PM Modi | ప్రపంచం కోసం పని చేద్దాం: ప్రధాని మోదీ
PM Modi | విశ్వాస లోటును తొలగిద్దాం జీ 20 సదస్సులో ప్రధాని మోదీ అతిథులకు ఆత్మీయ స్వాగతం న్యూఢిల్లీ : ప్రపంచం పరస్పర విశ్వాస లోటును ఎదుర్కొంటున్నదని, మనమందరం దానిని పూడ్చే దిశగా కలిసికట్టుగా కృషి చేయాలని జీ20 చైర్మన్, ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మనం అంతా కలిసికట్టుగా కొవిడ్‌ను ఎదుర్కొని, విజయం సాధించామన్న మోదీ.. యుద్ధం వల్ల కలిగిన పరస్పర విశ్వాసలోటును కూడా అధిగమించగలమని చెప్పారు. కొవిడ్ తర్వాత ప్రపంచం విశ్వాస లోటును ఎదుర్కొంటున్నదని […]

PM Modi |
- విశ్వాస లోటును తొలగిద్దాం
- జీ 20 సదస్సులో ప్రధాని మోదీ
- అతిథులకు ఆత్మీయ స్వాగతం
న్యూఢిల్లీ : ప్రపంచం పరస్పర విశ్వాస లోటును ఎదుర్కొంటున్నదని, మనమందరం దానిని పూడ్చే దిశగా కలిసికట్టుగా కృషి చేయాలని జీ20 చైర్మన్, ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మనం అంతా కలిసికట్టుగా కొవిడ్‌ను ఎదుర్కొని, విజయం సాధించామన్న మోదీ.. యుద్ధం వల్ల కలిగిన పరస్పర విశ్వాసలోటును కూడా అధిగమించగలమని చెప్పారు. కొవిడ్ తర్వాత ప్రపంచం విశ్వాస లోటును ఎదుర్కొంటున్నదని చెప్పారు. యుద్ధం దాన్ని మరింత తీవ్రతరం చేసిందన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న జీ20 సదస్సు శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైంది.
ఈ సమావేశంలో ఇండియాను ‘భారత్’ అని మోదీ పలికారు. ‘ఒకే ధరిత్రి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్ తదితర దేశాధినేతలకు మోదీ స్వాగతం పలికారు. పలువురిని ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు. ప్రధాని ప్రతిపాదన మేరకు ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20 శాశ్వత సభ్య దేశంగా చేర్చుకున్నారు. ఈ ప్రకటన అనంతరం యూనియన్ ఆఫ్ ది కొమొరోస్, ఆఫ్రికన్ యూనియన్ చైర్‌పర్సన్ అజాలి అసౌమని వేదికపై ఆశీనులయ్యారు.
జీ20 అనేది భారతదేశంలో ప్రజల కార్యక్రమంగా మారిందని మోదీ చెప్పారు. 60కి పైగా నగరాల్లో 200కు పైగా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన సమస్యలకు సమాధానాలు వెతకాల్సిన కాలంలో మనం జీవిస్తున్నామని మోదీ చెప్పారు. ఈ సమయంలో మానవ కేంద్రీకృత విధానంతో మన బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఈ దిశగా ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ అనే భావన ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుందని చెప్పారు.
మొరాకో వెంటే ప్రపంచం
ఆఫ్రికాలోని మొరాకోలో సంభవించిన ఘోర భూకంపాన్ని ప్రస్తావించిన మోదీ.. ఈ విషాద సమయంలో యావత్ ప్రపంచం మొరాకో వెంట ఉంటుందని చెప్పారు. సాధ్యమైనంత మేర సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రగతిమైదాన్‌లోని ‘భారత మండపం’ వద్దకు తొలుత చేరుకున్నవారిలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్, ఐఎంఎఫ్ ఎండీ-చైర్మన్ క్రిస్టలీనా జార్జియేవా, డబ్ల్యూటీవో డైరెక్టర్ జనరల్ ఎన్‌గోజీ ఓంకాన్‌జో ఇవేయాల తదితరులు ఉన్నారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, జర్మన్ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని అల్బనెస్సీ, అర్జెంటీనా ప్రెసిడెంట్ అల్బెర్టో ఫెర్నాండెజ్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తదితరులను మోదీ సాదరంగా ఆహ్వానించారు.
సౌదీఅరేబియా కాబోయే యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, తదుపరి జీ20 అధ్యక్షుడు బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహాయే, అర్జెంటినా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌లను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. లూలా వెంట ఆయన భార్య, బ్రెజిలియన్ ప్రథమ పౌరురాలు రొసాంజెలా డా సిల్వా కూడా వచ్చారు.
విభిన్న యోగా భంగిమలు చిత్రించి ఉన్న గోడ, ఆయా దేశాల జాతీయ పతాకాల వెంట పరిచిన ఎర్రతివాచీపై ప్రపంచ నేతలు నడిచారు. నేపథ్య చిత్రంగా ఉన్న కోణార్క్ సూర్యదేవాలయంలోని కోణార్క్ చక్రం గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మోదీ వివరించడం కనిపించింది. మోదీకి సునాక్ నమస్కారం చెబుతూ స్వాగతించారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోదో, కొరియన్ ప్రెసిడెంట్ యూన్ సుక్ యేయోల్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు క్రిసిల్ రామాఫోసా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ యురుసులా వాన్ డెర్ లేయెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తదితరులకు భారత్ మండపం వద్ద ఘన స్వాగతం లభించింది.
చైనా తరఫున ప్రధాని లీ కియాంగ్, టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్, సింగపూర్ ప్రధాని లీ హసైయెన్, నైజీరియన్ అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబు, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టె, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా సయీద్ హుసేస్ ఖలీల్ ఎల్ సిసి, ఒమన్ ఉప ప్రధాని సయ్యీద్ అసద్ బిన్ తారిక్ అల్ సైద్, స్పెయిన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ నాడియా క్లావినో తదితరులకు ప్రధాని స్వాగతం పలికారు.