PM Modi | వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పత్తా లేకుండా చేస్తాం: ప్రధాని మోడీ
PM Modi కేసీఆర్‌ది అత్యంత అవినీతి ప్రభుత్వం ఢిల్లీ వరకు కేసీఆర్ ప్రభుత్వ అవినీతి మోడీ సర్కార్ను తిట్టడం కేసీఆర్ పని కుటుంబ పాలనతో అందరికీ చేటు విద్యాసంస్థల పట్ల కేసీఆర్ నిర్లక్ష్యం దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం హనుమకొండ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను పత్తా లేకుండా చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వాసంతో ప్రకటించారు. మున్సిపల్ సంస్థ ఎన్నికల్లో […]

PM Modi
- కేసీఆర్‌ది అత్యంత అవినీతి ప్రభుత్వం
- ఢిల్లీ వరకు కేసీఆర్ ప్రభుత్వ అవినీతి
- మోడీ సర్కార్ను తిట్టడం కేసీఆర్ పని
- కుటుంబ పాలనతో అందరికీ చేటు
- విద్యాసంస్థల పట్ల కేసీఆర్ నిర్లక్ష్యం
- దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం
- హనుమకొండ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను పత్తా లేకుండా చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వాసంతో ప్రకటించారు. మున్సిపల్ సంస్థ ఎన్నికల్లో వీరిద్దరికీ బీజేపీ ట్రైలర్ చూపించిందని, వరంగల్ సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటేనే ఈ విషయం మరోసారి స్పష్టమవుతోందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ భద్రకాళి అమ్మవారి మహత్యానికి, సమ్మక్క-సారలమ్మ పౌరుషానికి, రాణి రుద్రమ పరాక్రమానికి చిరునామా అయిన వరంగల్‌కు రావడం సంతోషకరమని ప్రధాని మోడీ తెలుగులో అన్నారు.బీజేపీ తొలిసారి సాధించిన రెండు ఎంపీ సీట్లలో హనుమకొండ ఒకటి అంటూ తొలి నుంచి బీజేపీ ఆలోచనకు ఈ ప్రాంతం సానుకూలంగా ఉందని ప్రధాని కొనియాడారు.
మోడీ సర్కార్ను తిట్టడం కేసీఆర్ పని
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందనీ, వచ్చిన చిక్కల్లా ఏమిటంటే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వంతోనే ఇబ్బంది ఎదురవుతోందని ప్రధాని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు పనులు మాత్రమే చేసిందని చెప్పారు. పొద్దున, రాత్రి మోడీ సర్కార్ను తిట్టడం, దీని మీదనే కేంద్రీకరించడం ఈ ప్రభుత్వానికి ఏకైక పని అయిపోయిందన్నారు.
కుటుంబ పాలన సాగిస్తూ తెలంగాణకు తామే యజమానులమనే భావన పెంచుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా పతనం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఏ పథకం చేపట్టిన అందులో అవినీతి అక్రమాలు ప్రధానమయ్యాయని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోందన్నారు.
ఢిల్లీ వరకు కేసీఆర్ ప్రభుత్వ అవినీతి
కేసీఆర్ సర్కారు అవినీతి ఢిల్లీ వరకూ పాకిందని ప్రధాని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని రాష్ట్రాలు కలసి పని చేస్తుంటాయి కానీ, తొలిసారి అవినీతి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పని చేయడం దౌర్భాగ్యమంటూ తీవ్రంగా విమర్శించారు.
ఇందుకోసమా తెలంగాణ బలిదానాలు
తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి, త్యాగాల ద్వారా సాధించుకున్నారని ప్రధాని అన్నారు. రాష్ట్రంలో అవినీతి చూసేందుకేనా యువత ఆత్మబలిదానాలు చేసిందన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన ప్రజల ముందు బహిర్గతమైందని, మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు రకరకాల జిమ్మిక్కులను, కొత్త కొత్త నాటకాలను ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మాటలు పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కుటుంబ పాలనలో రాష్ట్రం చిక్కుకుంటుందని ప్రజలు అనుకోలేదని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబ పాలనతో అందరికీ చేటు
కుటుంబ పాలన అంటేనే తమ కొడుకు, బిడ్డ తప్ప దేశం కోసం, తెలంగాణ కోసం పనిచేయకుండా, ఇతరుల పిల్లలు నష్టపోయిన పట్టించుకోకుండా తమ స్వార్థం కోసం పనిచేస్తారని ప్రధాని విమర్శించారు. కుటుంబ పాలనలో అనేక అక్రమాలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ కుటుంబ పాలన, బీఆర్ఎస్ కుటుంబ పాలన అందరం చూస్తున్నామన్నారు.
ఈ రెండు పార్టీలు తెలంగాణకు ద్రోహులని విమర్శించారు. ఈ పార్టీల నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, కేసీఆర్ ప్రజలకు తీరని అన్యాయం చేశారని, ఇచ్చిన హామీలన్నింటిని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అవినీతి పాలనను దేశమంతా చూసిందని, కేసీఆర్ అవినీతి పాలనను తెలంగాణ చూసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిందని, యువతను మోసం చేసిందిని, ఉద్యమ కాలంలో ఎన్నో రకాల మాయమాటలు చెప్పి, లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. టీఎస్‌పీఎస్‌సీ స్కామ్ ద్వారా యువతను మోసం చేసి, అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు.
విద్యా సంస్థల పట్ల కేసీఆర్ నిర్లక్ష్యం
తెలంగాణ వర్శిటీలలో మూడు వేల అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రధాని విమర్శించారు.
పాఠశాలల్లో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థులకు కేసీఆర్ ద్రోహం చేశారన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని విశ్వాస ఘాతకునిగా మారారని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ఇవ్వలేదని, లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చేయలేదంటూ తీవ్రంగా విరుచుకబడ్డారు. రాష్ట్రా ప్రభుత్వంపై సర్పంచ్‌లు అందరూ ఆగ్రహంగా ఉన్నారన్నారు.
గ్రామపంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తోందని చెప్పారు. తొమ్మిదేళ్లలో కేంద్రం పంచాయతీలకు లక్ష కోట్లకు పైగా నిధులు ఇచ్చిందన్నారు. రైతులకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చాం, చేసి చూపించామని ప్రధాని చెప్పారు. తెలంగాణకు మెగా టెక్స్టైల్ పార్కు, ప్రస్తుతం రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, నేషనల్ హైవేలూ ఏర్పాటు చేయనునట్లు వివరించారు. ఎస్సీలు, ఎస్టీలు, పేదలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఆదివాసీ గ్రామాలకు ఎలాంటి మౌలిక సౌకర్యాలు కల్పించట్లేదనీ, మేము ఆదివాసీ ప్రాంతాల్లో ఆరులైన్ల రహదారులు వేస్తున్నామంటూ వివరించారు.
దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం
దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారిందన్నారు. ఆత్మనిర్భర భారత్‌లోనూ ప్రధాన భూమికగా అభివర్ణించారు. వ్యాక్సీన్ల తయారీలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తెలంగాణకు ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయనీ, పెట్టుబడుల ద్వారా ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయని చెప్పారు. ఇదంతా కేంద్రంలోని తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగానే సాధ్యమైందని మోడీ వివరించారు. ప్రపంచంలో భారతదేశానికి ప్రస్తుతం ప్రత్యేక గుర్తింపు లభించిందని మోడీ చెప్పారు. ఆ ఫలితాలు తెలంగాణకు కూడా అందుతున్నాయని ప్రధానమంత్రి మోడీ అన్నారు.
ఈ సభలో బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు ప్రసంగించారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం సభకు హాజరయ్యారు. సభ సందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్షం సభకు ఆటంకం కలిగిస్తుందేమోనని భయపడ్డప్పటికీ శనివారం ఉదయం నుంచి ఎలాంటి వర్ష సూచన లేకపోవడంతో బీజేపీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.