2026| తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ !

విధాత, హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు వెలువడే సమయానికి కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యతను చాటుకుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లోని 2996 వార్డులకు గాను 2853 ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటిలో కాంగ్రెస్‌ 1497 వార్డుల్లో విజయం సాధించి 67 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 764 వార్డుల్లో గెలుపొంది 14 మున్సిపాలిటీలు దక్కించుకుంది. బీజేపీ 278 వార్డుల్లో, స్వతంత్రులు 256 వార్డుల్లో విజయం సాధించారు.   35 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్‌ ఏర్పడింది.

మహబూబ్‌నగర్‌ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి బలపరిచిన ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ కైవసం చేసుకోవడం గమనార్హం. జగిత్యాలలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం హాట్ టాపిక్ గా మారింది.

కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ దే హవా

రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లకు సంబంధించి వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్ కార్పోరేషన్లలో విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. కాంగ్రెస్‌, సీపీఐ చెరో 22 స్థానాల్లో గెలుపొందాయి. 8 స్థానాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ 1, సీపీఎం 1, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎన్నిక రసవత్తరంగా మారింది.

కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించడంతో ఇక్కడ 16వ తేదీన జరిగే మేయర్ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్‌లను బీజేపీ గెలుచుకుంది. కరీంనగర్‌లో మొత్తం 66 డివిజన్లలో బీజేపీ 31 చోట్ల విజయం సాధించింది. బీఆర్‌ఎస్‌ 9, కాంగ్రెస్‌ 15, ఇతరులు 11 డివిజన్లలో గెలుపొందారు. నిజామాబాద్ లో బీజేపీ 20, కాంగ్రెస్ 8, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధించారు.

కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమే మున్సిపల్ ఎన్నికల ఘన విజయం : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనం. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం. అదేవిధంగా…రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద – మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారు.

ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ… భవిష్యత్ లో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు.