ChatGPT | చాట్ జీపీటీతో లాభమా? నష్టమా?

ChatGPT విధాత‌: ఇప్పుడంతా చాట్ జీపీటీ (చాట్ జనరేటెడ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్) ట్రెండ్ న‌డుస్తోంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో సాంకేతిక‌త స‌రికొత్త పుంత‌లు తొక్కుతోంది. మీ మొబైల్లో, ట్యాబ్‌లో, కంప్యూట‌ర్లో, లాప్‌టాప్‌లో ఈ చాట్ జీపీటీతో కావాల్సిన స‌మాచారాన్ని క్షణాల్లో పొందొచ్చు. మీరు జ‌స్ట్ హాయ్ అని టైప్ చేస్తే…. చాలు.. ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI) మీకు వెంట‌నే హలో! ఈ రోజు నేను మీకు ఎలా సహాయం చేయగలను? అంటూ సిద్ధమైపోతుంది. సాంకేతిక‌త పెరుగుతున్న కొద్దీ […]

ChatGPT | చాట్ జీపీటీతో లాభమా? నష్టమా?

ChatGPT

విధాత‌: ఇప్పుడంతా చాట్ జీపీటీ (చాట్ జనరేటెడ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్) ట్రెండ్ న‌డుస్తోంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో సాంకేతిక‌త స‌రికొత్త పుంత‌లు తొక్కుతోంది. మీ మొబైల్లో, ట్యాబ్‌లో, కంప్యూట‌ర్లో, లాప్‌టాప్‌లో ఈ చాట్ జీపీటీతో కావాల్సిన స‌మాచారాన్ని క్షణాల్లో పొందొచ్చు. మీరు జ‌స్ట్ హాయ్ అని టైప్ చేస్తే…. చాలు.. ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI) మీకు వెంట‌నే హలో! ఈ రోజు నేను మీకు ఎలా సహాయం చేయగలను? అంటూ సిద్ధమైపోతుంది.

సాంకేతిక‌త పెరుగుతున్న కొద్దీ మ‌నిషి చేయాల్సిన ప‌నుల‌న్నీ సులువుగా మారిపోతున్నాయి. కంప్యూట‌ర్‌తో మొద‌లైన ఈ సాంకేతిక విప్ల‌వం మొబైల్‌, ఇంట‌ర్నెట్‌తో వేగం పుంజుకుంది. మ‌నిషి రోజువారీ ప‌నుల్లో ఎక్కువ‌శాతం ఇప్పుడు ఈ కంప్యూట‌ర్లు, మొబైల్స్‌తో అయిపోతున్నాయి. బ‌స్ టికెట్లు మొదలుకొని, విమానం టికెట్ల వ‌ర‌కు, క‌రెంటు బిల్లులు మొద‌లుకుని, ఫుడ్ ఆర్డ‌ర్ల వ‌ర‌కూ అడుగు ముందుకు వేయ‌కుండా చేతివేళ్ల‌పై అయిపోతున్నాయి. ఈ మ‌ధ్య‌కాలంలో రోబో ఆప‌రేష‌న్లు కూడా జ‌రిగిపోతున్నాయి. దానికి మించిన టెక్నాల‌జీనే చాట్ జీపీటీ.

ఏంటీ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌?

చాట్జీపీటీ వంటి ఏఐ అంటే ఏమిటి!? ఇది మానవులు రూపొందించిన నాన్ లివింగ్ మాస్టర్ మైండ్. ఇది అన్ని కష్టతరమైన పనులను కేవలం కొన్ని సెకన్లలో చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో ఒక రూపమే ఈ చాట్ జీపీటీ (Chat GPT), దీని గురించి గూగుల్ (Google) వంటి చాలా పెద్ద కంపెనీలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ఇది మొద‌లైన కేవలం 5 రోజులలో ఒక‌ మిలియన్ వినియోగదారులను ఆక‌ర్షించిందంటే దీని ప‌వ‌ర్ ఏంటో తెలిసిపోయింది. ఒక మిలియ‌న్ క‌స్ట‌మ‌ర్స్‌ను సంపాదించ‌డానికి ప్ర‌పంచంలో ఎన్నో కంపెనీలు, పెద్ద పెద్ద యాప్‌లు ఎంతో శ్ర‌మ ప‌డుతున్నాయి. స‌మ‌యం కూడా తీసుకుంటున్నాయి.

చాట్‌ జీపీటీ 2021 వరకు మాత్ర‌మే సమాచారాన్ని కలిగి ఉంది, ఈ ఏఐ.. 2021కు ముందుకు సంబంధించి ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో ఉన్న స‌మాచారాన్ని కేవ‌లం ఒక ప‌దం ఆధారంగా మ‌న‌కు అందిస్తుంది. ఇదే మ‌నం ఒక స‌బ్జెక్టుకు సంబంధించి గూగుల్‌లో వెత‌కాలంటే సెర్చ్‌బార్‌లో ఒక్క ప‌దం టైప్ చేస్తే స‌రిపోదు, దానికి అద‌న‌పు స‌మాచారం కూడా అవ‌స‌ర‌మ‌వుతుంది. అప్పుడు కూడా గూగుల్ మ‌న‌కు కావాల్సిన స‌మాచారాన్ని ఇవ్వ‌దు. దానికి సంబంధించిన వెబ్‌సైట్ లింకుల‌ను మాత్ర‌మే చూపిస్తుంది.

