Railway Lands | 15 రోజుల్లో ఆక్రమణలు తొలగించండి.. మసీదులకు రైల్వేశాఖ నోటీసులు
Railway Lands విధాత: రైల్వే భూముల్లో వెలసిన ఆక్రమణలపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఆక్రమణలను తొలగించాలని సంబంధిత సంస్థలకు, వ్యక్తులకు రైల్వే శాఖ నోటీసులు జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే నార్తర్న్ రైల్వే అధికార యంత్రాంగం.. ఢిల్లీలోని ప్రముఖమైన రెండు మసీదులకు నోటీసులు జారీ చేసింది. రైల్వే భూముల్లో చేపట్టిన ఆక్రమణలను 15 రోజుల్లో తొలగించాలని బెంగాలీ మార్కెట్ మసీదు, బాబర్ షా టకియా మసీదులకు రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత సమయంలో […]

Railway Lands
విధాత: రైల్వే భూముల్లో వెలసిన ఆక్రమణలపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఆక్రమణలను తొలగించాలని సంబంధిత సంస్థలకు, వ్యక్తులకు రైల్వే శాఖ నోటీసులు జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే నార్తర్న్ రైల్వే అధికార యంత్రాంగం.. ఢిల్లీలోని ప్రముఖమైన రెండు మసీదులకు నోటీసులు జారీ చేసింది.
రైల్వే భూముల్లో చేపట్టిన ఆక్రమణలను 15 రోజుల్లో తొలగించాలని బెంగాలీ మార్కెట్ మసీదు, బాబర్ షా టకియా మసీదులకు రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత సమయంలో ఆక్రమణలు తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రైల్వే భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించాలని సంబంధిత సంస్థలను కోరుతున్నామని తెలిపారు. రైల్వే స్థలాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలు, మసీదులు, దేవాలయాలు, ఇతర మందిరాలను తొలగించాలని ఆదేశిస్తున్నామని చెప్పారు.
ఒక వేళ నిర్ణీత సమయంలో ఆక్రమణలు తొలగించకపోతే రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ కట్టడాలను తొలగించే సమయంలో జరిగే నష్టానికి తాము బాధ్యులం కాదని స్పష్టం చేశారు.
తమ స్థలాన్ని ఆక్రమించుకున్నారంటూ 400 ఏండ్ల నాటి బాబా షా టకియా మసీదుకు అధికారులు నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉందని మసీదు సెక్రటరీ అబ్దుల్ గఫర్ పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు పక్కనే మలేరియా కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని కూడా తొలగించాలని నోటీసులు అంటించారు రైల్వే అధికారులు.
కాగా, గతంలో రైల్వే అధికారులు హనుమంతుడికి కూడా ఇలాంటి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ‘మీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.. వెంటనే ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటాం’ అంటూ అంజనీపుత్రునికి మధ్యప్రదేశ్‌లోని రైల్వే అధికారులు ఫిబ్రవరి 13న హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే.