MMTS: పానిక్ మోడ్ బటన్స్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం!
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో తాజాగా ఎంఎంటీఎస్ రైలు మహిళా బోగీలో ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతిపై ఓ ఆగంతకుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనతో అప్రమత్తమైన రైల్వే శాఖ మహిళల భద్రత కోసం ఎంఎంఎంటీఎస్ రైళ్లలో పానిక్ మోడ్ బటన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

MMTS : రైళ్లలో మహిళల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో తాజాగా ఎంఎంటీఎస్ రైలు మహిళా బోగీలో ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతిపై ఓ ఆగంతకుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనతో అప్రమత్తమైన రైల్వే శాఖ మహిళల భద్రత కోసం ఎంఎంఎంటీఎస్ రైళ్లలో పానిక్ మోడ్ బటన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పానిక్ బటన్ ప్రెస్ చేయగానే క్షణాల్లో రైల్వే పోలీస్ వచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఆర్పీఎఫ్ పోలీసులు సైతం రైళ్లతో ప్రయాణిస్తూ మహిళల భద్రతను పర్యవేక్షిస్తారు. ఎంఎంటీఎస్ రైళ్లలో భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సమీక్ష చేశారు. సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలులో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి రైలులో ప్రయణికుల భద్రతను ఒక రైల్వే పోలీస్ అధికారి పర్యవేక్షణ చేయాలని నిర్ణయించారు. రైళ్లలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.
చిక్కని.. నిందితుడి ఆచూకీ
ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడి యత్నం చేసి నిందితుడిని గుర్తించడంలో పోలీసులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పాత నేరస్తుడు జంగం మహేశ్ గా తొలుత ఫోటో ఆధారంగా గుర్తించిన బాధితురాలు.. నేరుగా అతడిని చూపించాక అతడు కాదని చెప్పడంతో, మరికొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలు చెప్పిన వివరాల మేరకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఎంఎంటీఎస్ రైలు ఎక్కిన నిందితుడు ఎక్కడ దిగాడన్న దానిపై పోలీసులకు స్పష్టత రావడం లేదు. ఆ మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లు, పరిసరాల్లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ తో పాటు పలు విభాగాలకు చెందిన నగర పోలీసు విభాగాలకు చెందిన 13బృందాలు నిందితుడు ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుండటంతో సీసీటీవీ కెమెరాలు అన్ని పని చేయడం లేదు. దీంతో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మధ్యలో ఉన్న 14 రైల్వేస్టేషన్లు, వాటి సీసీటీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇప్పటి వరకు 150కి పైగా సీసీటీవీలు తనిఖీ చేశారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. రైల్వే ఎస్పీ చందనా దీప్తీ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు నిందితుడు దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కిందకు దూకిన బాధిత యువతి ఆసుపత్రిలో కోలుకుంటున్నది. రైలు నుంచి దూకిన కారణంగా ఆమె దవడకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు వెల్లడించారు. కాలు విరగడంతో దానికి సర్జరీ నిర్వహిస్తామని తెలిపారు. పై దంతాలు ఊడిపోవడంతో అవసరాన్ని బట్టి ఆపరేషన్ చేస్తామని తెలిపారు.