Karur Stampede| తొక్కిసలాట ఘటనకు అసలు కారణం అదే : డీజీపీ
తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారసభలో జరిగిన తొక్కిసలాటలో 40మంది చనిపోయిన ఘటనపై తమిళనాడు డీజీపీ జీ.వెంకట్రామన్ స్పందించారు. అనుమతికి మించి జనం రావడం..విజయ్ ఆరు గంటలు ఆలస్యంగా చేరుకోవడం..అప్పటిదాకా వేచి చూసిన జనం ఒక్కసారిగి ముందుకు చొచ్చుకెళ్లడంతో తొక్కిసలాగకు దారితీసిందని తెలిపారు.

విధాత : తమిళనాడు(Tamil Nadu)లోని కరూర్‌లో సినీ నటుడు, టీవీకే(TVK) అధ్యక్షుడు విజయ్(Vijay) ప్రచారసభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో(Karur Stampede) 40మంది చనిపోవడం, మరో 50మందికి పైగా తీవ్రంగా గాయపడటం తెలిసిందే. ఈ సంఘటనపై తమిళనాడు డీజీపీ(DGP) జీ.వెంకట్రామన్ స్పందించారు. తొక్కిసలాటకు అసలు కారణంగా అనుమతికి మించి వచ్చిన జనమేనని..ఘటనలో పార్టీ నిర్వాహకుల వైఫల్యం ఉందని తెలిపారు. ర్యాలీకి 10,000 మందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, దాదాపు 50మందికిపైగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారని వెల్లడించారు. విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని ప్రకటించినా, దాదాపు 6 గంటలు ఆలస్యంగా వచ్చారని..అంతసేపు అభిమానులు తిండి, నీరు లేకుండా వేచి ఉన్నారన్నారు. విజయ్ రాకతో ఒక్కసారిగా ముందుకు చొచ్చుకెళ్లడంతో తొక్కిసలాట నెలకొందని తెలిపారు. తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ సహా నలుగురిపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. టీఎన్-పీపీడీఎల్ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కరూర్‌లో ఈ కేసు ఫైల్ అయిందని పేర్కొ్న్నారు.
తొక్కిసలాటపై రాజకీయ దూమారం
కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు రాజకీయ దూమారం రేగుతుంది. అటు విజయ్ ను అరెస్టు చేయవచ్చన్న ప్రచారంలో నేపథ్యంలో ఆయన ఇంటి వద్ధ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా గుమిగూడారు. మరోవైపు కరూర్ తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర గవర్నర్ ను, సీఎం స్టాలిన్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమిళనాడు బీజేపీ శాఖ ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
సీఎం స్టాలిన్ పరామర్శ
సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడి కరూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తమిళనాడు సీఎం స్టాలిన్(CM Stalin) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 40 మంది మృతిచెందారని తెలిపారు. రాజకీయ పార్టీ కార్యక్రమంలో ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై విచారణకు రిటైర్డ్ న్యాయమూర్తితో ఏకసభ్య విచారణ కమిషన్ నియమించామని తెలిపారు.
నా గుండె ముక్కలైంది : టీవీకే అధినేత విజయ్
కరూర్ తొక్కిసలాట ఘటనపై నటుడు..టీవీకే అధినేత విజయ్ స్పందించారు. ‘నా హృదయం ముక్కలైంది.. చెప్పలేని భరించలేని, వర్ణించలేని బాధ, దుఃఖంతో నేను విలవిలలాడుతున్నా. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ‘ఎక్స్’ వేదికగా విజయ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి పార్టీ పరంగా రూ.20లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షల పరిహారాన్ని విజయ్ ప్రకటించారు.