Patna Conference | ముఖాముఖిపై.. పట్నాలో తేలుస్తారా?

Patna Conference విధాత‌: పట్నాలో నిర్వహించనున్న ప్రతిపక్షాల సదస్సు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నది. బీజేపీపై ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఈ సదస్సును బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ఏర్పాటు చేస్తున్నారు. బీహార్‌లో ప్రతిపక్షాల ఐక్యతా నమూనాను దేశానికి చాటే ఉద్దేశంతో రాష్ట్రవ్యప్తంగా కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు. అయితే.. బీజేపీతో ముఖాముఖి తలపడే విషయమై ఈ సదస్సులో ఏకాభిప్రాయం కుదిరే అవకాశం కనిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఈ […]

Patna Conference | ముఖాముఖిపై.. పట్నాలో తేలుస్తారా?

Patna Conference

విధాత‌: పట్నాలో నిర్వహించనున్న ప్రతిపక్షాల సదస్సు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నది. బీజేపీపై ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఈ సదస్సును బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ఏర్పాటు చేస్తున్నారు. బీహార్‌లో ప్రతిపక్షాల ఐక్యతా నమూనాను దేశానికి చాటే ఉద్దేశంతో రాష్ట్రవ్యప్తంగా కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు. అయితే.. బీజేపీతో ముఖాముఖి తలపడే విషయమై ఈ సదస్సులో ఏకాభిప్రాయం కుదిరే అవకాశం కనిపించడం లేదు.

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఈ అంశంపై వేచిచూసే ధోరణి అవలంబిస్తుండడమే ఇందుకు కారణం. తృణమూల్‌, ఆప్‌, సమాజ్‌వాది పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని పోటీ పెట్టే విషయమై ఏకాభిప్రాయానికి రావాలని కోరుతున్నాయి. అయితే కాంగ్రెస్‌ మాత్రం ఈ అంశంపై ఇప్పుడే ఒక అభిప్రాయానికి రాలేమని చెబుతున్నది. కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత కాంగ్రెస్‌లో ఆత్మ విశ్వాసం పెరిగింది.

మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగిన తర్వాత ముఖాముఖి తలపడే విషయమై ఒక అవగాహనకు రావచ్చునని కాంగ్రెస్‌ భావిస్తున్నది. ముఖాముఖి తలపడే విషయమై స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చినా రాష్ట్రాల వారీగా ఏం చేయాలన్న విషయమై ఇప్పుడే నిర్ణయానికి వచ్చే అవకాశం లేదు. ముస్లింలు, దళితులు, మరికొన్ని సామాజిక వర్గాలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నాయని, కాంగ్రెస్‌ రంగంలో ఉంటే తమకు సంకటంగా పరిణమిస్తుందని సమాజ్‌వాదీ, తృణమూల్‌ భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌ మాత్రం ఈ పార్టీల విషయంలో వేచి చూసే ధోరణినే అవలంబిస్తున్నది.

గోవా, గుజరాత్‌ వంటి రాష్ట్రాలలో ఆప్‌, తృణమూల్‌లకు ఎటువంటి బలం లేకపోయినా, తమ ఓట్లను చీల్చడం కోసమే పోటీ చేశాయని కాంగ్రెస్‌ భావిస్తున్నది. అవి పోటీలో లేకుంటే తాము గెలిచి ఉండేవాళ్లమనే అభిప్రాయంలో ఉన్నది. ఈ అనుభవం దృష్ట్యా ఈ ఏడాది చివరలో జరుగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే ముఖాముఖి పోటీలపై ఒక స్పష్టమైన అవగాహనకు రావాలని కాంగ్రెస్‌ భావిస్తున్నది.

ఈ నాలుగు రాష్ట్రాలలో కూడా తమకు అనుకూల ఫలితాలు వస్తాయనే నమ్మకంతో కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు. అదే జరిగితే అప్పుడు మిత్రపక్షాలతో మరింత గట్టిగా మాట్లాడటానికి అవకాశాలు పెరుగుతాయని కాంగ్రెస్‌ భావిస్తున్నది. అయితే.. ముఖాముఖి పోటీపై ఏకాభిప్రాయం ఇప్పుడే కుదరకపోయినా.. ముందుగా ప్రతిపక్షాల ఐక్యతను దృఢపర్చుకునేందుకు మాత్రం పట్నా సదస్సు ఉపయోగపడుతుంది.