RanaBaali | ‘రణబాలి’ స్టోరీ ఇదేనా.. రాయలసీమ నేపథ్యంలో పీరియడ్ యాక్షన్ గాథగా విజయ్–రష్మిక చిత్రం
RanaBaali | ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట మూడోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
RanaBaali | ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట మూడోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన వెడ్డింగ్ పోస్టర్, అలాగే ‘ఏందయ్యా సామీ’ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దీంతో సోషల్ మీడియాలో ‘రణబాలి’ కథ ఇదేనంటూ ఓ స్టోరీ లైన్ వైరల్ అవుతోంది. ఆ కథనం గురించి తెలుసుకున్న నెటిజన్లు “బ్లాక్‌బస్టర్ పక్కా” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
1876 కరువు నేపథ్యం.. బ్రిటిష్ క్రూర యోజన
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం, ‘రణబాలి’ కథ 1876 ప్రాంతంలో, మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోని రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. కరువు కాటుతో విలవిల్లాడుతున్న సీమలో బ్రిటిష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్ ‘ఆర్టిఫిషియల్ ఫామైన్’ యోజన అమలు చేస్తాడు. గిడ్డంగుల్లో ధాన్యం నిల్వచేసి ప్రజలను ఆకలితో వంగదీసే కుట్ర చేస్తాడు. సీమను నిశ్శబ్ద శ్మశానంగా మార్చే ఆ ప్రయత్నం ప్రజలను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తుంది.
ఆశగా వెలిగే రణబాలి
ఈ చీకటి సమయంలో రంగంలోకి దిగేది రణబాలి. ఒకప్పుడు చిన్న సంస్థానానికి వారసుడైన అతను, బ్రిటిష్ కళ్లలో “సావేజ్”. కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఆశాకిరణం. తలపాగా, కళ్లలో అగ్ని, ఒంటిపై బందీఖానా ముద్రలతో అతని గతం గాయాలను గుర్తుచేస్తుంది. ప్రజల ఆకలి, అవమానం అతనిలో తిరుగుబాటు జ్వాలలు రగిలిస్తుంది.
రణబాలి తన గెరిల్లా ముఠాతో కలిసి బ్రిటిష్ గిడ్డంగులపై దాడులు ప్రారంభిస్తాడు. కేవలం అన్నం పంచడమే కాకుండా, దేశ సంపదను విదేశాలకు తరలిస్తున్న కాన్వాయ్‌లను అడ్డుకుంటాడు. ఆ సంపదతో చెరువులు తవ్వించడం, ఆయుధాలు సమకూర్చడం ద్వారా ప్రజల్లో తిరుగుబాటు స్పూర్తిని నింపుతాడు.
జయమ్మ – భావోద్వేగ బలం
ఈ పోరాటానికి నీడలా నిలిచేది జయమ్మ పాత్రలో కనిపించనున్న రష్మిక. కరువు తన కుటుంబాన్ని కబళించినా ఆమె ధైర్యం తగ్గదు. గడుసు స్వభావం, లోపల మంటతో కనిపించే జయమ్మ… రణబాలి యుద్ధానికి భావోద్వేగ బలంగా నిలుస్తుంది. వీరిద్దరి మధ్య బంధం సహజంగా, రా అండ్ రస్టిక్‌గా నడుస్తుందని టాక్. ప్రేమకంటే లక్ష్యం పెద్దదిగా కనిపించే ఈ జంట కథకు ప్రత్యేక బలం అందిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
క్లైమాక్స్ ట్విస్ట్?
రణబాలి తలను తెచ్చిన వారికి వెయ్యి ఎకరాల భూమి బహుమతిగా ఇస్తానని సర్ థియోడర్ హెక్టర్ ప్రకటిస్తాడు. అక్కడి నుంచి అసలు వేట మొదలవుతుంది. ఒకవైపు బ్రిటిష్ తుపాకులు, మరోవైపు రణబాలి వేటకొడవళ్ళు… యుద్ధం బలాల మధ్య మాత్రమే కాదు, సంకల్పాల మధ్య జరుగుతుంది.
చివరికి బ్రిటిష్ రికార్డుల్లో రణబాలి మరణించాడని నమోదు అయినా, రాయలసీమ మట్టి మాత్రం అతన్ని చరిత్ర పురుషుడిగా నిలబెడుతుంది. “చరిత్ర మనల్ని చచ్చిన వాళ్ల కింద లెక్కగట్టింది… కానీ మేము పుడమి పుత్రులం… మళ్లీ మళ్లీ పుడతాం!” అనే డైలాగ్‌తో కథ ముగుస్తుందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. పీరియడ్ బ్యాక్‌డ్రాప్, సహజమైన ప్రేమ కథ, బ్రిటిష్ కాలం దారుణాల మేళవింపుతో ‘రణబాలి’ ఒక చారిత్రక గాథగా ప్రేక్షకుల ముందుకు రానుందనే ఆసక్తి పెరుగుతోంది. అయితే వైరల్ అవుతున్న ఈ కథనం నిజమేనా? లేదా కేవలం ఊహాగానాలేనా? అన్నది సినిమా విడుదలయ్యాకే స్పష్టమవుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram