Prashant Kishor | ‘ఇండియా’ విచ్ఛిన్నానికి బీజేపీ కుట్ర
ప్రతిపక్ష ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ సృష్టించిన సంక్షోభమే బీహార్ పరిణామాలని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభివర్ణించారు

బీహార్ పరిణామాలు అందులో భాగమే
అవి బీజేపీకే నష్టాన్ని కలుగజేస్తాయి
నితీశ్‌ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు
ఆయనకు జీవితంలో ఇదే చివరి ఆట
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్
ఓ హిందీ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ
Prashant Kishor | న్యూఢిల్లీ : ప్రతిపక్ష ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ సృష్టించిన సంక్షోభమే బీహార్ పరిణామాలని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభివర్ణించారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తేనే ఆ పార్టీకి లాభమన్నారు. ‘ఒక్క నితీశ్‌కుమార్ మాత్రమే కాదు.. బీహార్‌లో బీజేపీ సహా అన్ని పార్టీలూ ఆయారాం గయారాం పార్టీలేనని ఆయన విమర్శించారు.
అయితే.. బీహార్ పరిణామాలు బీజేపీకి నష్టం చేస్తాయని చెప్పారు. ఈ మేరకు ఒక హిందీ వార్తా చానెల్‌కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే గెలిచేందుకు బలమైన అవకాశాలు ఉంటాయని అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రశాంత్‌కిశోర్ అన్నారు.
నితీశ్‌కు ఇదే ఆఖరాట
బీహార్‌లో మహాఘట్‌బంధన్‌తో నితీశ్ తెగతెంపులు చేసుకోవడాన్ని ప్రశాంత్‌కిశోర్ తీవ్రంగా విమర్శించారు. నితీశ్ ఆయన జీవితంలో ఆఖరి ఆట ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. నితీశ్‌కుమార్‌ను జిత్తులమారిగా అభివర్ణించిన పీకే.. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 20కి మించి సీట్లు గెలవలేదన్నారు. ‘ఏ కూటమిలో ఉండి పోటీ చేసినా నితీశ్‌కుమార్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 20 మించి సీట్లు తెచ్చుకోలేరు.
కాగా.. వారికి 20కి మించి సీట్లు వస్తే.. నేను నా పని వదిలేస్తా’ అని చెప్పారు. బీజేపీని పిల్లిమొగ్గల పార్టీగా అభివర్ణించిన పీకే.. బీహార్‌లో జేడీయూ-బీజేపీ కూటమి 2025 అసెంబ్లీ నాటికి ఉండబోదని పునరుద్ఘాటించారు. ‘ప్రజలు నితీశ్‌ను తిరస్కరించారు. అందుకే ఆయన తన పదవిని కాపాడుకునేందుకు ఏ పనైనా చేస్తారు’ అన్నారు.