కానీ ఇదే ప‌నికి సంబంధించి జీపీటీని చాట్ చేయమని అడిగినప్పుడు, అది స్వంతంగా ఒక లేఖను టైప్ చేసి స్క్రీన్‌పై చూపిస్తుంది. అంటే ఇంట‌ర్నెట్‌లో ఉన్న స‌మాచారాన్నంతా ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ క్రోడీక‌రించి మ‌న‌కు చిన్న వ్యాసం రూపంలో అందిస్తుంది. సామాన్యుల భాష‌లో చెప్పాలంటే మ‌న‌కు ఆక‌లేస్తోంది అంటే గూగుల్ బియ్యం, కాయ‌గూర‌లు, గ్యాస్ స్టౌను చూపిస్తే, చాట్ జీపీటీ వండి వార్చిన వంట‌ను మ‌న ముందుకు తెస్తుందన్న‌మాట‌.

చాట్ జీపీటీలో లోపాలేంటి?

ఇప్పుడు మ‌న‌మంతా చాలా అద్భుతంగా ఉందని ఆలోచిస్తూ ఉన్న ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు వ్య‌క్తుల‌నేకాదు, చ‌రిత్ర‌ను కూడా త‌ప్పుగా చూపించే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, 2021లో ఒక వ్య‌క్తిపై హ‌త్య‌, అత్యాచారం కేసు నమోదు అయి ఉండి, ఆ కేసులో అత‌ను 2022లోనో, 2023లోనో నిర‌ప‌రాధిగా కోర్టు తీర్పు వ‌చ్చి ఉంటే, చాట్ జీపీటీ మాత్రం ఆ వ్య‌క్తిని హంత‌కుడిగానే చూపిస్తుంది. ఇది ఆ వ్య‌క్తి ప్రతిష్ఠకు భంగం క‌లిగించే అంశం. చాట్ జీపీటీ వ‌ల్ల ఇలా ఎంద‌రో వ్య‌క్తిగ‌త ప్రతిష్ఠలకు భంగం క‌లిగే ప్ర‌మాదం ఉంద‌నే ఆందోళ‌నలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అది మ‌న విష‌యంలోనే జ‌రిగిందంటే ఎంత ఆందోళ‌న ప‌డ‌తామో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక రెండో విష‌యం ఏంటంటే, ఇంట‌ర్నెట్‌లో ఉన్న స‌మాచార‌మంతా కూడా నిజం కాక‌పోవ‌చ్చు. ఒక మంచి వ్య‌క్తి గురించి, సంస్థ గురించి గిట్ట‌నివారు లేనిపోని స‌మాచారాన్ని సృష్టించి ఉండ‌వ‌చ్చు. చాట్ జీపీటీ ఆ స‌మాచారం స‌రైన‌దా, త‌ప్పుడుదా అని నిర్ధారించలేదు. ఆ స‌మాచారానికి ఉన్న పవిత్రకు చాట్ జీపీటీ బాధ్య‌త తీసుకోదు. ఇదే దీంట్లో అతిపెద్ద లోపంగా క‌నిపిస్తోంది. దీనికి సంబంధించి ఇటీవ‌ల ఒక కేసు కూడా న‌మోదు అయింది.

డాక్ట‌ర్లు అయ్యే నైపుణ్యం పురుషులకు ఉన్నదా? లేక మహిళలకు ఉన్నదా? అన్న ప్ర‌శ్న‌కు చాట్ జీపీటీ 2021 నాటి దాని ఇంట‌ర్నెట్ డాటా ఆధారంగా మ‌గ‌వాళ్ల‌కే అని స‌మాధానం చెప్పింది. దీనిపై మ‌హిళ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి కేసు న‌మోదు చేసిన‌ట్లు వార్త‌ల్లో చూశాం. చాట్ జీపీటీ లింగ వివ‌క్ష చూపిస్తోంద‌నే విమ‌ర్శ‌లూ మ‌హిళా లోకం నుంచి వ‌చ్చాయి. భ‌విష్య‌త్తులో దేశాల మ‌ధ్య‌, జాతుల మ‌ధ్య‌, ప్రాంతాల మ‌ధ్య, కులాల మ‌ధ్య‌ ఈ చాట్ జీపీటీ స‌మాచారం చిచ్చు రేపే అవ‌కాశాలూ లేక‌పోలేదు.

వంద‌మంది మ‌నుషులు చేసే ప‌నిని ఒక్క చాట్ జీపీటీ నిముషాల్లో లేదా గంట‌ల్లో చేస్తోంది. దీంతో చాలామంది ఉద్యోగాలను కోల్పోతున్నారు కూడా. దీనివ‌ల్ల ఉపాధికి గండ‌మ‌నే ఆందోళ‌నలు ఉన్నాయి. ఇప్ప‌టికే కొన్ని కార్యాల‌యాల్లో మ‌నుషుల‌ను ఉద్యోగాల నుంచి త‌ప్పించి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా న‌డుపుతున్న ఉదంతాలూ ఉన్నాయి. టెలివిజ‌న్ రంగంలో ఈ మ‌ధ్య భార‌త్‌లోనే ప‌లు టీవీల్లో ఈ ఏఐ యాంక‌ర్‌లను పెట్టి వార్త‌లు చ‌దివిస్తున్నారు కూడా. దీని ప‌ర్యావ‌సానాల గురించి పూర్తిగా తెలియాలంటే ఇంకొద్దికాలం వేచి చూడాల్సిందే. అప్ప‌టివ‌ర‌కూ మీ ఫోన్లో ఉన్నచాట్ జీపీటీని వాడేసుకోండి.

  • యువతేజ రొద్దం